విధేయతకే వైస్‌

ABN , First Publish Date - 2021-07-30T05:10:34+05:30 IST

అడిగిన వారికి లేదనకుండా పదవులు అప్పగించడం ఈ ప్రభుత్వ నైజం. నిన్న మొన్నటి వరకు కార్పొరేషన్‌ పదవుల పంపకం సామాజిక వర్గాల సమతూకం పేరిట ఊదరగొట్టారు.

విధేయతకే వైస్‌

నరసాపురం, కొవ్వూరు, నిడదవోలు, జంగారెడ్డి గూడెం, మున్సిపాల్టీల్లో రెండో వైస్‌ చైర్మన్‌ ఎంపిక

చాన్స్‌ కోసం పలువురు కౌన్సిలర్ల పట్టు.. 
ఒకోచోట ఐదుగురికి పైగానే ఆశావహులు
మంత్రులు, ఎమ్మెల్యేల అనుకూలురుకే చాన్స్‌
చివరి వరకూ సస్పెన్స్‌

(ఏలూరు–ఆంధ్రజ్యోతి):


 అడిగిన వారికి లేదనకుండా పదవులు అప్పగించడం  ఈ ప్రభుత్వ నైజం. నిన్న మొన్నటి వరకు కార్పొరేషన్‌    పదవుల పంపకం సామాజిక వర్గాల సమతూకం పేరిట ఊదరగొట్టారు. ఇప్పడు స్థానిక సంస్థల్లో మరిన్ని పదవులు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపాల్టీల్లో మరికొందరికి ముచ్చటగా రెండో వైస్‌ చైర్మన్‌ పదవి దక్కబోతోంది. దీనికోసం సుదీర్ఘ కసరత్తే జరిగింది. పదవి రానివారు పెదవి విరవనక్కరలేదని త్వరలోనే మరో చాన్స్‌ ఇస్తామంటూ బుజ్జగింపులు మొదలయ్యాయి. 


 ఏలూరు మేయర్‌గా మరోసారి నూర్జహాన్‌

ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌గా మరోసారి నూర్జహాన్‌ నేడు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోను ఆమె ఐదేళ్లపాటు ఎటువంటి ఆటంకాలు లేకుండా మేయర్‌గా కొనసాగారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమె టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఈసారి కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైసీపీ తరపున 50వ డివిజన్‌ కార్పొరేటర్‌గా పోటీ చేసి  భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆమె భర్త ఎస్‌ఎంఆర్‌ పెదబాబు మొత్తం నగర పంచాయతీ ఎన్నికలను భుజాన వేసుకున్నారు. అనేక డివిజన్లలో వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం పెదబాబు ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి. సీఎం జగన్‌ ఆశీస్సులతో నూర్జహాన్‌ ఎన్నికల ముందు నుంచే మేయర్‌ అభ్యర్థిగా ఖరారయ్యారు. చివరకు అదే ప్రక్రియ కొనసాగింది. ఈ మధ్యలో కొన్ని కొన్ని అపోహలు పెద్ద ఎత్తున ప్రచారం సాగినా అవన్నీ వీగిపోయాయి. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సహకారంతో డివిజన్లలో కార్పొరేటర్లుగా ఎన్నికైన వారంతా తమకు ఏదో పదవి అదనంగా వస్తుందని ఆశించారు. శుక్రవారం ఏలూరు మేయర్‌ పదవితో పాటు ఇద్దరు డిప్యూటీ మేయర్లను ఎన్నుకోనున్నారు. మంత్రి ఆళ్ల నానికి మొదటి నుంచి వీర విధేయులుగావున్న మాజీ ఎంపీపీ సుధీర్‌బాబు, మరో సీనియర్‌ నేత గుడిదేశి శ్రీనివాసరావును డిప్యూటీ మేయర్లుగా ఇప్పటికే ఎంపిక చేశారు. వీరి పదవీ కాలం ఏడాదిపాటు ఉంటుంది. ఇంతకుముందు డిప్యూటీ మేయర్‌ పదవి ఒకటే ఉండగా ఏడాదికి ఒకరు చొప్పున ఐదేళ్లకు ఐదుగురిని ఎంపిక చేసి నియమిం చడంలో అప్పటి ఎమ్మెల్యే బడేటి బుజ్జి సరికొత్త వ్యూహాన్ని అమలు చేశారు. దాదాపు అలాంటి వ్యూహ ర చనలోనే ఇప్పుడు వైసీపీ ఉంది. డిప్యూటీ మేయర్‌ పదవులను పలువురు ఆశించినా ఎస్సీ వర్గానికి చెందిన సుధీర్‌బాబును, బీసీ వర్గానికి చెందిన శ్రీనివాసరావును ఎంపిక చేయడం ద్వారా మంత్రి నాని వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అందులోనూ సీనియర్లకే తొలి ఏడాది పట్టం కట్టినట్లైంది. ఈసారి ఏలూరు కార్పొరేషన్‌ మీద ‘లీడర్ల లోడు’ కాస్తంత ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఏలూరు స్మార్ట్‌ సిటీకి బొద్దాని అఖిల, ఏలూరు అర్బన్‌ అఽథారిటీకి ఈశ్వరి నియమితులయ్యారు. వీరిద్దరు  కార్పొరేషన్‌పై తగిన పట్టు కలిగే ఉంటారు. అయితే నాయకులు మధ్య సమన్వయం కోసం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. 

మిగతా మున్సిపాల్టీల్లో..

