జిల్లాను సస్యశ్యామలం చేస్తా!

ABN , First Publish Date - 2021-06-21T06:27:31+05:30 IST

కామారెడ్డి జిల్లాను వీలైనంత తొందరలోనే సస్యశ్యామలం చేసే బాధ్యత తనదేనని ఇప్పటికే మల్లన్నసాగర్‌ నుంచి నిజాంసాగర్‌కు గోదావరి జలాల తరలింపు కొనసాగుతుందని అదే విధం గా కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు సైతం జలాలను ఇచ్చి తీరుతానని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

జిల్లాను సస్యశ్యామలం చేస్తా!

కామారెడ్డి, ఎల్లారెడ్డిలకు కాళేశ్వరం జలాలను ఇచ్చి తీరుతాం
మరో 15 రోజుల్లో నిజాంసాగర్‌కు వస్తా..
నిజాంసాగర్‌ గెస్ట్‌హౌజ్‌లో ఇరిగేషన్‌ అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తాం
వచ్చే సంవత్సరం కామారెడ్డికి మెడికల్‌ కళాశాల మంజూరు చేస్తాం
జిల్లాలోని మున్సిపాలిటీలకు రూ.100 కోట్లు కేటాయిస్తున్నాం
గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నాం
ఇచ్చిన మాట ప్రకారం కామారెడ్డి జిల్లాను ఏర్పాటు చేశాను
జిల్లా కేంద్రంలోనే సమీకృత కార్యాలయాలునిర్మించి ప్రారంభించాను
మిగతా హామీలను త్వరలోనే నెరవేరుస్తా: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌
సమీకృత భవనాల ప్రారంభోత్సవంలో సీఎం కేసీర్‌
కామారెడ్డి, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): కామారెడ్డి జిల్లాను వీలైనంత తొందరలోనే సస్యశ్యామలం చేసే బాధ్యత తనదేనని ఇప్పటికే మల్లన్నసాగర్‌ నుంచి నిజాంసాగర్‌కు గోదావరి జలాల తరలింపు కొనసాగుతుందని అదే విధం గా కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు సైతం జలాలను ఇచ్చి తీరుతానని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. 15 రోజుల్లో మరోసారి కామారెడ్డి జిల్లాకు వచ్చి నిజాంసాగర్‌ ప్రాజెక్టు వద్ద ఉన్న గెస్ట్‌హౌజ్‌లోనే రాష్ట్ర, జిల్లా నీటి పారుదలశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి జిల్లాకు సాగునీరు వచ్చేలా పనులు పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాలకు సాగునీరు అందించేందుకు 22వ ప్యాకేజీ పనులు కొనసాగుతున్నాయని అన్నారు. 85 టీఎంసీల నీటిని ఎల్లారెడ్డి, కామారెడ్డి రైతాం గానికి అందించేందుకు గుజ్జులు, కాటేవాడి, తిమ్మక్‌పల్లి లాంటి రిజర్వాయర్‌లను ప్లాన్‌ చేయడం జరిగిందన్నారు. ఆ పనులు సైతం కొనసాగుతున్నాయని వీలైనంత తొందరలో ఈ ఎత్తిపోతల పథకం ద్వారా కాళేశ్వరం జలాలను అందించి కామారెడ్డి, ఎల్లారెడ్డి భూములను సస్యశ్యామలం చేసే బాధ్యత నాదేనని హామీ ఇచ్చారు. గత ఎన్ని కల సమయంలో గంప గోవర్ధన్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కామారెడ్డి జిల్లా ఏర్పాటుకు హామీ ఇచ్చానని అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం జిల్లాను ఏర్పాటు చేసి ప్రజలకు పాలన సౌకర్యం కోసం నూతన సమీకృత కలెక్టరేట్‌, పోలీసు భవనాలను నిర్మించి తానే ప్రారంభించానని అన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని అన్నారు. రానున్న రోజుల్లో కామారెడ్డి జిల్లాకు మంచి భవిష్యత్తు ఉంటుం దని అన్నారు. రైల్వే, జాతీయ రహదారుల సౌకర్యం ఉండడంతో జిల్లా మరింత అభివృద్ధి బాట పట్టనుందని అన్నారు. ప్రజల అభిప్రాయంమేరకు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పలు అభివృద్ధి, సంక్షేమ పనులను తన ముందు ఉంచారని అన్నారు. వారి అభిష్టం మేరకు వచ్చే సంవత్స రం కామారెడ్డి, జిల్లా కేంద్రానికి మెడికల్‌ కళాశాలను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా కామారెడ్డి మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. జిల్లాలోని 526 గ్రామ పంచాయతీలకు గాను ఒక్కో దానికి రూ.10లక్షలు మంజూ రు చేస్తున్నానని అన్నారు. బంజపల్లి, గజ్యానాయక్‌ తండాలో 33 కేవీ సబ్‌స్టేషన్‌లు ఏర్పాటు చేయాలని సీఎస్‌ సోమేష్‌కుమార్‌ను ఆదేశించారు. కామారెడ్డి పట్టణంలో ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌, రూరల్‌ ఎస్‌హెచ్‌వో పోలీసుస్టేషన్‌ను అప్‌గ్రేడ్‌ చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డికి ఆదేశించారు. ఇలా జిల్లాపై సీఎం కేసీఆర్‌ హామీల వర్షా న్ని కురిపించారు. దేశంలో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు