కరోనా థర్డ్ వేవ్ టెన్షన్.. ఐదేళ్లలోపు పిల్లలకు మాస్కులు అక్కర్లేదట.. WHO ఏం చెబుతోందంటే..

ABN , First Publish Date - 2021-06-12T03:01:59+05:30 IST

కరోనా రెండో దశ ఉద్ధృతితో దేశం ఉక్కిరిబిక్కిరి అయిపోయింది

కరోనా థర్డ్ వేవ్ టెన్షన్.. ఐదేళ్లలోపు పిల్లలకు మాస్కులు అక్కర్లేదట.. WHO ఏం చెబుతోందంటే..

కరోనా రెండో దశ ఉద్ధృతితో దేశం ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. భారీ సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం దేశంలో థర్డ్ వేవ్ టెన్షన్ మొదలైంది. ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్‌లో కరోనా మూడో దశ వస్తుందని, అది చిన్న పిల్లలపై ప్రభావం చూపుతుందని అంచనాలు వినబడుతున్నాయి. థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు కొన్ని రాష్ట్రాలు సన్నద్ధమవుతున్నాయి. అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. 


థర్డ్ వేవ్‌లో  పసిపిల్లలు కరోనా బారిన పడతారని ప్రచారం జరుగుతున్నా.. అయిదేళ్లలోపు చిన్నారులకు మాస్కులు అవసరం లేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన మేరకే డీజీహెచ్ఎస్ ఈ సూచన చేసింది. ఆరు నుంచి 11 ఏళ్ల వయసు చిన్నారులు మాత్రం కచ్చితంగా ముఖానికి మాస్కులు ధరించాలని, అది కూడా వైద్యులను సంప్రదించిన తర్వాత తల్లిదండ్రుల సమక్షంలోనే ధరించాలని తెలిపింది. 


చిన్నపిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?

చిన్న పిల్లలకు కరోనా వైరస్ ప్రమాదకరంగా మారుతుందనే ఆధారాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లభ్యం కాలేదు. వారికి వైరస్ సోకినా లక్షణాలు స్వల్పంగానే ఉంటాయి. కొంతమందిలో అసలు కనిపించవు. కాబట్టి వారు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదు. ఆ వయసు పిల్లలు తరచుగా మాస్కులు ధరిస్తే ఇతర సమస్యలు వచ్చే ప్రమాదముంది. శుభ్రం చేయని మాస్కులు పెట్టుకోవడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు కలుగుతాయి. ఐదేళ్ల లోపు పిల్లలకు మాస్క్ ఎలా ఉపయోగించాలో తెలియదు. కాబట్టి వారికి మాస్క్ అనవసరం. వారి చుట్టూ ఉండే పెద్దలు మాత్రం మాస్క్ ధరించాలి. 


ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు


1)6-11 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో మాస్క్‌లు ధరించాలి. 


2)చిన్నారుల కరోనా చికిత్సలో రెమిడెసివర్ వినియోగించకూడదు. 


3) ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ గురించి తెలుసుకునేందుకు హెచ్‌ఆర్‌సీటీ ఇమేజింగ్‌ చేయవచ్చు


4)కరోనా ప్రభావం అధికంగా ఉండి ఆసుపత్రిలో చేరి, పరిస్థితి విషమంగా ఉన్నవారికి తప్ప అనవసరంగా స్టిరాయిడ్స్ ఉపయోగించకూడదు. 


Updated Date - 2021-06-12T03:01:59+05:30 IST