శాంతి భద్రతల పరిరక్షణకు ప్రథమ ప్రాధాన్యం

ABN , First Publish Date - 2021-09-17T06:10:52+05:30 IST

రాష్ట్రంలో శాంతి భధ్రతల పర్యవేక్షకు ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం కల్పిస్తోందని జిల్లా కలెక్టర్‌ రవి అన్నారు.

శాంతి భద్రతల పరిరక్షణకు ప్రథమ ప్రాధాన్యం
జగిత్యాలలో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌, సీసీ కెమెరాలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే, ఎస్పీ, కలెక్టర్‌

  - కలెక్టర్‌ రవి 

జగిత్యాల టౌన్‌, సెప్టెంబరు 16 :రాష్ట్రంలో శాంతి భధ్రతల పర్యవేక్షకు ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం కల్పిస్తోందని జిల్లా కలెక్టర్‌ రవి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో మున్సిపల్‌, పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ సిగ్నల్స్‌, సీసీ కెమెరాలను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, ఎస్పీ సింధుశర్మ, కలెక్టర్‌ రవి ప్రారంభించారు. అనంతరం బల్దియా కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వల్ల వాహనదారులకు క్రమశిక్షణ పెరుగుతుందని వివరిం చారు. ప్రమాదాల నివారణతో పాటు అతివేగం వంటివి తగ్గుతాయన్నారు. రూ.50 లక్షల నిధులతో ఐదు ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌, 14 ప్రదేశాల్లో బ్లింకర్స్‌ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ శాంతి భధ్రతల పరిరక్షణకు సీఎం కేసీఆర్‌ మొదటి ప్రాధాన్యత కల్పిస్తున్నారని వివరించారు. దేశంలోనే అత్యధిక సీసీ కెమరాలు ఉన్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని వివరించారు. అనంతరం ఎస్పీ సింధు శర్మ మాట్లాడు తూ జగిత్యాల పట్టణంలోని 44 ప్రదేశాల్లో 113 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో బల్దియా చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణి, డీఎస్పీ ప్రకాష్‌, కమిషనర్‌ స్వరూప రాణి, వైస్‌ చైర్మన్‌ గోళి శ్రీనివాస్‌, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.

ఽమెట్‌పల్లి : ప్రస్తుత రోజుల్లో నేరాల నియంత్రణతో పాటు నేరస్తులను గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని జిల్లా ఎస్పీ సింధుశర్మ అన్నారు. గురువారం మెట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో, పట్టణంలో  ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ సింగరేణి సహకారంతో మెట్‌పల్లిలో దాదాపుగా రూ.15 లక్షల విలువ గల 32 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరోక్షంగా భాగస్వామ్యులైన సింగరేణి ససీఎండీ శ్రీధర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సీసీ కెమెరాను ప్రధాన కూడళ్ల వద్ద, ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు తమ వ్యక్తిగత భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. సీసీ కెమెరాలు పోలీసులకు ఒక ఆయుధంలా పనిచేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి డీఎస్పీ గౌస్‌బాబా, సీఐ శ్రీనివాస్‌, ఎస్‌ఐలు సధాకర్‌, రాజునాయక్‌, రాజ ప్రమీల, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు. 

Updated Date - 2021-09-17T06:10:52+05:30 IST