కమనీయం.. మల్లన్న కల్యాణం

ABN , First Publish Date - 2021-01-11T04:48:42+05:30 IST

కొమురవెల్లి మల్లన్న పెళ్లి చూడముచ్చటగా జరిగింది. అశేష భక్తజనం కనులారా వీక్షించి మురిసింది. కోరమీసాల మల్లన్న నామస్మరణతో కొమురవెల్లి క్షేత్రం మార్మోగింది. వీరశైవపండితుల మంత్రోచ్ఛారణలు, మేళతాళాలు, మంగళవాయిద్యాల చప్పుళ్లు, భక్తుల జయజయధ్వానాలతో ఆలయ తోటబావి ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంలో ఓలలాడింది. మార్గశిరమాసం చివరి రోజైన ఆదివారం సనాతన వీరశైవాగమశాస్త్రం ప్రకారం మల్లికార్జునస్వామి కేతలమ్మ, మేడలాదేవీ కల్యాణాన్ని కడురమణీయంగా నిర్వహించారు.

కమనీయం.. మల్లన్న కల్యాణం
తోటబావి వద్ద కల్యాణ వేదికపై కేతలమ్మ, మేడలాదేవి సమేతంగా మల్లికార్జునస్వామి

పట్టువస్ర్తాలను సమర్పించిన మంత్రి హరీశ్‌రావు 

హాజరైన మంత్రి మల్లారెడ్డి,ప్రముఖులు 

తిలకించి పులకించిన భక్తులు


చేర్యాల, జనవరి 10  : కొమురవెల్లి మల్లన్న పెళ్లి చూడముచ్చటగా జరిగింది. అశేష భక్తజనం కనులారా వీక్షించి మురిసింది. కోరమీసాల మల్లన్న నామస్మరణతో కొమురవెల్లి క్షేత్రం మార్మోగింది. వీరశైవపండితుల మంత్రోచ్ఛారణలు, మేళతాళాలు, మంగళవాయిద్యాల చప్పుళ్లు, భక్తుల జయజయధ్వానాలతో ఆలయ తోటబావి ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంలో ఓలలాడింది. మార్గశిరమాసం చివరి రోజైన ఆదివారం సనాతన వీరశైవాగమశాస్త్రం ప్రకారం మల్లికార్జునస్వామి కేతలమ్మ, మేడలాదేవీ కల్యాణాన్ని కడురమణీయంగా నిర్వహించారు.


ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు, తలంబ్రాలు

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు హరీశ్‌రావు, మల్లారెడ్డి ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు, తల్రంబాలను అందజేశారు. అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సంప్రదాయబద్ధంగా పట్టువస్ర్తాలను, తలంబ్రాలను అందించారు. మాంగళ్యధారణ అనంతరం స్వామివారిని దర్శించుకుని మల్లన్న ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కన్యాదాన సమయంలో మంత్రి హరీశ్‌రావు అమ్మవార్ల తరఫున రూ.1,0,1,116 నగదు, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మల్లన్న తరఫున రూ.1,01,116 నగదు, పసుపు,కుంకుమలకింద రూ.1,116 కట్నంగా అందించారు.


శివాచార్యమహాస్వామి పర్యవేక్షణలో కల్యాణ క్రతువు

వీరశైవార్చకులు మల్లికార్జునస్వామి, కేతలమ్మ, మేడలాదేవీ ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ఊరేగిస్తూ మహిళల కోలాటాల నడుమ భాజాభజంత్రీల మధ్య తోటబావి ప్రాంగణంలోని కల్యాణ మండపానికి తీసుకువచ్చారు. వరుడు మల్లికార్జునస్వామి తరఫున కన్యాగ్రహీతలుగా పడిగన్నగారి ఆంజనేయులు, అర్చన దంపతులు.. అమ్మవార్లు గొల్లకేతమ్మ, మేడలాదేవీ తరఫున కన్యాదాతలుగా మహదేవుని మల్లికార్జున్‌, మానస దంపతులు వ్యవహరించారు. కాశీ జ్ఞానసింహాసన మహాపీఠశాఖాధిపతి షట్‌స్థల బ్రహ్మశ్రీ గురుసిద్ధ మణికంఠ శివాచార్యమహాస్వామి పర్యవేక్షణలో, ఈవో బాలాజీ ఆధ్వర్వంలో వీరశైవఆగమ పండితులు కల్యాణ క్రతువును నిర్వహించారు. అనంతరం ముత్యాల తలంబ్రాలు, ఓడిబియ్యం పోశారు. డాక్టర్‌ మహంతయ్య, షశిభూషణ సిద్ధాంతి స్వామివారి కల్యాణ నిర్వహణ తీరు, విశేషాల గురించి చేసిన వ్యాఖ్యానం ఆకట్టుకున్నది. 


హాజరైన ప్రముఖులు

కల్యాణానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరె డ్డి యాదగిరిరెడ్డి, శాసనమండలి విప్‌ వెంకటేశ్వర్లు, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర ్మన్‌ ఎర్రోల్ల శ్రీనివాస్‌, అటవీశాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, సిద్దిపేట జడ్పీచైర్‌పర్సన్‌ వేలేటి రోజాశర్మ, సిద్దిపేట ఆర్డీవో అనంతరెడ్డి, పునరుద్ధరణ కమిటీ సభ్యులు దువ్వల మల్లయ్య, వజ్రోజు శంకరాచారి, ఉట్కూరి అమర్‌, బుస్స శ్రీనివాస్‌, ఎంపీపీలు తలారి కీర్తన, వుల్లంపల్లి కరుణాకర్‌, బద్దిపడిగ కృష్ణారెడ్డి, జడ్పీటీసీ సిలివేరి సిద్ధప్ప, శెట్టే మల్లేశం, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్‌ బొంతు శ్రీదేవి, జిల్లా, నియోజకవర్గ, మండలస్థాయి నేతలు, సర్పంచులు, ఎంపీటీ సీలు, అఽధికారులు హాజరయ్యారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు మల్లన్నను దర్శించుకున్నారు. హుస్నాబాద్‌ ఏసీపీ మహేందర్‌ పర్యవేక్షణలో చేర్యాల సీఐ భీంరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.


గర్భాలయంలోనూ శాస్త్రోక్తంగా కల్యాణం

గర్భాలయంలోనూ మల్లన్నకు శాస్ర్తోక్తంగా కల్యాణాన్ని నిర్వహించారు. కన్యాదాతలుగా మహదేవుని సాంబయ్య-అనసూయ దంపతులు, కన్యాగ్రహీతలుగా పడిగన్నగారి వంశస్థులైన పడిగన్నగారి మల్లికార్జున్‌-మాధవి దంపతులు వ్యవహరించారు. ఏకాదశరుద్రాభిషేకం పూజలు చేశారు. తెల్లవారుజామున 4.30 గంటలకు గర్భాలయ మండపంలోని వీరభద్రుడికి బలిహరణ చేసి దృష్టికుంభాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి మల్లికార్జున స్వామి రథోత్సవం కన్నులపండువగా కొనసాగింది.



Updated Date - 2021-01-11T04:48:42+05:30 IST