సాగర్‌ కాల్వలకు మహర్దశ

ABN , First Publish Date - 2021-07-30T05:49:51+05:30 IST

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఎడమ కాల్వ అసంపూర్తి పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం రూ.29 కోట్లు విడుదల చేసింది.

సాగర్‌ కాల్వలకు మహర్దశ
సాగర్‌ ఎడమకాల్వపై నడిగూడెం మండలం రామాపురం వద్ద శిథిలమైన లైనింగ్‌

 లైనింగ్‌ పనులకు రూ.29కోట్ల నిధులు

 అసంపూర్తి పనుల పూర్తికి కేటాయింపు

నడిగూడెం, జూలై 29 : నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఎడమ కాల్వ అసంపూర్తి పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం రూ.29 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో  హుజూర్‌నగర్‌ సబ్‌డివిజన్‌ పరిధిలో ప్రతిపాదించిన పనులను పూర్తి చేయనున్నారు. జిల్లాల విభజన అనంతరం ప్రాజెక్టు పరిధిలోని ఎడమ కాల్వ పరిధిలోని పెన్‌పహాడ్‌ మండలం దోసపాడు నుంచి (74 కిలోమీటరు రాయి) నుంచి నడిగూడెం మండలం కాగితరామచంద్రాపురం వద్ద గల రంగుల వంతెన (133.56 కిలోమీటరు) వరకు సూర్యాపేట జిల్లా పరిధిలోకి తీసుకువచ్చారు. జనవరిలో విభజన జరగ్గా అదే సమయంలో కాల్వల పర్యవేక్షణకు సీఈ, డీఈలను నియమించారు. అదేవిధంగా హుజూర్‌నగర్‌ పరిధి కూడా ఎస్‌ఈలను, ఎస్‌ఈలను ప్రభుత్వం నియమించింది. అనంతరం తొలిసారి కాల్వల మరమ్మతులకు పరిపాలన అనుమతి లభించింది. 2017లోనే 90 శాతం పనులు పూర్తి చేయగా, మిగిలిన పనులు సాంకేతిక కారణాలతో నిలిచాయి. తాజాగా విడుదల చేసిన రూ.29 కోట్ల నిధులతో 74 కిలోమీటరు నుంచి 115వ కిలోమీటరు వరకు వివిధ రకాల పనులను చేప ట్టాల్సి ఉంది. అయితే ప్రభుత్వం నుంచి సాంకేతిక అనుమతులు లభించి టెండర్ల ప్రక్రియ పూర్తయ్యాక ఈ ఏడాది ఆగస్టు నుంచి పనులు మొదలైతే వచ్చే ఏడాది ఆగస్టు వరకు పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు ఎన్నెస్పీ అధికారులు తెలిపారు. 

రూ.29 కోట్లతో చేపట్టే పనులు

ఎడమకాల్వపై రూ.29కోట్లతో జిల్లాలో చేపట్టే పనుల వివరాలు ఇలా ఉన్నాయి. దోసపాడు నుంచి మునగాల వరకు ఎడమకాల్వ ఇరువైపులా లైనింగ్‌, శిథిలమైన చోట కొత్తగా కాంక్రీట్‌ పనులు చేపడతారు. రాళ్లు(రివిట్‌మెంట్‌) ఊడిపడిన చోట మరమ్మతులు చేయడం కాల్వ కట్టలు కుంగి కోతకు గురైన ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు. మట్టి పనులతో పాటు యూ టీలు, ఎస్కేప్‌ వంతెన వంతెన మరమ్మతులు, స్టార్చర్ల ఏర్పాటు, అవసరమైన చోట రక్షణగోడల నిర్మిస్తారు. 74 నుంచి 115 కిలోమీటర్ల వరకు నాలుగు చోట్ల రాంపులు, మరో నాలుగు చోట్ల మెట్లను నిర్మించాలని నిర్ణయించారు. లైనింగ్‌, కాల్వకట్టలను పటిష్ఠం చేసి ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్‌ ఎడమకాల్వలోకి నీటి ప్రవాహం సాఫీగా జరిగేలా పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. 

