అభయ హస్తానికి మంగళం!

ABN , First Publish Date - 2022-03-16T06:33:37+05:30 IST

మహిళా సంఘాల సభ్యులకు అండగా నిలిచేందుకు గత కాంగ్రెస్‌ ప్రభుత్వం 2009లో అభ య హస్తం పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే అర్హు లైన సభ్యులు రోజుకు ఒక రూపాయి చొప్పున చెల్లిస్తే నెలనెలా పెన్షన్‌తో పాటు ఆపద సమయంలో బీమా సౌకర్యం, ఇద్దరు పిల్లలకు స్కాలర్‌షిప్‌ను అందించిం ది. యేడాదికి రూ.365 చెల్లిస్తే ప్రభుత్వం మరో రూ.365 చెల్లించి భరోసా కల్పించింది.

అభయ హస్తానికి మంగళం!
సమావేశమైన డ్వాక్రా మహిళలు(ఫైల్‌)

జిల్లాలో 39వేల 951 మంది మహిళా సభ్యులు
2009 నుంచి 2014 వరకు చెల్లించిన సొమ్మును తిరిగి ఇచ్చేందుకు ఏర్పాట్లు
గందరగోళంలో 5,712 మంది ఖాతాలు
పూర్తి వివరాలను సేకరిస్తున్న డీఆర్డీఏ అధికారులు
‘హస్తం’ పథకాన్ని ఎత్తివేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు
జిల్లావ్యాప్తంగా రూ.14 కోట్ల వరక ప్రీమియం చెల్లింపులు
ప్రభుత్వం నుంచి జిల్లాకు రూ.25 కోట్లు రావాల్సి ఉంటుందని అంచనా

