‘అన్‌లాక్’ దిశగా మహారాష్ట్ర... ముంబై విషయంలో మాత్రం

ABN , First Publish Date - 2021-06-03T23:54:40+05:30 IST

కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఉద్ధవ్ సర్కార్ ‘అన్‌లాక్’ దిశగా ప్రయాణిస్తోంది. ప్రస్తుతం అమలులో

‘అన్‌లాక్’ దిశగా మహారాష్ట్ర... ముంబై విషయంలో మాత్రం

ముంబై:  కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఉద్ధవ్ సర్కార్ ‘అన్‌లాక్’ దిశగా ప్రయాణిస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలను సడలించాలని నిర్ణయించుకున్నారు. ఐదు దశల్లో ఈ అన్‌లాక్‌ ప్రక్రియను జాగ్రత్తగా అమలు చేయనున్నారు. అయితే ముంబై మహా నగరాన్ని ఇందుకు మినహాయించనున్నారు. మిగితా జిల్లాల్లో మాత్రం అన్‌లాక్ ప్రక్రియను అమలు చేయనున్నారు. ప్రస్తుతం ముంబై లెవల్‌-2 లో ఉందని, అందుకే లోకల్ రైళ్లు ప్రజలకు అందుబాటులోనే ఉంటాయని విపత్తు నిర్వహణా మంత్రి విజయ్ వాడేట్టివార్ ప్రకటించారు. అయితే ముంబైలో పాజిటివిటీ రేటు తగ్గితే ముంబైను కూడా అన్‌లాక్ చేసే దిశగా ఆలోచిస్తామని ఆయన పేర్కొన్నారు.


ప్రస్తుతం మహారాష్ట్రను 5 స్థాయిల్లో విభజించామని, కొన్ని జిల్లాలను లెవల్ 1 గా ప్రకటించామని, అక్కడ అన్‌లాక్ ‌ప్రక్రియను అమలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఔరంగాబాద్, భండారా, ధులే, గడ్చిరౌలి, జల్‌గావ్, నాందేడ్, నాసిక్, పర్భణి, థానే లెవల్-1 కిందికే వస్తాయని ఆయన వివరించారు. ఇక లెవల్‌-2 లో ముంబాయిను మినహాయించి, అమరావతి, హింగోలీ, నందూర్‌బార్ జిల్లాలు ఉంటాయని మంత్రి విజయ్ వివరించారు. లెవల్-1 జాబితాలో ఉన్న జిల్లాలను పూర్తి అన్‌లాక్ చేస్తామని, తొందర్లోనే తగిన మార్గదర్శకాలను జారీ చేస్తామని ఆయన వెల్లడించారు. పాజిటివిటీ రేటు 5 శాతంగా ఉండి, 25 శాతం పడకల సౌలభ్యం ఉన్న జిల్లాలను అన్‌లాక్ చేస్తామని, ఆ ప్రాంతాల్లో థియేటర్లు, మాల్స్‌ను కూడా ఓపెన్ చేస్తామని మంత్రి విజయ్ ప్రకటించారు. అంతేకాకుండా పాఠశాలలు, సినిమా షూటింగ్‌లు, వివాహాలు, అంతిమ సంస్కారాలకు కూడా అక్కడ అనుమతినిస్తామని మంత్రి పేర్కొన్నారు. అయితే ముంబై మహానగరం విషయంలో మాత్రం ఈ నెల 15 తర్వాతే ఆలోచిస్తామని మంత్రి విజయ్ స్పష్టం చేశారు.

Updated Date - 2021-06-03T23:54:40+05:30 IST