జిల్లాలోని మరో నాలుగు మున్సిపాల్టీల్లో విధేయులకే అవకాశం ఇచ్చేలా జాగ్రత్త పడుతున్నారు. నరసాపురం మున్సిపాల్టీలో ఇప్పటికే చైర్మన్‌గా వెంకటరమణ ఉండగా వైస్‌ చైర్మన్‌గా కొత్తపల్లి నాని వ్యవహరిస్తున్నారు. రెండో వైస్‌ ఛైర్మన్‌ కోసం నలుగురు పోటీ పడుతున్నారు. వీరిలో కామన నాగిని, దుర్గాభవానీ, శ్యామల, జయరాజు మధ్య పోటీ తీవ్రంగా ఉంది. అయితే నాగినికే పదవి దక్కే అవకాశాలు మెరుగ్గా ఉన్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి ఇద్దరు ఎస్సీ వర్గానికి, మరో ఇద్దరు బీసీ వర్గానికి చెందిన వారు. ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు స్థానిక సమీకరణల నేపథ్యంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. 
 నిడదవోలులో చైర్మన్‌గా భూపతి ఆదినారాయణ వ్యవహరిస్తుండగా, వైస్‌ చైర్మన్‌గా వెంకటలక్ష్మి ఉన్నారు. రెండో వైస్‌ పదవికి కౌన్సిలర్లు వజారుద్దీన్‌ జాన్‌బాబు, బాలరాజు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఈ పదవికి స్థానికంగా వున్న సామాజిక వర్గాన్ని పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేయాలని పార్టీ అధిష్ఠానం ఎమ్మెల్యేను కోరింది. గురువారం సాయంత్రం వరకూ వీరిలో ఎవరికి చాన్స్‌ ఉందనేది ఎమ్మెల్యే శ్రీనివాస్‌నాయుడు అధికారికంగా ప్రకటించలేదు. దీంతో నిడదవోలులో నేతల మధ్య తీవ్ర ఉత్కంఠ అనివార్యమైంది. 
 జంగారెడ్డిగూడెం మున్సిపాల్టీలోనూ ‘వైస్‌’ టెన్షన్‌ కొనసాగింది. ఈ మున్సిపాల్టీలో చైర్మన్‌గా నాగలక్ష్మి, వైస్‌ చైర్మన్‌గా నాగరత్నం వ్యవహరిస్తున్నారు. రెండో వైస్‌ పదవికి ముప్పిడి అంజి, ధనలక్ష్మి పేర్లు వినిపిస్తుండగా వీరిలో ఒకరిని ఎమ్మెల్యే ఎలీజా ఖరారు చేయాల్సి ఉంది. అయితే మరింతలోతుగా పరిశీలించి ఇంకెవరినైనా ఎంపిక చేయబోతున్నారా  అన్న సస్పెన్‌ కొనసాగుతుంది. 
 కొవ్వూరు మున్సిపాల్టీలో వైస్‌ చైర్మన్‌ పదవికి ఆరుగురు పోటీ పడుతున్నారు. చైర్మన్‌గా భావన రత్నకుమారి, వైస్‌ చైర్మన్‌గా మన్నే పద్మ వ్యవహరిస్తున్నారు. రెండో వైస్‌ చైర్మన్‌ పదవికి ఎవరి వైపు మొగ్గు లభిస్తుందా అని మంత్రి తానేటి వనిత నిర్ణయాన్ని బట్టి ఆధారపడింది. ఇక్కడ పార్టీకి విధేయులుగా పనిచేస్తున్న వారికి మంత్రి అవకాశం ఇస్తారని ప్రచారం సాగుతోంది.

 
నేడే ముహూర్తం

కొలువు తీరనున్న ఏలూరు కార్పొరేషన్‌ పాలక మండలి 
నేడే సభ్యుల ప్రమాణ స్వీకారం

ఏలూరు ఫైర్‌స్టేషన్‌, జూలై 29: ఏలూరు నగర పాలక సంస్థ నూతన పాలకమండలి శుక్రవారం కొలువు తీరనుంది. కౌన్సిల్‌ హాలులో జరిగే  ప్రత్యేక సమావేశానికి జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ప్రిసైడింగ్‌ అధికారిగా వ్యవ హరిస్తారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం మేయర్‌, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు. ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌(నాని) హాజరవుతారు. ఏలూరులోని 50 డివిజన్లకు మూడు ఏకగ్రీవం కాగా 47 డివిజన్లకు మార్చి 10న ఎన్నికలు నిర్వహించారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నెల 25న ఓట్ల లెక్కింపు జరిగింది. అధికార వైసీపీ ఏకగ్రీవం మూడింటితో కలిపి 47 డివిజన్లు, టీడీపీ మూడు స్థానాల్లోనూ విజయం సాధించింది. విలీన గ్రామాలైన శనివారపుపేట, సత్రంపాడు, వెంకటాపురం, కొమడవోలు, తంగెళ్ళమూడి, పోణంగి, చొదిమెళ్ళల్లో మొదటిసారిగా ఎన్నికలు నిర్వహించారు. వైసీపీకి చెందిన ఇద్దరు విజేతలు ప్యారీ బేగమ్‌, బేతపూడి ముఖర్జీ కౌటింగ్‌కు ముందే కరోనా కారణంగా మృతి చెందారు. ప్రస్తుతం 48 మంది సభ్యులతో పాలక మండలి కొలువు తీరనుంది. చనిపోయిన ఇద్దరు అభ్యర్థుల డివిజన్లలో త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్నాయి. రెండేళ్ల తర్వాత మొదటిసారిగా కౌన్సిల్‌ సమావేశం జరగనున్నది. ఈ ప్రత్యేక సమావేశానికి ఏర్పాట్లు చేసినట్లు నగర పాలక సంస్థ కమిషనర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు.  

Updated Date - 2021-07-30T05:10:34+05:30 IST