మార్చి 31కి క్లోజర్‌

ABN , First Publish Date - 2021-01-19T07:11:24+05:30 IST

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల దృష్ట్యా మార్చి 31 నుంచి క్లోజర్‌ ప్రారంభమవుతుందని... సాగు, తాగునీటి కాలువలకు గోదావరి జలాల విడుదల నిలిపివేస్తామని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి స్పష్టం చేశారు.

మార్చి 31కి క్లోజర్‌
అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి

జలవనరులు, ఆర్‌డబ్ల్యుఎస్‌, వ్యవసాయ శాఖలు  సమన్వయంతో పనిచేయాలి

రూ.4.43 కోట్లతో 37 క్రాస్‌బండ్‌ పనులు

వచ్చేనెల 15 నాటికి అన్ని తాగునీటి రిజర్వాయర్లు నింపాలి

అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు అవగాహన కల్పించాలి: కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి

కాకినాడ, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల దృష్ట్యా మార్చి 31 నుంచి క్లోజర్‌ ప్రారంభమవుతుందని... సాగు, తాగునీటి కాలువలకు గోదావరి జలాల విడుదల నిలిపివేస్తామని    కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లో జేసీ లక్ష్మీశతో కలిసి జలవనరులు, ఆర్‌డబ్ల్యుఎస్‌, వ్యవసాయ శాఖల అధికారులతో ఇటీవల నిర్వహించిన ఇరిగేషన్‌ ఎడ్వయిజరీ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించారు. పోలవరం పనులు జరుగుతున్నాయని, వాటికి ఎటువంటి ఆటంకం లేకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో కాలువలకు నీటి సరఫరా నిలుపుదల చేస్తున్నామన్నారు. ఈ సమయంలో జిల్లాలో ఎక్కడా నీటి ఎద్దడి తలెత్తకుండా నీటిని పొదుపుగా వినియోగించుకునేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు తరచూ క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఇరిగేషన్‌ ద్వారా రూ.4.43 కోట్లతో 37 క్రాస్‌బండ్‌ నిర్మాణ పనులను తక్షణం చేపట్టాలని ఇంజనీర్లను ఆదేశించారు. అవసరమైన అనుమతులపై ఆలస్యం లేకుండాచర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి రిజర్వాయర్లను వచ్చే నెల 15వ తేదీ నాటికి సమృద్ధిగా నింపాలన్నారు. వీటికి చేపట్టే మరమ్మతులను గడువులోగా పూర్తి చేయాలన్నారు. గత బోర్డు సమీక్షలో గత ఏడాది డిసెంబరు 31 నాటికి నాట్లు వేయాలని నిర్ణయించామన్నారు. అయితే ప్రస్తుతం నాట్లు వేయని రైతులుంటే స్వల్పంగా పంటలు వేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో దండోరా వేయించి రైతుల నుంచి లిఖిత పూర్వకంగా సమాచారం తీసుకోవాలన్నారు. రైతు భరోసా కేంద్రాల పరిధిలో ఈ కార్యక్రమం చేపట్టాలన్నారు. సెంట్రల్‌ డెల్టా విషయంలో అప్రమత్తంగా ఉండి అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. నీటి నిల్వల నిర్వహణకు అవసరమైతే క్షేత్రస్థాయిలో అనుభవం ఉన్న ఇరిగేషన్‌ ఇంజనీర్ల సేవలను వినియోగించుకోవాలన్నారు. రైతుల నుంచి ఎటువంటి ఫిర్యాదులూ రాకూడదన్నారు. నీటి నిలుపుదల అంశం సున్నితమైనదని, తదనుగుణంగా సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ    జరుగుతున్న పనులను పర్యవేక్షించాలన్నారు. ఐఏబీ తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఇరిగేషన్‌ ఎస్‌ఈ ఆర్‌.శ్రీరామకృష్ణ, ఆర్‌         డబ్ల్యుఎస్‌ ఎస్‌ఈ టి.గాయత్రీదేవి, వ్యవసాయ శాఖ జేడీ కేఎస్వీ ప్రసాద్‌ పాల్గొన్నారు.     

Updated Date - 2021-01-19T07:11:24+05:30 IST