Abn logo
Sep 6 2021 @ 00:47AM

మొదటికే మోసం..!

సూత్రధారి జయసూర్య 

కొమ్మాది భూమాయలో కీలక నిందితుడు

కృష్ణ చౌదరితో 15 ఏళ్ల క్రితమే పరిచయం

స్థలాన్ని అమ్మడానికి జయసూర్యకు అడ్వాన్స్‌ 

రిజిస్ర్టేషన్‌ కాకముందే అమెరికాకు పయనం

ఈ స్థలం అగ్రిమెంట్‌ని అడ్డంపెట్టుకుని కొమ్మాది భూమిపై కన్ను

మేథ్స్‌ లెక్చరర్‌ ద్వారా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి పరిచయం

కన్నబాబురాజుకు విక్రయించడానికి డీల్‌

రూ.100 కోట్ల భూమి... రూ.19 కోట్లకే వస్తుండడంతో ఆశపడిన ఎమ్మెల్యే

కృష్ణచౌదరి పేరిట బ్యాంక్‌ అకౌంట్ల సృష్టి

స్పెషల్‌ పవర్‌ పేరుతో డాక్యుమెంట్లపై నకిలీ సంతకాలు

చౌదరి భార్య తెరపైకి రావడంతో బట్టబయలైన చీటింగ్‌

పలువురు అధికారులకు ఫిర్యాదు చేసిన కన్నబాబు

జరజాపు శ్రీనివాసరావు అరెస్టు

పోలీసుల అదుపులో జయసూర్య


విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): కొమ్మాదిలో రూ.100 కోట్ల విలువైన భూమి రూ.19 కోట్లకే అమ్మకానికి రావడం వెనుక ఉన్న మోసాన్ని కొనుగోలుదారులు పసిగట్టలేకపోయారు. చౌకగా వచ్చేస్తుందన్న ఆదుర్దాలో లోగుట్టు తెలుసుకోలేదు. వీరి అత్యాశనే దళారులు క్యాష్‌ చేసుకున్నారు. చివరకు అసలు వ్యక్తులు తెర పైకి రావడంతో కథ అడ్డం తిరిగి మొదటికే మోసం వచ్చింది. అడ్వాన్స్‌గా ఇచ్చిన డబ్బులు వెనక్కి వస్తే చాలు అనే పరిస్థితి ఏర్పడింది. ఈ కేసులో కీలకమైన నిందితుల్లో ఒకరు ఇప్పటికే జైలుకు వెళ్లగా, ఏ-1 అయిన జయసూర్య పోలీసుల అదుపులో ఉన్నాడు.


కొమ్మాదిలో రూ.100 కోట్ల భూమాయలో కాకినాడకు చెందిన వాసంశెట్టి జయసూర్య కీలక నిందితుడిగా పీఎంపాలెం పోలీసులు గుర్తించారు. అమెరికాలో ఉంటున్న కృష్ణ చౌదరికి ఇక్కడున్న ఆస్తుల వివరాలు తెలియడం, ఆయన అమెరికా నుంచి ఇండియాకి రాడని నిర్ధారించుకున్నాక... ఆయన భార్యను అడ్డం పెట్టుకొని మోసం చేయాలని ప్రణాళిక రూపొందించాడు. కృష్ణ చౌదరి అమెరికాకు వెళ్లక ముందు 15 ఏళ్ల క్రితం విశాఖలో ఓ స్థలాన్ని అమ్మడానికి జయసూర్య దగ్గర అడ్వాన్స్‌ తీసుకున్నాడు. ఆ స్థలం రిజిస్టర్‌ చేయకుండానే అమెరికా వెళ్లిపోయాడు. ఆ లావాదేవీని సెటిల్‌ చేసుకునే క్రమంలో ఆయన భార్య లక్ష్మీసూర్య ప్రసన్నతో జయసూర్యకు పరిచయం ఏర్పడింది. ఆ క్రమంలో చౌదరికి కొమ్మాదిలో విలువైన భూమి ఉందని తెలుసుకున్నాడు. అమెరికాలో వుంటున్న కృష్ణ చౌదరి చాలా కాలం నుంచి స్వదేశానికి రాకపోవడంతో పాస్‌పోర్టు గడువు 2012లోనే ముగిసిపోయింది. ఇక్కడకు వచ్చే ఆలోచన లేకపోవడంతో దానిని పునరుద్ధరించుకోలేదు.


ఈ విషయాలన్నీ తెలుసుకున్న జయసూర్య కొమ్మాదిలో చౌదరికి చెందిన 12.26 ఎకరాల భూమిని అమ్మేసి సొమ్ము చేసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో విశాఖలో మేథ్స్‌ లెక్చరర్‌ జరజాపు శ్రీనివాసరావును సంప్రతించాడు. ఆయన తనకు తెలిసిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి సనపల చంద్రమౌళికి చెప్పగా ఆయన ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజుకు ఈ డీల్‌ కుదిర్చారు. భూమి డాక్యుమెంట్లు పోయాయని చెప్పడంతో తక్కువ ధర ఆఫర్‌ చేశారు. రూ.19 కోట్లకే ఇవ్వడానికి వారు అంగీకరించడంతో అందులో మోసం ఉందని గ్రహించలేకపోయారు. మరోవైపు ఈ భూమి క్రయవిక్రయాల గురించి అమెరికాలో ఉన్న కృష్ణ చౌదరికి తెలియదు. ఈ మధ్యలో... అంటే రెండు నెలల క్రితం జయసూర్య... కృష్ణచౌదరి భార్య ప్రసన్నను కలిసి ఆర్థిక అంశాలపై చర్చించాడు. ఇబ్బందులు ఉన్నాయని చెప్పడంతో అప్పు ఇస్తానని చెప్పి ఆమె బ్యాంకు ఖాతాలో రూ.60 లక్షలు వేశాడు. దీనికి సంబంధించి వారి మధ్య నడిచిన ఫోన్‌ సంభాషణల ద్వారా పోలీసులు ఈ విషయం నిర్ధారించుకున్నారు. 