దళితుల పరిస్థితి ఏమి బాగోలేదు. స్వతంత్ర దేశంలోనూ ఇప్పటికీ వారిని చులకనగానే చూస్తున్నారు. దళితుల అభివృద్ధికి దేశంలో అన్ని వర్గాలు సహకరించాలి. తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే సీఎండీఈ (ముఖ్యమంత్రి దళిత ఎంపవర్‌మెంట్‌)ను అమలు చేస్తామని సీఎం కేసీ ఆర్‌ పేర్కొన్నారు. దళితుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 కోట్ల నిధులను కేటాయించాం. త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేసి వారి అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. తెలంగాణలోని ప్రజాప్రతినిధులు అందరూ దళితజాతి సేవ కోసం ముందుండాలని కేసీఆర్‌ పిలుపు
నిచ్చారు. తెలంగాణ ఏర్పడి 6 సంవత్సరాల కాలంలో ఇప్పుడిప్పుడే తెలంగాణ జాతికి ఫలాలు అందుతున్నాయని అన్నారు. అభివృద్ధి పనులే కాకుండా ప్రజా సంక్షేమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని అన్నారు. తెలంగాణను అభివృద్ధి చేసి తెలంగాణకు సరిహద్దున మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాలో ఉన్న 40 గ్రామాలు తెలంగాణలో కలిసేందుకు తీర్మానం చేశాయని అన్నారు. వారి తీర్మానాలే తెలంగాణ అభివృద్ధికి నిదర్శనమని అన్నారు. 24 గంటల నాణ్యమైన కరెంట్‌ను తెలంగాణ సమాజానికి అందిస్తున్నామని అన్నారు. ఒకప్పుడు కరెం ట్‌ కోతలతో తెలంగాణ ప్రజలు, రైతులు నానా ఇబ్బం దులు పడ్డారని ఇప్పుడు కరెంట్‌ కోతలు లేని తెలంగాణగా మార్చామన్నారు. గతంలో 1,100 యూనిట్ల కరెంట్‌ వినియోగం అయ్యేదని ప్రస్తుతం 2,170 యూనిట్ల వినియోగం అవుతుందని అన్నారు. ఇతర రాష్ట్రాలకు విద్యుత్‌ను సరఫరా చేసే విధంగా తెలంగాణ రాష్ట్రం ఎదగడం గర్వకారణంగా ఉందని సీఎం చెప్పుకొచ్చారు. కాళేశ్వరం సాగునీటితో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు, చెరువులకు నీటి కళ సంతరించుకునేలా చేశామని అన్నారు. ఇప్పుడు ఏ గ్రామం చూసినా పచ్చని పంట పొలాలతో కనిపిస్తుందని అన్నారు. రోడ్డు వెంట పోతే ఏ గ్రామంలో చూసినా ధాన్యం కుప్పలే కనిపిస్తున్నాయని అన్నారు. తెలంగాణను ఽధాన్యాగారంగా మార్చామని అన్నారు. నిన్నటి వరకు దేశంలో వరిధాన్యం ఎక్కువగా పండించే రాష్ట్రం పంజాబ్‌ అని అక్కడ 2కోట్ల 2లక్షల టన్నుల దిగుబడులు వస్తుండేవన్నారు. ఇప్పుడు తెలంగాణలో 3కోట్ల మెట్రిక్‌ టన్నుల ఽధాన్యం దిగుబడులు రావడంతో దేశంలోనే తెలంగాణ నెంబర్‌ వన్‌గా నిలిచిందన్నారు. తెలంగాణ వచ్చే నాలుగు నెలల ముందే చెరువులు బాగు చేయాలని జయశంకర్‌, విద్యాసాగర్‌ సూచనలతో మిషన్‌ కాకతీయ ప్రారంభించామని అన్నారు. ఇప్పుడు చెరువులన్నీ ఎండాకాలంలోనూ నిండుగా జలకళను సంతరించుకుంటున్నాయి. ఎవరు ధర్నాలు చేయకున్నా, దరఖాస్తులు పెట్టకున్నా కాళేశ్వరం, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, గురుకుల పాఠశాలలు, నిరంతర విద్యుత్‌, రైతుబంధు, ఆసరా ఫించన్‌లు లాంటి పథకాలను తెచ్చానన్నారు. దేశవ్యాప్తంగా 40 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారని ఏ ఒక్క రాష్ట్రం కూడా వీరికి పెన్షన్‌లు ఇవ్వడం లేదని కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే బీడీ కార్మికులకు రూ.2,016 ఫించన్‌లు ప్రతినెల అందజేస్తున్నామని అన్నారు. ఇలా రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, అమ్మఒడి, కేసీఆర్‌ కిట్‌ లాంటి పథకాలతో అన్నివర్గాల ప్రజలకు సంక్షేమం అందేలా చేస్తున్నామన్నారు. కేసీఆర్‌ బతికి ఉన్నన్నీ రోజులు ఈ పథకాలన్నీ అమలు అవుతునే ఉంటాయని అన్నారు. రైతు కష్టాలను చూసే రైతుబంధు ఇస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని ప్రతీఒక్కరి ముఖంలో చిరునవ్వు ఉన్నప్పుడే బంగారు తెలంగాణ అవుతుందని అన్నారు. రానున్న రోజుల్లో అద్భుతమైన రాష్ట్రాన్ని తయారు చేయడమే నా లక్ష్యమని అన్నారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో మొదటి, రెండో దశలోనూ వైరస్‌ను అడ్డుకోగలిగామన్నారు. అన్ని జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించగలిగామని అన్నారు. రానున్న రోజుల్లో ప్రతీ జిల్లా కేంద్రంలో వైద్య కళాశాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని అన్నారు.

