Abn logo
Aug 14 2020 @ 13:36PM

రోడ్లనూ వదలా.. మార్కాపురంలో ఇష్టారాజ్యం

రెచ్చిపోతున్న అధికారం

ఆర్‌అండ్‌బీ స్థలాల స్వాహా

విలువ రూ.కోట్లలోనే..

పట్టించుకోని అధికారులు


ఆక్రమణదారులకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. అధికారుల పర్యవేక్షణ కొరవడటం వారికి కలిసొస్తుంది. ముఖ్యంగా మార్కాపురం పట్టణ పరిధిలో సర్కారు స్థలాల ఆక్రమణలు ఎక్కువయ్యాయి. వెలిగొండ ప్రాజెక్ట్‌ వేగంతో పాటు మార్కాపురం చుట్టూ హైవేల నిర్మాణం పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో భూముల విలువకు రెక్కలొచ్చాయి. ఇదే అదనుగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. వారి కళ్లు ప్రభుత్వ, దేవదాయ భూములపై పడ్డాయి. ఆక్రమణదారులు అధికారపార్టీకి చెందిన వారు కావడం, వారికి నియోజకవర్గ అధినాయకుల ఆశీస్సులు మెండుగా ఉండటం, అధికారయంత్రాంగం సహాయ సహకారాలుండటంతో కబ్జాలపర్వం యథేచ్ఛగా సాగుతోంది. దీంతో కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు కనుమరుగవుతున్నాయి. 


మార్కాపురం(ప్రకాశం): ప్రస్తుతం మార్కాపురం నుంచి పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు వరకూ ఉన్న ప్రాంతంలో భూములకు డిమాండ్‌ ఏర్పడింది. ఆ ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో నాలుగు ఇంజనీరింగ్‌ కళాశాలలు ఉండటం, వాటికి తోడు ఫార్మసీ, ఫాలిటెక్నిక్‌, అగ్రికల్చర్‌ కళాశాలలు ఉన్నాయి. అంతేకాక వెలిగొండ ప్రాజెక్ట్‌ నిర్వాసిత గ్రామాలైన కలనూతల, గుండంచర్ల ప్రజలకు ఏర్పాటుచేసే ఇడుపూరు-1, ఇడుపూరు-2, గుండంచెర్ల పునరావాస కాలనీలను కూడా ఈ పరిధిలోనే ఏర్పాటు చేస్తున్నారు. ఈ కాలనీల్లో 3వేలకుపైగా గృహ నిర్మాణాలు జరుగనున్నాయి. అంతేకాక మార్కాపురం పట్టణ పేదలకు సీఎం జగన్‌ ఇవ్వనున్న ఇళ్ల స్థలాలు కూడా ఈ ప్రాంతంలోనే 9వేలకుపైగా ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి.


ఆర్‌అండ్‌బీ స్థలాల ఆక్రమణ

ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్న సమయంలో చిత్తూరు జిల్లా నుంచి హైదరాబాద్‌కు 565 జాతీయ రహదారి నిర్మాణం చేశారు. ఈ రహదారి మార్కాపురం సరిహద్దుగా వెళుతుంది. అ రోడ్డు నిర్మాణ సమయంలో మార్కాపురం-దేవరాజుగట్టు మధ్య ఉన్న ఆర్‌అండ్‌బీ రహదారిని జాతీయ రహదారిగా మార్చారు. మార్పులో భాగంగా రోడ్డు నిర్మాణంలో ఒంపులను తొలగించి రోడ్డు పక్కన ఉన్న రైతుల భూములను సేకరించి జాతీయరహదారి నిర్మాణం పూర్తిచేశారు. ఒంపుల తొలగింపు కారణంగా ఖాళీగా ఉన్న ఆర్‌అండ్‌బీ రహదారి స్థలం, దానికి జాతీయ రహదారికి మధ్య ఉన్న స్థలాలపై ఆక్రమణదారులు కన్నేశారు. 


దరిమడుగు ఎస్సీకాలనీ సమీపంలో...

మార్కాపురం మండలం ఇడుపూరు రెవెన్యూ ఇలాకాలో దరిమడుగు ఎస్సీకాలనీ సమీపంలో సర్వే నెంబర్‌ 856లో ఆర్‌అండ్‌బీ శాఖకు 3.10ఎకరాల భూమి ఉంది. అందులో హైవే నిర్మాణానికి పోను ఎకరా భూమి ఉంది. ప్రస్తుతం ఆ భూమి మార్కెట్‌ విలువ రూ.3కోట్లపైమాటే. ఆ భూమిపై కన్నేసిన గ్రామానికి చెందిన అధికారపార్టీ నాయకుడు గతేడాది డిసెంబర్‌లో రాత్రికి రాత్రి ఎక్సకవేటర్లతో చదును చేసి ఆక్రమణలకు శ్రీకారం చుట్టాడు. ఆంధ్రజ్యోతిలో కథనం రావడం, అధికార యంత్రాంగం కదలడంతో ఆక్రమణకు అడ్డుకట్ట పడింది. అప్పుడు రెవెన్యూ అధికారులు ఆర్‌అండ్‌బీ స్థలానికి హద్దు రాళ్లు కూడా ఏర్పాటు చేశారు. ఎస్సీ కాలనీకి చెందిన మురుగునీరు వెళ్లేందుకు కాల్వను కూడా తవ్వించారు.


ఆర్‌అండ్‌బీ హద్దురాళ్లు తొలగించి మరీ..

