బీజేపీ, ఎస్పీ తోడు దొంగలు: అఖిలేష్ జిన్నా వ్యాఖ్యలపై మాయావతి

ABN , First Publish Date - 2021-11-01T22:33:26+05:30 IST

అఖిలేష్ ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు. అఖిలేష్ జిన్నాను పొగడగానే బీజేపీ రంగంలోకి దిగి ముస్లింలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తుందని, ఇది ఇరు పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా అని ఆమె విమర్శలు గుప్పించారు. సోమవారం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా సమాజ్‌వాదీ..

బీజేపీ, ఎస్పీ తోడు దొంగలు: అఖిలేష్ జిన్నా వ్యాఖ్యలపై మాయావతి

లఖ్‌నవూ: పాకిస్తాన్ జాతి పిత మహ్మద్ అలీ జిన్నా భారత స్వాతంత్ర్య సమరయోధుడు అంటూ సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం చెలరేగుతోంది. భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతినడం, మరోవైపు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో విపక్ష రాజకీయ పార్టీలు అఖిలేష్‌పై దుమ్మెత్తి పోస్తున్నాయి. పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తిని భారత స్వాతంత్ర్య సమరయోధుడు అనడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే ‘జిన్నా ప్రేమీ అఖిలేష్’ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.


కాగా, అఖిలేష్ ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు. అఖిలేష్ జిన్నాను పొగడగానే బీజేపీ రంగంలోకి దిగి ముస్లింలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తుందని, ఇది ఇరు పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా అని ఆమె విమర్శలు గుప్పించారు. సోమవారం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా సమాజ్‌వాదీ పార్టీపై, భారతీయ జనతా పార్టీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.


‘‘ఎస్పీ బీజేపీ మధ్య చక్కని ఒప్పందం ఉంది. ఈ ఒప్పందంలో భాగంగానే అఖిలేష్ యాదవ్ జిన్నాను స్వాతంత్ర్య సమరయోధుడు అన్నారు. ఇది బీజేపీకి ఉపయోగపడుతుంది. ముస్లింలపై ధ్వేషాన్ని పెంచి హిందువుల ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నాలు బీజేపీ చేస్తుంది. ఎన్నికలు సమీపించే కొద్ది ఇరు పార్టీలు ఇంకా ఎక్కువ డ్రామాలు ఆడతాయి. ఈ రెండు పార్టీలు ఎప్పుడూ మతల మధ్య గొడవలు, కులాల మధ్య గొడవలు సృష్టించి ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తాయి. అందుకే ఎస్పీ అధికారంలో ఉంటే బీజేపీ బలంగా ఉంటుంది. కానీ బీఎస్పీ అధికారంలో ఉంటే ఇలాంటి నాటకాలు సాగవు కాబట్టే బీజేపీ లాంటి మతత్వ పార్టీలు బలహీనంగా ఉంటాయి’’ అని మాయావతి ట్వీట్ చేశారు.

Updated Date - 2021-11-01T22:33:26+05:30 IST