మళ్లీ పెన్నానదికి వరద

ABN , First Publish Date - 2021-11-30T04:57:54+05:30 IST

మండలంలో గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మళ్లీ పెన్నానదికి సోమవారం ఉదయం నుంచి వరద ప్రవాహం వస్తుండడంతో పలు గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

మళ్లీ పెన్నానదికి వరద
దామరమడుగు గుంటకట్ట ప్రాంతంలో ఇళ్లు ఖాళీచేసి వెళ్తున్న గ్రామస్థులు

భయాందోళనలో ముంపు గ్రామాల ప్రజలు

 

బుచ్చిరెడ్డిపాళెం, నవంబరు 29: మండలంలో గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మళ్లీ పెన్నానదికి సోమవారం ఉదయం నుంచి వరద ప్రవాహం వస్తుండడంతో  పలు  గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పెన్నా వరద ప్రవాహం మండలంలోని మినగల్లు నుంచి దామరమడుగు, పల్లిపాళెం వరకు తీరం వెంబడి పొలాలు కోతకు గురవుతుండడంతో మినగల్లు వద్ద సోమవారం సవకతోటల్లోని చెట్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. గత వరదలకు దెబ్బతిన్న రోడ్లు నేటికీ మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో  4రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని పొలాలు సుమారు 4అడుగుల మేర నీళ్లు చేరాయి. పలు దళిత, గిరిజన  కాలనీల్లో మునిగిపోయాయి. దీంతో ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. 


ఊరొదిలి వెళ్తున్న గుంటకట్ట వాసులు

మండలంలోని దామరమడుగు గుంటకట్ట ప్రాంతంలో వర్షపునీరు ఇళ్లను చుట్టుముట్టడం.. దానికితోడు పెన్నానదికి వరద నీరు ప్రవహిస్తున్నాయని తెలిసి ప్రజలు ముందుగానే ఇళ్లు వదలి వెళ్తున్నారు. అలాగే దామరమడుగు పరిధిలోని పల్లిపాళెంలో లోతట్టు ప్రాంత ప్రజల్లోనూ వరద ప్రవాహంపై ఆందోళన నెలకొంది.  


రోడ్లు పరిశీలించిన ఆర్డీవో

మండలంలోని పలు రోడ్లను ఆర్డీవో హుస్సేన్‌సాహెబ్‌ సోమవారం పరిశీలించారు. ఈ మేరకు పెనుబల్లి వద్ద గత వరదకు భారీగా కోతకు గురైన బుచ్చి-జొన్నవాడ మార్గంలోని రోడ్డును ఆయన పరిశీలించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మళ్లీ ఆ రోడ్డుపై వర్షపునీరు పారుతుండడంతో రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడింది.   వరద ఉధృతి పెరిగితే ముంపు ప్రమాదం తప్పదని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 





=======

Updated Date - 2021-11-30T04:57:54+05:30 IST