మహోగ్రంగా మన్నేరు

ABN , First Publish Date - 2021-12-01T06:24:05+05:30 IST

గత రెండు రోజులుగా కురిసిన వర్షాలు, నెల్లూరు జిల్లా నుంచి పోటెత్తిన వరదతో మన్నేరు, ఉప్పుటేరులు ఉగ్ర రూపం దాల్చాయి.

మహోగ్రంగా మన్నేరు
మాచవరం వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న మన్నేరు

ఉప్పెనలా ఉప్పుటేరు

కందుకూరు -గుడ్లూరు మధ్య నిలిచిన రాకపోకలు

పొంగిన వాగులు, వంకలు

కందుకూరు, నవంబరు 30 : గత రెండు రోజులుగా కురిసిన వర్షాలు, నెల్లూరు జిల్లా నుంచి పోటెత్తిన వరదతో మన్నేరు, ఉప్పుటేరులు ఉగ్ర రూపం దాల్చాయి. గత 15 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా మన్నేరు, ఉప్పుటేర్లు పొంగి ప్రవహించాయి. అనేక మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. సోమవారం కందుకూరు ప్రాంతంలో ఒక మోస్తరు వర్షమే కురిసినప్పటికీ, మంగళవారం వేకువజాముకు మన్నేరు, ఉప్పటేర్లులో వరద పరవళ్లు తొక్కింది. దీంతో ప్రజలు విస్మయానికి గురయ్యారు. సోమవారం రాత్రి పామూరు, సీఎస్‌..పురం మండలాలతో పాటు నెల్లూరు జిల్లా, ఉదయగిరి, బద్వేలు, ఆత్మకూరు ప్రాంతాల్లో కురిసిన భారీవర్షాలతో మన్నేరు, ఉప్పుటేర్లకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చింది. రాళ్లపాడు రిజర్వాయరు నుంచి ఒక దశనలో ఐదు గేట్లను ఎత్తి 45 వేల క్యూసెక్కుల నీటిని మన్నేరుకి విడుదల చేశారు. మంగళవారం సాయంత్రం వరకు వరద ఉధృతి కొనసాగింది. దీంతో మన్నేరు నురగలు కక్కుతూ పరవళ్లు తొక్కింది. కలవళ్ల వద్ద మాచవరం వద్ద బ్రిడ్జి పైన వరదనీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మంగళవారం వేకువజాము నుంచే కందుకూరు - గుడ్లూరు మార్గంలో పూర్తి రాకపోకలు నిలిచిపోయాయి. కావలి బస్సులను సింగరాయకొండ మీదగా నడిపారు. అలాగే మన్నేరు ఉగ్రరూపంతో ఆత్మకూరు, మన్నేటికోట గ్రామాల మధ్య రాకపోకలు నిలిచాయి. మరోవైపు ఉప్పుటేరు వరద పోటెత్తడంతో పెదపవని వద్ద వంతెనపైౖ దాదాపు నాలుగు అడుగుల లోతున వరద నీరు ప్రవహించింది. దీంతో అటు పెదపవని మార్గంలోనూ, గుడ్లూరు- బసిరెడ్డిపాలెం మార్గంలోనూ, రాకపోకలు స్తంభించాయి. మన్నేరు, ఉప్పుటేరు నదులు కలిసి ప్రవహించడంతో జాతీయ రహదారి వద్ద, రైల్వే లైను వద్ద వరద వంతెనలను తాకుతుందన్నట్లుగా ప్రవహించింది. ఎన్నోఏళ్ల తరువాత ఇలాంటి వరద  చూసిన స్థానికులు ఒక వైపు ఆనందం వ్యక్తం చేస్తుడగా ఆందోళన చెందారు.

గుడ్లూరు : మండల కేంద్రమైన గుడ్లూరును ఆనుకొని బసిరెడ్డిపాలెం, దారకానిపాడు, వెంకంపేట, మీదగా ప్రవహించే ఉప్పుటేరు మంగళవారం ఉదృతంగా ప్రవహించింది. దీంతో పాటుగా మండలంలోని దప్పళంపాడు, దారకానిపాడు ప్రాంతాలకు ఆనుకొని ప్రవహించే మన్నేరుకూడా ఉదృతంగా ప్రవహించింది.  దీంతో ప్రజా రవాణా పూర్తిగా స్తంభించింది.

పెదపవని(లింగసముద్రం) : అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు మండలంలోని పెదపవని గ్రామ సమీపంలో ఉన్న ఉప్పుటేరు వరద నీటి ప్రవాహానికి పొంగి ప్రవహిస్తోంది.సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ఒక్కసారిగా వరద నీరు రావడంతో ఉప్పుటేరు బ్రిడ్జిపై సుమారు 4,5 అడుగుల మేర నీరు పారుతోంది. దీంతో ఈ బ్రిడ్జిపై అప్పటి నుండి సోమవారం సాయంత్రం వరకు రాకపోకలు నిలిచాయి.

