సీబీఐ ఏం తేలుస్తుందో.. సుశాంత్ కేసుపై మహారాష్ట్ర హోంమంత్రి..

ABN , First Publish Date - 2020-09-28T20:12:44+05:30 IST

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు దర్యాప్తు పరిస్థితిపై సీబీఐని ఉద్దేశించి మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ...

సీబీఐ ఏం తేలుస్తుందో.. సుశాంత్ కేసుపై మహారాష్ట్ర హోంమంత్రి..

ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు దర్యాప్తు పరిస్థితిపై సీబీఐని ఉద్దేశించి మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ స్పందించారు. ఈ కేసులో ముంబై పోలీసులు అత్యంత సమర్థంగా దర్యాప్తు చేస్తున్నప్పటికీ.. ఉన్నపళంగా సీబీఐకి అప్పగించారని ఆయన పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు సీబీఐ ఏం తేలుస్తుందోనని తాము ఎదురుచూస్తున్నామన్నారు. 34 ఏళ్ల సుశాంత్ ఈ ఏడాది జూన్ 14న ముంబైలోని తన నివాసంలో విగతజీవిగా కనిపించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన మృతి చెందిన తీరుపై అనుమానాలు వ్యక్తం కావడంతో తొలుత ముంబై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే కొద్ది రోజులకే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది.


ఈ నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు జరుగుతున్న తీరుపై ఇవాళ హోంమంత్రి అనిత్ మాట్లాడుతూ... ‘‘సుశాంత్ కేసును ముంబై పోలీసులు ప్రొఫెషనల్‌గా దర్యాప్తు చేస్తున్నప్పటికీ... దీన్ని ఉన్నట్టుండి సీబీఐకి అప్పగించారు. ఇప్పుడు వారి దర్యాప్తు ఫలితం కోసం మేము కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడా లేక హత్యకు గురయ్యాడా అన్నదే ప్రజలు అడుగుతున్నారు. అయితే సీబీఐ ఏం చెబుతుందా అని మేము కూడా ఎదురుచూస్తున్నాం...’’ అని పేర్కొన్నారు. కాగా సుశాంత్ కేసును తొలుత సీబీఐకి అప్పగించేందుకు మంత్రి అనిల్ తొలుత విముఖత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సుశాంత్ మృతి వెనుక కారణాలను వెలికితీసే దిశగా ముంబై పోలీసులే విచారణ జరుపుతారని ఆయన పలుమార్లు స్పష్టం చేశారు కూడా. ప్రస్తుతం సుశాంత్ కేసులో సీబీఐతో పాటు.. డ్రగ్స్, మనీ ల్యాండరింగ్ కోణాలపై ఎన్‌సీబీ, ఈడీలు కూడా దర్యాప్తు చేస్తున్నాయి. 

Updated Date - 2020-09-28T20:12:44+05:30 IST