ఏడాదిన్నర క్రితమే భూమి అమ్మకానికి డీల్‌ కుదిరింది. దీనికి సంబంధించి ఆయనే మాట్లాడతారంటూ అమెరికా నుంచి మరో వ్యక్తితో కృష్ణ చౌదరిలా జయసూర్య మాట్లాడించాడు. మరో దళారి జరజాపు శ్రీనివాసరావు సహా భూమి కొంటున్న వారంతా నమ్మారు. అడ్వాన్స్‌ బ్యాంకు ఖాతాలో వేస్తామని చెప్పేసరికి లంకెలపాలెంలోని ఐసీఐసీఐ బ్యాంకులో తుమ్మల కృష్ణచౌదరి పేరుతో బ్యాంకు ఖాతా తెరిచారు. (ఇది ఎలా సాధ్యమైందనే దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు) ఆ ఖాతాలో రెండు దఫాలుగా రూ.49 లక్షలు, రూ.50 లక్షలు జమ చేశారు. ఆ తరువాత కరోనా ప్రబలడంతో రిజిస్ర్టేషన్లు ఆగాయి. కాగా భూమిని రిజిస్ట్రేషన్‌ చేయాలని ఎమ్మెల్యే కన్నబాబురాజు రెండు నెలల క్రితం డిమాండ్‌ చేయడంతో అమెరికా నుంచి స్పెషల్‌ పవర్‌ తెప్పిస్తామని జయసూర్య నాటకం ఆడాడు.


ఇక్కడ తయారు చేసిన డాక్యుమెంట్లను అమెరికా పంపడం, అటు నుంచి కృష్ణచౌదరిలా నటిస్తున్న మరో వ్యక్తి వాటిపై సంతకాలు పెట్టి తిరిగి పంపడం, మెయిల్స్‌ చేయడం వంటివి జరిగాయి. ఇదంతా మోసమని కన్నబాబురాజు గ్రహించలేకపోయారు. ఫలానా భూమిని కొంటున్నట్టు పత్రికలో ప్రకటన ఇవ్వడంతో ప్రత్తిపాడులో ఉంటున్న చౌదరి భార్య ప్రసన్న స్పందించారు. భర్తతో మాట్లాడి, అటువంటిదేమీ లేదని తెలుసుకొని ఆమె మరో ప్రకటన ఇచ్చారు. అయినా రిజిస్ట్రేషన్‌ ఆగడం లేదని తెలుసుకొని కలెక్టర్‌, కమిషనర్‌ సహా పీఎం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈలోగా దళారులు మరో రూ.2.5 కోట్లను ఎమ్మెల్యే నుంచి తీసుకున్నారు. అందులో రూ.2 కోట్లు చౌదరి భార్య ప్రసన్నకు ఇస్తున్నామని, ఆమె ఖాతాలో డబ్బులు వేశామని చెప్పి, అంతకుముందు జయసూర్య ఆమెకు అప్పుగా ఇచ్చిన లావాదేవీలను చూపించారు. అవన్నీ నిజమని ఎమ్మెల్యే, ఆయన కుమారుడు సుకుమారవర్మ నమ్మేశారు.


పోలీసులు జరజాపు శ్రీనివాసరావును పట్టుకొని విచారించడంతో కృష్ణ చౌదరికి తెలియకుండానే ఇదంతా జయసూర్య, తాను కలిసి చేశామని అంగీకరించాడు. దీంతో అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. బండారం బయటపడడంతో తప్పించుకు తిరుగుతున్న జయసూర్యను కూడా పీఎంపాలెం పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. మోసం చేసినట్టు అతను కూడా ఒప్పుకున్నాడు. చౌదరి భార్య ప్రసన్నకు ఇందులో ప్రమేయం లేదని, తన ఖాతాలో వేసిన డబ్బు... అప్పుగా ఇచ్చిందేనని వివరించాడు. మరిన్ని వివరాల కోసం అతడిని ప్రశ్నిస్తున్నారు.


స్పెషల్‌ పవర్‌ చెల్లదు: ప్రసన్న

అమెరికాలో ఉంటున్న నా భర్త పాస్‌పోర్టు గడువు తీరిపోయింది. అక్కడ వారు ఎవరైనా స్పెషల్‌ పవర్‌ ఇవ్వాలంటే... అమెరికన్‌ ఎంబసీ అనుమతితోనే ఇవ్వాలి. కానీ నోటరీ చేసిన పత్రాలతో మోసం చేశారు. జయసూర్య నాకు ఇచ్చింది అప్పు మాత్రమే. నాకు, భర్తకు తెలియకుండా ఇదంతా చేశారు. అందుకే ఫిర్యాదు చేశాను.