వరద నీటితో వాగులు ఉదృతం 

కనిగిరి, నవంబరు 30: గడచిన 10 రోజులుగా కురుస్తున్న వర్షాలకు  ఎగువ ప్రాంతం నుంచి కొండలు దాటి కనిగిరి నియోజకవర్గంలోని పలు మండలాల్లో వాగులు ఉదృతంగా ప్రహిస్తున్నాయి. ఆది, సోమవారాల్లో నియోజకవర్గంలోని పామూరు, సీ.ఎ్‌స.పురం, పీసీపల్లి, వెలిగండ్ల మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. దీంతో వాగులు, వంకలు పొంగి మంగళవారం పలుచోట్ల వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నియోజకవర్గంలోని పామూరు మండలంలో మోపాడు చెరువు నీటిమట్టం 29 అడుగులుకు చేరుకుని అలుగు పారుతుంది. అదేవిధంగా పామూరు పాత చెరువుకు వరదనీటి ప్రవాహం ఎక్కువై అలుగు పారుతోంది. దీంతో కట్ట బలహీన పడడమే కాకుండా ప్రధాన తూము ద్వారా నీరు లీకవుతోంది. దీంతో నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. సీ.ఎ్‌స.పురం మండలంలో చెరువు నిండుకుండలా మారింది. పీసీపల్లి మండలంలో పాలేరుకు వరద నీరు ఎక్కువగా వచ్చి చేరుకుంది. అదేవిధంగా బట్టుపల్లి వద్ద వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది.  తలకొండపాడు పాతచెరువు అలుగు పారుతుండడంతో  వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెలిగండ్ల మండలంలోని గన్నవరం వద్ద వాగు ఉదృతంగా ప్రవహిస్తూ గండ్లోపల్లి, చెన్నంపల్లి, గన్నవరం గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. కొటాలపల్లి వద్ద వాగు ఉదృతంగా పరవళ్లు తొక్కుతుంది. హనుమంతునిపాడు మండలంలోని నందనవనం, వేములపాడు, హజీపురం గ్రామాలకు వెళ్ళే వాగులు పారుతున్నాయి. 

కనిగిరి మండలంలోని గురవాజీపేట, పాతచెరువు పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. ఇప్పటికే దాదాపు చెరువు 25 అడుగులు ఎత్తుమేర పూడుకుపోయింది. ఈ విషయంపై గతంలో ఇరిగేషన్‌ అధికారులు కానీ, పాలకులు కానీ ఎటువంటి చర్యలు చేపట్టలేదు. దీంతో గత రెండురోజులుగా కురిసిన వర్షాలకు చెరువు నిండి గ్రామాల్లోకి చెరువు నీరు వస్తోందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కొండవాలు నుంచి వచ్చే వరద నీటితో కుంటలు జలమయమయ్యాయి. తూర్పువాగు ఉదృతంగా ప్రవహిస్తూ 5 కి.మీ మేర కట్టదాటి పరవళ్లు తొక్కింది. వంగపాడులోని మూడు కాలువలు పొంగి పొర్లాయి. చిలంకూరు కాలువ వరద నీటితో ఊగిసలాడింది. దీంతో నల్లారెడ్డిపల్లి, చీర్లదినెన్న, పాతపాడు, అట్లవారిపల్లి, బొటికిర్లపాడు, బుడ్డారెడ్డిపల్లి, గురవాజీపేట గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నియోజకవర్గంలో గడిచిన 10 రోజులుగా వర్షాలు భారీ వర్షాలు లేకపోయినప్పటికి ఎగువ నుంచి వచ్చే వరద నీరు ప్రతి వాగులో పరవళ్లు తొక్కుతూ ప్రవహించింది. 

పామూరు : మండలంలోని మోపాడు రిజర్వాయర్‌లో గత 12 సంవత్సరాల అనంతరం పూర్తిస్థాయిలో నీరుచేరి అలుగు పారింది. దీంతో ఆయకట్టు దారులు ఆనందం వ్యక్తం చేస్తూ అలుగును సందర్శిస్తున్నారు. రిజర్వాయర్‌ అలుగు పారుతుండడంతో మోపాడు నీటి సంఘం మాజీ చైర్మన్‌ ఏ.ప్రభాకర్‌ చౌదరి మంగళవారం జలహారతి ఇచ్చారు. తూము కింద నుండి లీకేజీ  నీరు ద్వారా వృథాగా పోతుండగా, ఆయకట్టుదారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రిజర్వాయర్‌లో చేప పిల్లలను పోసిన వారు అలుగువద్ద వలలు అడ్డంగా పెట్టి చేపలు బయటకు పోకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - 2021-12-01T06:24:05+05:30 IST