కొత్తగా ప్రతిపాదనలు

ఎడమకాల్వ విభజనకు ముందే హుజూర్‌నగర్‌ సబ్‌డివిజన్‌ పరిధిలో ప్రతిపాదించిన పనులకు రూ.29 కోట్లు మంజూరయ్యాయి. కాగా మునగాల నుంచి ఖమ్మం జిల్లా పాలేరు వరకు 115 నుంచి 133.56 కిలోమీటర్ల వరకు మిగిలిన పనులకు ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిసింది. ఈ పరిధిలో ఎడమకాల్వ లైనింగ్‌, కాల్వకట్టల పటిష్ఠం, తూములు, షట్టర్ల ఏర్పాటు పనులను చేపట్టాలని ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం. ఆధునీకరణ తరువాత ఎడమకాల్వపై అసంపూర్తి పనులను గుర్తించి వాటిని పూర్తి చేసేందుకు సూర్యాపేట చీఫ్‌ ఇంజనీర్‌ రమే్‌షకుమార్‌ పర్యవేక్షణలో తాజా పనుల నిధులకు ప్రణాళికలు రూపొందించారు. ఆగస్టులో ఎడమకాల్వకు నీటి విడుదలకు ముందే నిధులు మంజూరైతే కంపచెట్ల తొలగింపు, మట్టి తోలకం, కాల్వ కట్టల పటిష్ఠం వంటి పనులు చేపట్టే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలిసింది. టెండర్ల ప్రక్రియ ఆలస్యమైతే వారబంధీ విధానం(ఆన్‌అండ్‌ఆ్‌ఫ) సమయంలో అవకాశం ఉన్న పనులను చేపట్టి, వచ్చే ఏడాది వేసవిలో అన్ని పనులు పూర్తిచేసేలా అధికారులు కసరత్తు చేస్తునట్లు తెలిసింది.

 రూ.27 లక్షలతో తాత్కాలిక మరమ్మతులు

జిల్లాలోని ఎడమకాల్వపై రూ.27 లక్షలతో తాత్కాలిక మరమ్మతు పనులను ఎన్నెస్పీ అధికారులు నిర్వహిస్తున్నారు. రూ.17 లక్షలతో మర్రికుంట వద్ద ప్రధాన కాల్వకట్ట కుంగిపోవడంతో పునరుద్ధరించే పనులు చేస్తున్నారు. రూ.10లక్షలతో ముక్త్యాల బ్రాంచ్‌ కెనాల్‌కు నీరందించే మునగాల రెగ్యులరేటర్‌ మరమ్మతులు జరుగుతున్నాయి. బోతవోలు ఎస్కేప్‌ పనులు చేపట్టారు. రామాపురం వద్ద హైలెవల్‌ తూము శిథిలం కావడంతో కొత్త షెట్టర్లు ఏర్పాటు చేయనున్నారు. మూడేళ్ల తర్వాత ఎడమ కాల్వ పనులు జరుగుతుండగా, ఈ పనులతో ఆయకట్టు రైతులు పడుతున్న ఇబ్బందులు తొలగనున్నాయి. 

ఏడాదిలోగా పూర్తికి కృషి : రఘు, డీఈ, ఎన్నెస్పీ

అసంపూర్తి పనులకు ప్రతిపాదించిన మేరకు రూ.29కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని ఎన్నెస్పీ డీఈ రఘు తెలిపారు. పరిపాలన అనుమతి లభించినా, సాంకేతిక అనుమతి రావాల్సిఉందన్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తయ్యాక పనులను చేపడుతామన్నారు. పనులను ఏడాదిలోగా పూర్తిచేసేలా కృషి చేస్తామన్నారు. 115 నుంచి 133.5 కిలో మీటర్ల వరకు అవసరమై పనులకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నామన్నారు.


Updated Date - 2021-07-30T05:49:51+05:30 IST