Abn logo
Oct 12 2021 @ 02:13AM

స్తంభించిన ముంబై

లఖీంపూర్‌ ఘటనకు నిరసనగా మహారాష్ట్రలో బంద్‌.. పాల్గొన్న అధికార పార్టీల శ్రేణులు 

ముంబై/లఖ్‌నవూ/న్యూఢిల్లీ, అక్టోబరు 11: లఖీంపూర్‌ ఖీరీ ఘటనకు నిరసనగా మహారాష్ట్రలో అధికార పార్టీలు శివసేన, ఎన్సీపీ, బీజేపీ ఇచ్చిన బంద్‌ పిలుపు ప్రధాన నగరాలపై తీవ్రంగా కనిపించింది. అధికార పార్టీలే నిర్వహించడంతో.. అక్కడక్కడా చెదురుమదురు సంఘటనలు మినహా.. బంద్‌ విజయవంతమైంది. నిత్యం ట్రాఫిక్‌ రద్దీతో బిజీగా ఉండే ముంబై నగరం దాదాపుగా స్తంభించిపోయింది. రవాణా సేవలు ఆగిపోయాయి. మరాఠ్వాడలోనూ బంద్‌ ప్రభావం తీవ్రంగా కనిపించడంతో.. ముంబై-బెంగళూరు రహదారిపై రాకపోకలు మందకొడిగా సాగాయి. విదర్భ ప్రాంతంలో మాత్రం బంద్‌ పాక్షికంగా కొనసాగింది.


11 బస్సుల ధ్వంసం

ఆదివారం అర్ధరాత్రి దాటాక.. రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ ప్రారంభమైంది. సోమవారం ఉదయం బృహన్‌ముంబై ఎలక్ట్రిక్‌ సప్లయ్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌(బె్‌స్ట)కు చెందిన సిటీ బస్సులు అక్కడక్కడా కనిపించాయి. ఆందోళనకారుల బస్సులపై రాళ్లు రువ్వడంతో.. అధికారులు రవాణా సేవలను నిలిపివేశారు. ముంబై నగరంలోని పలు ప్రాంతాల్లో మొత్తం 11 బెస్ట్‌ బస్సులను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. వీటిలో ఒకటి అద్దెబస్సు  అని బెస్ట్‌ అధికారులు తెలిపారు. అయితే.. మధ్యాహ్నం తర్వాత నెమ్మదిగా బస్సుల పునరుద్ధరణ జరిగిందని, 3వేలకు గాను 1,833 సర్వీసులను నడిపామని వివరించారు. ముంబై నుంచి రాష్ట్రంలోని ఇతర నగరాలు, జిల్లాలకు మాత్రం మహారాష్ట్ర ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడిచాయి. పుణె, నవీ ముంబై, థానె, కల్యాణ్‌, వాసాయ్‌(పాల్ఘార్‌) తదితర నగరాల్లోనూ రవాణా సేవలు స్తంభించిపోయాయి. 


బీజేపీ ప్రతిదాడి

అధికార పార్టీల బంద్‌పై బీజేపీ ప్రతిదాడి చేసింది. ‘‘ఇది రైతుల కోసం నిర్వహించిన బంద్‌ కాదు. అధికార పార్టీ నేతలపై కేంద్ర సంస్థల దాడులు, విచారణకు వ్యతిరేకంగా జరుగుతున్న బంద్‌. కరోనాతో కుదేలైన ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుని రోడ్లపైకి వస్తున్నారు. పండుగ సీజన్‌లో హడావుడి ఉంటుంది. ఇలాంటి సమయంలో బంద్‌ చేయడం బాధ్యతారాహిత్యమే’’ అని బీజేపీ ఎమ్మెల్సీ నిరంజన్‌ దవ్ఖరే, ఎమ్మెల్యే సంజయ్‌ కేల్కర్‌ ఆరోపించారు. సోమవారం నాటి బంద్‌కు ప్రజల నుంచి పెద్దగా స్పందన లేదన్నారు. కాగా.. ప్రభుత్వమే బంద్‌కు పిలుపునివ్వడంపై సుమోటోగా కేసును విచారించాలని ముంబైకి చెందిన ఓ న్యాయవాది బాంబే హైకోర్టును కోరారు. లఖీంపూర్‌ ఖీరీ ఘటనపై ముందు నుంచి రైతులకు అనుకూలంగా మాట్లాడుతున్న బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీపై శివసేన ప్రశంసల జల్లు కురిపిస్తూ తన అధికార పత్రిక సామ్నాలో సంపాదకీయం ప్రచురించింది.  


అజయ్‌ మంత్రిగా ఉంటే న్యాయం జరగదు: ప్రియాంక 

అజయ్‌ మిశ్రా మంత్రిగా ఉన్నంత కాలం.. ఆయన కుమారుడు నిందితుడుగా ఉన్న లఖీంపూర్‌ కేసులో బాధితులకు న్యాయం జరగదని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఆయనను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. లఖీంపూర్‌ ఘటనకు నిరసనగా లఖ్‌నవ్‌లో కాంగ్రెస్‌ నిర్వహించిన మౌనప్రదర్శనలో పాల్గొనడానికి ముందు ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అటు సీనియర్‌ నేత రాహుల్‌గాంధీ కూడా ఢిల్లీలో జరిగిన మౌనవ్రతంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అజయ్‌ మిశ్రాను మంత్రి పదవిని తొలగించకపోవడం వల్ల.. కేంద్రంలోని బీజేపీ సర్కారు లఖీంపూర్‌ కేసులో న్యాయం జరగకుండా అడ్డుపడుతోందని ఆరోపించారు. కాగా, లఖీంపూర్‌ ఘటనలో చనిపోయిన నలుగురు రైతుల ఆత్మశాంతికి మంగళవారం ‘అంతిమ ప్రార్థనలు’ నిర్వహించనున్నట్లు భారత్‌ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) ప్రకటించింది. ఈ వేదికపై రాజకీయాలకు ఎలాంటి తావు ఉండబోదని వెల్లడించింది.  


మార్కెట్లు, దుకాణాల బంద్‌

విదర్భ ప్రాంతం మినహా.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నిత్యావసర దుకాణాలు మినహా మార్కెట్లు, వ్యాపార సంస్థలు, దుకాణాలు మూతపడ్డాయి. మరాఠ్వాడ ప్రాంతంలో అక్కడక్కడా దుకాణాలు తెరిచి ఉన్నా.. సింహభాగం మార్కెట్లు, వ్యాపార సంస్థలు తెరుచుకోలేదు. విదర్భ పరిధిలోని నాగ్‌పూర్‌, గోండియా, యవత్మాల్‌, బుల్ధానా, అమరావతి జిల్లాల్లో స్కూళ్లు, దుకాణాలు యథావిధిగా నడిచాయి.  రాష్ట్రంలోని చాలా ప్రదేశాల్లో చిన్న, మధ్యతరహా పరిశ్రమల యాజమాన్యాలు లఖీంపూర్‌ ఘటనను నిరసించినా.. బంద్‌లో పాల్గొనబోమని ప్రకటించాయి. బంద్‌ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అధికార పార్టీల నేతలే బంద్‌ పాటిస్తున్నా.. పలు చోట్ల శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.