ఆ తల్లికి అపూర్వమైన గిఫ్ట్‌ ఇచ్చిన మహీంద్రా...

ABN , First Publish Date - 2020-09-21T23:13:27+05:30 IST

తన తల్లికి మరచిపోలేని కానుకనిద్దామనుకున్నాడో కుమారుడు. ఈ క్రమంలో... ఇరవై ఏళ్లనాటి స్కూటర్‌‌పై దేశవ్యాప్తంగా పలు చారిత్రాత్మక, ఆధ్యాత్మిక ప్రదేశాలను ఆమెకు చూపిస్తూ... మొత్తం 56 వేల కిలో టర్ల కు పైగా ప్రయాణించాడు.

ఆ తల్లికి అపూర్వమైన గిఫ్ట్‌ ఇచ్చిన మహీంద్రా...

మైసూర్‌ :  తన తల్లికి మరచిపోలేని  కానుకనిద్దామనుకున్నాడో కుమారుడు.  ఈ క్రమంలో... ఇరవై ఏళ్లనాటి స్కూటర్‌‌పై దేశవ్యాప్తంగా పలు చారిత్రాత్మక, ఆధ్యాత్మిక ప్రదేశాలను ఆమెకు చూపిస్తూ... మొత్తం 56 వేల కిలో టర్ల కు పైగా ప్రయాణించాడు. 


ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా... ఆ తల్లీకుమారులకు ... ఓ మహీంద్రా కేయూవీ 100  నెక్ట్స్‌ను వారికి  కానుకగా అందించారు. వివరాలిలా ఉన్నాయి.


కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన క్రిష్ణకుమార్ గతంలో కార్పొరేట్ కంపెనీలో ఉన్నతోద్యోగం చేసేవారు. ఎప్పుడూ ఇంటి బాధ్యతలకే పరిమితమైన తల్లి చూడారత్న రుణం కొంతైనా తీర్చుకోవాలనుకున్నారు. 'మాతృ సేవా సంకల్ప యాత్ర' పేరుతో తన తల్లికి ఓ కొత్త లోకాన్ని పరిచయం చేయాలనుకున్నారు. అందుకు తగట్టుగానే... ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం తన తండ్రి బహుమతిగా ఇచ్చిన ఓ స్కూటర్‌ను అందుకు ఎంచుకున్నారు.


ఈ ఏడాది జనవరి నాటికి ఆ స్కూటర్‌పై మొత్తం 56,552 కిలో మీటర్లు ప్రయాణించారు. అయితే... ఇతని గురించి ఓ వీడియోను షేర్ చేస్తూ... ‘ఇది ఒక అందమైన కథ. తల్లిపై, దేశంపై ఓ వ్యక్తికి ఉన్న ప్రేమకు ఇది నిదర్శనం. ఆయనకు ఓ మహీంద్రా కేయూవీ 100  నెక్ట్స్‌ కారును బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను. ఇకనుంచి తన తల్లిని కారులో తిప్పుతారు’అని ట్వీట్ చేశారు.


ఈ క్రమంలో ... ఆ కుటుంబానికి  ఓ కారును బహుమతిగా ఇచ్చి, ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఈ కానుకపై కృష్ణ కుమార్  మాట్లాడుతూ... 'ఇది మా అమ్మకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆమె ఇప్పటికీ నమ్మలేకపోతోంది. మా అమ్మను ఆ కారులో చాముండేశ్వరి ఆలయానికి తీసుకెళ్లాను. కారులోని టచ్‌ స్క్రీన్‌, ఇతర విషయాల గురించి ఎన్నో ప్రశ్నలడిగింది. మా అమ్మ చిన్నపిల్లలా మారిపోయింది. స్కూటర్ నుంచి కారు... మా అమ్మకు ఓ గొప్ప అనుభవం' అంటూ సంతోషం వ్యక్తం చేశారు.


అంతేకాదు... మైసూర్‌లోని తన ఇంటిని 'జ్ఞాన వికాస కేంద్రం'గా మారుస్తున్నట్లు ప్రకటించారు. దానిలో తమ యాత్రకు సంబంధించిన వివరాలను పొందుపరచనున్నారు. 


Updated Date - 2020-09-21T23:13:27+05:30 IST