రాష్ట్ర బీజేపీలో పెనుమార్పులు

ABN , First Publish Date - 2022-05-02T14:40:14+05:30 IST

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పార్టీకి నూతన జవసత్వాలు కల్పించే దిశగా జిల్లాల వారీగా మార్పులు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 59 జిల్లా శాఖలకు కొత్త కార్యవర్గాలను

రాష్ట్ర బీజేపీలో పెనుమార్పులు

జిల్లా శాఖలకు కొత్తనాయకత్వం

29 మందికి ఉద్వాసన

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై


చెన్నై: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పార్టీకి నూతన జవసత్వాలు కల్పించే దిశగా జిల్లాల వారీగా మార్పులు చేపట్టారు.  రాష్ట్ర వ్యాప్తంగా 59 జిల్లా శాఖలకు కొత్త కార్యవర్గాలను ప్రకటించారు. 29 జిల్లా శాఖల నాయకులకు ఉద్వాసన పలికారు. పార్టీ కార్యాచరణ మండలిలో 20 మందికి కొత్తగా స్థానం కల్పించారు. 33 జిల్లాలకు ప్రస్తుతమున్న అధ్యక్షులనే నియమించారు. ఈ మేరకు శనివారం అర్ధరాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. అన్నామలై పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి  జిల్లా శాఖల పనితీరుపై తీవ్ర దృష్టిసారించారు. పనిచేయని జిల్లా నేతలను తొలగించి సమర్థులైనవారిని నియమించేందుకు నడుంబిగించారు. ఆ మేరకు గత కొద్ది నెలలుగా ఆయన జిల్లాల వారీ పర్యటనలు నిర్వహించారు.


ఆయా జిల్లా శాఖల నాయకుల పనితీరు, పార్టీ అభివృద్ధి, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి లభించిన ఓట్ల శాతం తదితర వివరాలను సేకరించారు. ఆ వివరాలన్నీ పరిశీలించిన మీదట ఏళ్ల తరబడి జిల్లా శాఖ నాయకులుగా ఉంటూ పార్టీ అభివృద్ధికి పాటుపడని వారిని తొలగించేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా శాఖ ప్రముఖులు ఆ పదవుల కోసం అన్నామలైని కలుసుకునేందుకు చెన్నై వచ్చారు.


కానీ వారినెవరినీ అన్నామలై కలవకుండా తిప్పిపంపారు. జిల్లా శాఖ పదవుల కోసం తనను నేరుగా కలిసేందుకు ఎవరూ రావద్దని ఆయన ప్రకటన కూడా చేశారు. జిల్లాల వారీగా సేకరించిన వివరాలను ఓ నివేదికగా తయారు చేసి పార్టీ సీనియర్‌ నేతలు రాధాకృష్ణన్‌, సీపీ రాధాకృష్ణన్‌ తదితరుల అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు.. ఆ తర్వాత పార్టీ జిల్లా శాఖల్లో మార్పులు చేయనున్నట్లు అధిష్టానానికి సమాచారం పంపారు. పార్టీ అధిష్టానవర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో అన్నామలై ఒకేసారి 59 జిల్లా శాఖల నాయకులను తొలగించి కొత్తవారిని నియమించారు. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న అన్నామలై ఈ ప్రకటనను విడుదల చేశారు. రాష్ట్రంలో బీజేపీకి 60 జిల్లా శాఖలున్నాయి. వీటిలో చెన్నైపడమటి జిల్లా శాఖ మినహా తక్కిన 59 జిల్లా శాఖల నేతల జాబితాను ప్రకటించారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఈరోడ్‌ వెస్ట్‌ జిల్లా శాఖకు, కోయంబత్తూరు వెస్ట్‌ జిల్లా శాఖకు సంగీత, కలైవాణి విజయకుమార్‌ను నియమించారు. 


కార్యాచరణ మండలి సభ్యులు...

ఇక రాష్ట్ర కార్యాచరణ మండలి సభ్యులుగా పాల్‌రాజ్‌ (తూత్తుకుడి సౌత్‌), రామమూర్తి (తూత్తుకుడి నార్త్‌), రామరాజా (తెన్‌కాశి) గజేంద్రన్‌ (విరుదునగర్‌ ఈస్ట్‌), రాధాకృష్ణన్‌ (విరుదునగర్‌ వెస్ట్‌), మరళీధరన్‌ (రామనాధపురం), రమాసేతుపతి (పుదుకోట), రాఘవన్‌ (తిరువారూరు), నేతాజీ (నాగపట్టినం), వెంకటేశన్‌ (మైలాడుదురై), ఇలంజెళియన్‌ (కడలూరు వెస్ట్‌), రాజా (తిరువళ్లూరు ఈస్ట్‌), రాజ్‌కుమార్‌ (తిరువళ్లూరు వెస్ట్‌), దక్షిణామూర్తి (చెన్నై నార్త్‌), దశరథన్‌ (వేలూరు) వెంకటేశన్‌ (తిరువణ్ణామలై నార్త్‌), ధర్మలింగం (కృష్ణగిరి ఈస్ట్‌), మనిఖంఠన్‌ (సేలం ఈస్ట్‌), అజిత్‌కుమార్‌ (ఈరోడ్‌ నార్త్‌), రుద్రకుమార్‌ (తిరుప్పూరు సౌత్‌)ను నియమించారు.

Updated Date - 2022-05-02T14:40:14+05:30 IST