మహాశివరాత్రి ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-03-05T06:03:59+05:30 IST

మహాశివరాత్రి ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలి

మహాశివరాత్రి  ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలి
ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, ఎస్పీ రాహుల్‌హెగ్డే

-  కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌

 - జాతర ఏర్పాట్ల పరిశీలన 

- అధికారులతో సమీక్ష 

వేములవాడ, మార్చి 4 : మహాశివరాత్రి జాతర ఉత్సవాల ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ అధికారులను ఆదేశించారు. వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో ఈ నెల 10వ తేదీ నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న మహాశివరాత్రి జాతర ఉత్సవాల ఏర్పాట్లను  ఎస్పీ రాహుల్‌ హెగ్డే, ఆలయ ఈవో కృష్ణప్రసాద్‌తో కలిసి గురువారం పరిశీలించారు.  అనంతరం ఆలయ అతిథి గృహంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా  కలెక్టర్‌  మాట్లాడుతూ మంత్రి కే.తారకరామారావు నిర్వహించిన సమీక్ష సందర్భంగా తీసుకున్న నిర్ణయాల మేరకు  వచ్చే మూడు, నాలుగు రోజుల్లో ఏర్పాట్లను పూర్తిచేయాలన్నారు. గతంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని  పునరావృతం కాకుండా చూడాలన్నారు. ముఖ్యంగా స్వామివారి దర్శనం, తాగునీటి సౌకర్యం, పారిశుధ్య నిర్వహణ, రవాణా సౌకర్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జాతర సందర్భంగా పట్టణాన్ని పరిశుభ్రతపై మున్సిపల్‌ అఽదికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దూర ప్రాంతాల నుంచి యాత్రికులు వేములవాడకు తరలివచ్చే విధంగా ఆర్టీసీ సంస్థ తరపున తగినన్ని బస్సులు నడిపించాలన్నారు. యాత్రికుల వాహనాలను నిలిపేందుకు పార్కింగ్‌ స్థలాలను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఆలయ ఓపెన్‌ స్లాబ్‌ ప్రాంగణంలో సెంట్రల్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహాశివరాత్రి రోజున స్వామివారిని దర్శించుకోవడంలో సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, క్యూలైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆలయ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే మాట్లాడుతూ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  రెండు వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు  నిర్వహిస్తున్నట్లు  చెప్పారు. అదనపు సీసీ కెమెరాలతో జాతరలో నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆలయ ఈవో కృష్ణప్రసాద్‌, డీఎస్పీ చంద్రకాంత్‌, పట్టణ సీఐ  వెంకటేశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శ్యాంసుందర్‌రావు, ఆలయ ఈఈ రాజేశ్‌, డీఈ రఘునందన్‌, ఆర్‌అండ్‌బీ డీఈ సురేశ్‌బాబు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-05T06:03:59+05:30 IST