ఆదిలాబాద్‌, మార్చి 15(ఆంధ్రజ్యోతి): మహిళా సంఘాల సభ్యులకు అండగా నిలిచేందుకు గత కాంగ్రెస్‌ ప్రభుత్వం 2009లో అభ య హస్తం పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే అర్హు లైన సభ్యులు రోజుకు ఒక రూపాయి చొప్పున చెల్లిస్తే నెలనెలా పెన్షన్‌తో పాటు ఆపద సమయంలో బీమా సౌకర్యం, ఇద్దరు పిల్లలకు స్కాలర్‌షిప్‌ను అందించిం ది. యేడాదికి రూ.365 చెల్లిస్తే ప్రభుత్వం మరో రూ.365 చెల్లించి భరోసా కల్పించింది. ఇలా 2009 నుంచి 2014 వరకు ఐదేళ్ల పాటు చెల్లించిన వారికి డబ్బుల ను తిరిగి చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కాలపరిమితి ముగియడంతో తిరిగి కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంతగా ఆసక్తి చూపించినట్లు కనిపించడం లేదు. ఎందుకంటే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఈ పథకంతో డ్వాక్రా మహిళల్లో ప్రత్యేకముద్ర వేసుకున్నారు. ఇప్ప టికీ వైఎస్‌ అంటేనే అభయ హస్తం పథకం అనే విధంగా మహిళల్లో భారీగా ప్ర చారంలో ఉంది. ఇలాంటి పథకాన్ని పూర్తిగా ఎత్తి వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే మహిళా గ్రూపు సభ్యులకు నగదు చెల్లించి అభయ హస్తం పథకాన్ని ఎత్తివేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తుంది.
సభ్యుల పొదుపు డబ్బులు వాపస్‌
అభయ హస్తం పథకంలో చేరిన పొదుపు డబ్బులను తిరిగి చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 2019 నుంచి 2014 వరకు చెల్లించిన మొత్తాన్ని గ్రూపు సభ్యుల ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 39 వేల 951 మంది సభ్యులు ఉన్నారు. అప్పట్లో అర్హులైన సభ్యుల నుంచి ప్రీమియం సొమ్మును వసూలు చేసి అర్హులైన వారికి నెలనెలా రూ.500 పెన్షన్‌ కూడా అందజేసింది. 2016లో ఆసరా పింఛన్ల ను పెంచడంతో.. వయస్సు నిండిన అర్హులైన సభ్యులకు రూ.2016 పెన్షన్‌ దక్కుతుంది. దీంతో అభయ హస్తం పథ కం ప్రాధాన్యతను కోల్పోయింది. 2017 నుంచి ప్రీమియం సొమ్మును వసూలు చేయడం కూడా పూర్తిగా నిలిపి వేయడంతో ఈ పథకం అమలు మరుగున పడిపోయింది. పథకం నిలిపి వేయడంతో పొదుపు డబ్బులను వాపస్‌ చేయాలని సభ్యులు ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో తాజాగా అ భయ హస్తంలో సభ్యత్వం పొందిన సభ్యులందరికీ తిరిగి పొదుపు డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించింది. త్వరలోనే సభ్యుల ఖాతాల్లో నగదును జమ చేసేందుకు డీఆర్డీఏ అధికారులు కసరత్తు మొదలు పెట్టారు.
5712 ఖాతాల్లో గందరగోళం
జిల్లాలో 39,951 మంది సభ్యులు అభయ హస్తం పథకంలో ఖాతాలను కలిగి ఉన్నారు. ఇందులో 5,712 ఖాతాల్లో గందరగోళ పరిస్థితులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ ఖాతాలను పరిశీలించి పూర్తి వివరాలను మళ్లీ పంపాలని డీఆర్డీఏ అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం సభ్యులు డ్వాక్రా గ్రూపుల్లో కొనసాగుతున్నారా? బ్యాంకు ఖాతాలు సరిగానే ఉన్నాయా? ఖాతా పుస్తకాల్లో తప్పుల సవరణ వంటి వివరాలను సిబ్బంది సేకరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిం చి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఒకవేళ సభ్యురాలు మరణిస్తే వారి కు టుంబ సభ్యుల వివరాలను అందించాలని ప్రభుత్వం కోరినట్లు తెలుస్తుంది. వారంలో సరి చేసిన ఖాతా వివరాలను ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని జిల్లా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అయితే ప్రభుత్వ అమలు పూర్తిగా నిలిచిపోయి ఐదేళ్లు గడిచిపోవడంతో వివరాల సేకరణలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తుంది. కొంతమంది సభ్యులు 2009 నుంచి 2014 వరకు ప్రీమియం సొమ్మును చెల్లించగా.. మరికొందరు యేడాది, రెండేళ్ల పాటే చెల్లించి వదిలేశారు. మొత్తానికి జిల్లావ్యాప్తంగా సభ్యులు రూ.14 కోట్ల వరకు ప్రీమియం సోమ్మును చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం నుంచి జిల్లాకు రూ.25 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అభయ హస్తం పథకాన్ని యఽథావిధిగా కొనసాగించాలి
: శకుంతల, బజార్‌హత్నూర్‌ మండలం
గత ప్రభుత్వం అమలు చేసిన అభయ హస్తం పథకాన్ని ప్రభుత్వం యథావిధిగా కొనసాగించాలి. పథకంలోని లోటుపాట్లను అధిగమించి అమలు చేస్తే బాగుంటుంది. ఎందరో మంది డ్వాక్రా మహిళలకు ఈ పథకంతో ప్రయోజనం చేకూరింది. ఆపద సమయంలో మహిళలను ఆదుకునే విధంగా పథకాన్ని అమలు చేయాలి. అదేవిధంగా పథకాన్ని పూర్తిగా ఎత్తివేసే బదులు, దీని స్థానంలో మరో పథకానైనా అమలు చేస్తే బాగుంటుంది.
మహిళా సభ్యుల ఖాతాల వెరిఫికేషన్‌ కొనసాగుతోంది
: కిషన్‌, డీఆర్డీఏ పీడీ, ఆదిలాబాద్‌
అభయ హస్తం పథకంలో సభ్యత్వం కలిగి ఉన్న సభ్యుల వివరాలు, వారి ఖాతాల వెరిఫికేషన్‌ కొనసాగుతోంది. ప్రభుత్వం 5,712 మంది సభ్యుల ఖాతాలను వెరిపికేషన్‌ చేయాలని ఆదేశించింది. ఇప్పటి వరకు  5,564 ఖాతాల వెరిఫికేషన్‌ను పూర్తి చేశాం. మిగిలిన ఖాతాల పరిశీలన కొనసాగుతోంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే ముందుకెళ్తాం. ఇంకా విధివిధానాలు ఖరారు కావాల్సి ఉంది. జిల్లాకు రావాల్సిన సొమ్ముపై స్పష్టత రావడం లేదు.

Updated Date - 2022-03-16T06:33:37+05:30 IST