Abn logo
Sep 13 2021 @ 23:56PM

మట్టి.. కొల్లగొట్టి!

ముసునూరు పెద్ద చెరువులో ఎక్స్‌కవేటర్లతో టిప్పర్లకు లోడ్‌ చేస్తున్న గ్రావెల్‌

గ్రావెల్‌ కోసం చెరువులను కుళ్లబొడుస్తున్నారు!

గోరంత అనుమతులు.. కొండంత తవ్వకాలు

కావలి ప్రాంతంలో రియల్టర్ల ఇష్టారాజ్యం

ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం

అధికారులకు మామూళ్ల మత్తు

 ఆంధ్రజ్యోతి నిఘా

 

చెరువుల్లో దొంగలు పడ్డారు.. నీటి కోసమో.. స్థలం కబ్జా కోసమో కాదండోయ్‌. ప్రకృతి సంపద అయిన మట్టి (గ్రావెల్‌) కోసమే. అనుమతి గోరంత.. తవ్వేది కొండంత అన్నట్టుగా రాత్రింబవళ్లు భారీ యంత్రాలతో టిప్పర్ల కొద్దీ గ్రావెల్‌ను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం ఏం ఎరగనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎవరైనా ఫిర్యాదు చేసినా ‘‘ష్‌.. గప్‌చుప్‌. మాకేం తెలియదు. ఏవైన వివరాలు కావాలంటే మా పై అధికారులను అడిగి చెబుతాం’’ అని సమాధానం దాటవేస్తున్నారు. కేవలం రియల్టర్ల మాముళ్లకు తలొగ్గి అధికారులు కళ్లు మూసుకుంటున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

 

కావలి, సెప్టెంబరు 13 : కావలి పట్టణ శివార్లలోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న తాళ్లపాలెం, ముసునూరు పెద్ద చెరువులతోపాటు కొత్తపల్లి, ఆర్సీపాలెం, కావలి, సిరిపురం, మన్నంగిదిన్నె, రుద్రకోట, మద్దూరుపాడు తదితర ప్రాంతాల్లోని చెరువులలో కొన్ని రోజులుగా గ్రావెల్‌ తవ్వకాలు జోరందుకున్నాయి. ఇక్కడ ఎత్తిన మట్టిన లే అవుట్లకు తరలించి జేబులు నింపుకుంటున్నారు. మరోవైపు తక్కువ అనుమతులతో ఎక్కువ తవ్వకాలు జరుగుతున్నందున ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ప్రభుత్వ నిభంధనలను తుంగలో తొక్కి  భారీ ఎక్స్‌కవేటర్లతో భారీ లోతున మట్టి తవ్వి ట్రిప్పర్లు, లారీలు, ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే గ్రావెల్‌ తరలింపునకు అనుమతులు ఉన్నాయని, లేదా జగనన్న కాలనీలకు తీసుకెళుతున్నారని చెబుతున్నారే తప్ప క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించడం లేదు. ఏ ఏ చెరువులలో ఎవరెవరికి ఎన్ని క్యూబిక్‌ మీటర్లకు అనుమతులు ఇచ్చారని అడిగినా ఆ వివరాలు తమ దగ్గర లేవని ఉన్నతాధికారులను అడగాలంటూ సమాధానం దాటవేస్తున్నారు. వాస్తవంగా అనుమతులు తీసుకున్నా నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది పర్యవేక్షణలో చెరువులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మూడు అడుగుల లోతుకు మించకుండా తవ్వుకోవాలి. కానీ ఈ ప్రాంతంలో ఏ చెరువులలో ఎంత మట్టిని ఏ సమయంలో తరలిస్తున్నారో కూడా తెలియని పరిస్థితి. కొంతమంది రియల్టర్ల ఇస్తున్న మామూళ్లకు కక్కుర్తిపడి అధికారులు ఉదాసీనంగా ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 


అధికారుల దొబూచులాట

గ్రావెల్‌ అక్రమ రవాణాను అరికట్టడంలో అధికారులు దోబూచులాడుతున్నారు. ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్‌, నీటిపారుదల శాఖ, సచివాలయాల మధ్య సమసన్వయం లేకపోవడంతో అక్రమార్కులకు కలిసివస్తోంది. రెవెన్యూ అఽధికారులు చెరువులలో మట్టికి అనుమతులు ఇచ్చినా  ఎంతవరకు అనుమతులు ఇచ్చారు.. ఏ మేరకు తవ్వుతున్నారు.. నిబంధనలకు లోబడే అంతా జరుగుతోందా!? పర్యవేక్షించుకోవాల్సిన బాధ్యత నీటిపారుదల శాఖ అధికారులదే. అలాగే గ్రామాలలో, వార్డులలో ఉన్న సచివాలయాల ఉద్యోగులు వారి పరిధిలో ఉన్న చెరువులలో మట్టిని ఎవరైనా అక్రమంగా తరలిస్తుంటే దానిని నిరోధించాల్సిన బాధ్యత కూడా వారిదేని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా సచివాలయాల వ్యవస్థ ఏర్పడ్డాక ఉద్యోగులు ప్రజలకు దగ్గరగా ఉన్నారు. తమ పరిధిలో జరిగే అక్రమాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉన్నా, ప్రభుత్వ వనరులను కొల్లగొడుతున్నా తమకెందుకులే అని పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. చెరువులను కాపాడాల్సిన నీటిపారుదల శాఖ అధికారులు మాత్రం ప్రతి భూమిపై రెవెన్యూ శాఖకు హక్కు ఉందని, అక్రమ గ్రావెల్‌ రవాణాను నిరోధించాల్సిన బాధ్యత వారిపైనే ఉంటుందని చెప్పి తప్పించుకుంటున్నారు. ఇక పోలీస్‌ శాఖ పరిస్థితికి వస్తే కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకులే! అన్నట్టుగా మామూళ్లతో సరిపెట్టుకుని వదిలేస్తున్నారు. ఒకవేళ మట్టి తరలించే వారు ప్రతిపక్ష పార్టీలకు చెందిన సానుభూతి పరులైతే పోలీసులు, అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే, కావలిలో మట్టి తరలించే వారంతా అధికార పార్టీ నాయకుల సానుభూతిపరులే కావడంతో ఎవరికివారుగా మిన్నకుండిపోతున్నారు.


మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం

చెరువులలో మట్టిని అక్రమంగా తరలిస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. ఒకవేళ ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. సచివాలయ సిబ్బంది ఎప్పటికప్పుడు అక్రమ గ్రావెల్‌ తరలింపుపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలి. అలా చేయని పక్షంలో సచివాలయ సిబ్బందిని బాధ్యులుగా తీసుకుని చర్యలు తీసుకుంటాం.

- శీనా నాయక్‌, ఆర్డీవో, కావలి


మాకు తెలియకుండానే తరలిస్తున్నారు!

చెరువులలో మట్టి తరలింపు కోసం అనుమతులు తీసుకుంటున్నారు. అయితే మాకు తెలియకుండానే, మా పర్యవేక్షణ లేకుండానే తరలిస్తున్నారు. కొందరైతే జగనన్న కాలనీల కోసమంటూ తీసుకెలుతున్నారు. నిబంధనలకు విరుద్దంగా తరలిస్తున్న చోట రెవెన్యూ, పోలీస్‌ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నాం.

- రమణరావు, డీఈ, నీటిపారదల శాఖ, కావలి