పరిపాలన సౌలభ్యం కోసమే సమీకృత భవనాలు
ఫ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి
ప్రజలకు పరిపాలనను మరింత చేరువచేసేందుకు, పరిపాలన సౌలభ్యం కోసం 5 సంవత్సరాల కిందట సీఎం కేసీఆర్‌ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని అన్నారు. దాంతో పాటు అన్ని శాఖలు ఒకే దగ్గర ఉండేవిధంగా అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేలా నూతన సమీకృత కలెక్టరేట్‌, ఎస్పీ భవనాలను మంజూరు చేశారని అన్నారు. ఆ భవన నిర్మాణాలు పూర్తయి సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. రైతుబంధు, బీమా, 24 గంటల ఉచిత కరెంట్‌ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. ప్రతిపక్షాలు తెలంగాణ ప్రభుత్వంపై కేసీఆర్‌పై ఎన్నో ఆరోపణలు చేస్తున్నప్పటికీ సీఎం కేసీఆర్‌ వెనుకడుగు వేయకుండా అభివృద్ధి సంక్షేమంపై దృష్టి సారించి బంగారు తెలంగాణ దిశగా పాలన సాగిస్తున్నారని అన్నారు. తెలంగాణలో శాంతిభద్రతలు పకడ్బందీగా అమలవుతున్నాయని అన్నారు.

రోల్‌మోడల్‌గా తెలంగాణ
ఫమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
దేశంలో తెలంగాణ రోల్‌మోడల్‌గా నిలుస్తోందని అన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో బంగారు తెలంగాణ దిశగా ప్రయాణిస్తోందని అన్నారు. నేడు నూతన కలెక్టరేట్‌, పోలీసు భవనాలను ప్రారంభించుకోవడంతో ప్రజలకు మరింత పాలనను సీఎం కేసీఆర్‌ దగ్గరకు చేశారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.1,360 కోట్లతో కొత్త జిల్లాలో నూతన కలెక్టరేట్‌, ఎస్పీ భవనాల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. కామారెడ్డి జిల్లాలోనూ 28 శాఖలు ఒకే దగ్గర ఉండేలా అత్యధిక హంగులతో సమీకృత కలెక్టరేట్‌ను నిర్మించడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.

కామారెడ్డికి మెడికల్‌ కళాశాలను మంజూరు చేయాలి
ఫ గంప గోవర్ధన్‌, ప్రభుత్వ విప్‌, కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రానికి మెడికల్‌ కళాశాలను, ఐటీఐ, ఇంజనీరింగ్‌, మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. అదేవిధంగా కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని రైతాంగానికి సాగునీరు అందించేందుకు చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 22వ ప్యాకేజీ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో 99 గ్రామ పంచాయతీలకు సీసీరోడ్లు మంజూరు చేయాలన్నారు. కామారెడ్డిలో రోజురోజుకూ పెరుగుతున్న జనాభా దృష్ట్యా మరో రైల్వ్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మించేలా కృషి చేయాలన్నారు. పాల్వంచ గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటుచేయాలని, కామారెడ్డి మండలంలో మరో పీఏసీఎస్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకొని కామారెడ్డి జిల్లాను ఏర్పాటు చేశారని ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు నూతన సమీకృత భవనాలను నిర్మించి ప్రారంభించినందుకు జిల్లా ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హోంశాఖ మంత్రి మహమ్మద్‌ అలీ, రోడ్డు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, సీఎస్‌ సోమేస్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, రాష్ట్ర పోలీసు హౌజింగ్‌బోర్డు చైర్మన్‌ దామోదర్‌ గుప్తా, సీఎంవో స్మీతా సబర్వాల్‌, కలెక్టర్‌ శరత్‌, ఎస్పీ శ్వేతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-21T06:27:31+05:30 IST