కానీ సదరు నాయకుడు అధికారపార్టీ నియోజకవర్గ అధిష్టానానికి ఏమి తాయిలం వేశాడో తెలియలేదు కానీ అతని ఆగడాలకు ఎవరూ అడ్డుచెప్పడం లేదు. దీంతో ఆక్రమణపర్వానికి మళ్లీ తెరతీశాడు. గతంలో అధికారులు నిర్ధేశించిన హద్దురాళ్లను తొలగించాడు. పూర్వం నుంచి ఎస్సీ కాలనీలోని మురుగు బయటకు వెళ్లే డ్రైయిన్‌ను మరోచోటకు మార్చాడు. దానికి కూడా ప్రభుత్వ నిధులు వెచ్చించడం గమనార్హం. ఆక్రమించిన భూమిని పక్కనే ఉన్న తన భూమిలో కలుపుకొని హద్దురాళ్లు పాతుకున్నారు. తాను ఆక్రమించగా మిగిలిన ప్రభుత్వ భూమిలో నుంచి తన పొలంలోకి మూడు రోడ్లు కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకు పర్యావరణ హితకారునిగా మిగిలిన ప్రభుత్వ భూమిలో మొక్కలు కూడా నాటాడు. 


ఇడుపూరు కాలనీ-2 సమీపంలో...

పై అధికారపార్టీ నాయకుడిని ఆదర్శంగా తీసుకున్న మరో అధికారపార్టీ సానుభూతిపరుడు ఇదే తరహాలో ఆర్‌అండ్‌బీ రోడ్డు ఆక్రమణకు తెరతీశాడు. కలనూతల నిర్వాసితుల కోసం ఇడుపూరు-2 నిర్మాణానికి స్థల సేకరణ జరిగింది. దానికి ఎదురుగా 565 జాతీయరహదారి వెళుతుంది. అక్కడ కూడా పాత ఆర్‌అండ్‌బీ రహదారికి, జాతీయ రహదారికి మధ్య రోడ్డు, భవనాల శాఖకు చెందిన స్థలం ఖాళీగా ఉంది. దానికి పక్కనే ప్రైవేటు భూములున్నాయి. ఆ ప్రైవేటు భూములున్న యజమాని ఆ ఖాళీస్థలాన్ని ఆక్రమించేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఆ స్థలం 50సెంట్ల మేర ఉంది. దానికి విలువ కూడా కోటి పైమాటే. పాత ఆర్‌అండ్‌బీ రోడ్డుకు, తన స్థలానికి మధ్య ఉన్న స్థలాని మట్టితో ఇప్పటికే చదును చేసిన సదరు ఆక్రమణదారుడు, పాత ఆర్‌అండ్‌బీ, హైవే మధ్య ఉన్న ఖాళీస్థలాన్ని చదును చేసి ఆక్రమించుకునేందుకు మట్టిని తోలించాడు. రెండు మూడు రోజుల్లో తాను అనుకున్నదాన్ని పూర్తిచేసే ఆలోచనలో ఉన్నాడు.


మిన్నకుంటున్న అధికార యంత్రాంగం

ఆక్రమణలను అడ్డుకోవాల్సిన అధికారులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఈ ఆక్రమణ దారి నుంచే జిల్లా, డివిజన్‌ స్థాయి అధికారయంత్రాంగం ప్రతిరోజూ రాకపోకలు సాగిస్తోంది. ఈ ఆక్రమణ వ్యవహారాల్లో అధికారపార్టీనాయకులు ఉండటం, వారికి నియోజకవర్గ స్థాయి నాయకుల మద్దతు సంపూర్ణంగా ఉండటంతో యంత్రాంగం మిన్నకుంటోంది. కొందరైతే ఏకంగా ఆక్రమణదారులకు అనుకూలంగా ఉంటూ వారిచ్చే తృణమోఫణమో తీసుకుంటూ, విందు పొందుల్లో పాల్గొంటూ తృప్తి చెందుతున్నారు. 


ప్రజాధనం దుర్వినియోగానికి భాధ్యులెవరు?: కొండపి ఎమ్మెల్యే స్వామి

ఒంగోలు: పేదలకు ఇంటి స్థలాల పంపిణీ అంటూ రూ.40కోట్లు వృథాగా ఖర్చుచేశారని, ప్రజాధనం దుర్వినియోగానికి బాధ్యులెవరని కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ డిబీవీవీ స్వామిప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో ప్రశ్నించారు. పేదలకు ఇంటి నివేశన స్థలాల పంపిణీకి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదన్నారు. టీడీపీ హయాంలో గుర్తించిన లబ్ధిదారులకు జీప్లస్‌త్రీ గృహాలను కేటాయించగా, వాటిని కాదని కొండ ప్రాంతాల్లో స్థలాలు ఇచ్చేందుకు సిద్ధం చేశారని విమర్శించారు. టంగుటూరు మండలం సర్వేరెడ్డిపాలెం, మర్లపాడు, కందులూరు, కొణిజేడు గ్రామాల మధ్య కేంద్ర గనుల శాఖ పరిఽధిలోని భూముల్లో ఇళ్లపట్టాలు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. యరజర్ల వద్ద స్థలాల పంపిణీకి రూ.40కోట్లు ఖర్చుచేశారని, ఇప్పుడీ నష్టానికి ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యత వహించాల్సిందేనని ఆయన డిమాండ్‌ చేశారు. 


Advertisement
Advertisement
Advertisement