Abn logo
Oct 26 2021 @ 23:50PM

నగరం నడిబొడ్డున.. అక్రమ మట్టి తవ్వకాలు

కాకుమాను వారి తోట వద్ద కార్మికుల స్థలంలో మట్టిని అక్రమంగా తవ్విన ప్రదేశం

రాత్రికి రాత్రే వందల సంఖ్యలో లారీల ద్వారా రవాణా

గుంటూరు, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేతలు, వారి అనుచరులు బరితెగించారు. ఇప్పటివరకు మారుమూల ప్రాంతాల్లోనే అక్రమంగా మట్టి తవ్వకాలు సాగిస్తున్న వారు ఇప్పుడు ఏకంగా నగరం నడిబొడ్డున ఉన్న కార్మికులకు చెందిన స్థలంపై కన్నేశారు. గుట్టుచప్పుడు కాకుండా రాత్రివేళల్లో గత మూడురోజుల నుంచి వందల సంఖ్యలో లారీల ద్వారా మట్టిని అమరావతి రోడ్డులోని ప్రైవేటు స్థలానికి తరలించారు. దీని వెనక ఇద్దరు నాయకుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇళ్ల మధ్యన ఉన్న ఈ స్థలంలో పాతాళం లోతులో మట్టి తవ్వకాలు చేయడం వలన సమీపంలోని ఇళ్లు కుంగిపోయే పరిస్థితి ఉత్పన్నమైంది. ఇంత జరుగుతున్నా అటు పోలీసులు, ఇటు వాణిజ్య పన్నుల శాఖల అధికారులు పట్టించుకోలేదు. 

నగరంలో కాకుమాను వారి తోట సమీపంలో కార్మికశాఖకు చెందిన స్థలం ఉంది. సుమారు 13 ఎకరాల్లో ఈ భూమి ఉండగా అందులో కార్మికుల క్వార్టర్స్‌, శిక్షణ కేంద్రం ఉన్నాయి. ఇవిపోను ఇంచుమించుగా ఆరు ఎకరాల భూమిని టీడీపీ ప్రభుత్వ హయాంలో జీజీహెచ్‌ విస్తరణ కోసం కేటాయించారు. మరో ఏడు ఎకరాల భూమి ఖాళీగా ఉంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై కన్ను పడింది. కార్మికుల సంక్షేమం కోసం వినియోగించాల్సిన ఈ భూమిని మిషన్‌ బిల్డ్‌ ఏపీ పేరుతో అమ్మేయాలని చూసింది. అయితే ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కార్మికులు హైకోర్టుని ఆశ్రయించడంతో దీనిపై స్టే విధించింది. మరికొన్ని రిట్‌ పిటీషన్లు కూడా ఈ స్థలంపై పెండింగ్‌లో ఉన్నట్లు కార్మిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. 

కాగా ఈ స్థలంపై ఇద్దరు వైసీపీ నాయకుల కన్ను పడింది. ఇద్దరూ కూడబలుక్కొని హైకోర్టు స్టే విధించిన స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండానే మట్టి తవ్వకాలను చేపట్టారు. గత మూడు రోజుల నుంచి నిత్యం 200 లారీల మట్టిని ఎక్స్‌కవేటర్ల ద్వారా తవ్వి తరలిస్తున్నారు. కానీ అదికారులు ఇప్పటివరకు కనీసం ఒక్క లారీని కూడా పట్టుకోలేదు. ఈ స్థలం తమ ఆధీనంలో లేదని కార్మిక శాఖ చెబుతోవది. మిషన్‌ బిల్డ్‌ ఏపీ కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకొందని అధికారులు పేర్కొంటున్నారు. మట్టి తవ్వకాల వెనక వైసీపీలో ఒక అగ్రశేణి, మరో ద్వితీయశ్రేణి నాయకుడుంటంతో ఎవరూ అడ్డుకొనేందుకు సాహసించ లేకపోతున్నారన్న విషయం బహిరంగ రహస్యమే. 

మట్టినీ వదలడం లేదు..: నసీర్‌

నగరంలో అందుబాటులో ఉన్న విలువైన భూమిని బిల్డ్‌ ఏపీ అంటూ ప్రభుత్వం అమ్ముకోవడానికి ప్రయత్నిస్తుంటే తానేమి తక్కువ తినలేదన్నట్లు స్థానిక ఎమ్మెల్యే మహ్మద్‌ ముస్తఫా, అధికార పక్షనేతలు మట్టిని దోచుకు తింటూ మాఫియాగా మారారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, తూర్పు ఇనఛార్జ్‌ మహ్మద్‌ నసీర్‌ ఆరోపించారు. కాకుమాను వారి తోటలో అక్రమ మట్టి తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని  మంగళవారం ఆయన పరిశీలించారు. దీనిని  అధికారులను, కలెక్టర్‌, పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ ఎల్లావుల అశోక్‌ యాదవ్‌, నేతలు గోళ్ల ప్రభాకర్‌, గుడిమెట్ల దయారత్నం, ఉప్పు శ్రీను, కోటేశ్వరరావు, ప్రభాకర్‌, బాబురావు, వేములకొండ శ్రీనివాసరావు, జమీర్‌, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.