మెదక్ జిల్లా: నర్సాపూర్‌లో నాలుగు ఇళ్లల్లో చోరీ
ABN , First Publish Date - 2021-09-03T16:59:42+05:30 IST
నర్సాపూర్‌లో దొంగలు హల్ చల్ చేశారు. నాలుగు ఇళ్లల్లో చోరీకి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మెదక్ జిల్లా: నర్సాపూర్‌లో దొంగలు హల్ చల్ చేశారు. నాలుగు ఇళ్లల్లో చోరీకి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇళ్లల్లో ఎవరూ లేని విషయం తెలుసుకున్న దొంగలు చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. 14 తులాల బంగారం, 15 తులాల వెండి, రూ. 59వేల నగదు అపహరించారు. అయితే అదే కాలనీకి చెందిన మరో ఇంట్లో చోరీకి ప్రయత్నించారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. చోరీ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అలాగే సిద్దిపేట శ్రీనగర్ కాలనీలో తాళం వేసిన ఇంట్లో చోరీ సంఘటన గురువారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే... సిద్దిపేట పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటు న్న రొడ్డ ధనలక్ష్మి భర్త రొడ్డ నర్సింహులు నెల రోజుల క్రితం మృతి చెందడంతో ఆమె కొడుకు, కూతురుతో కలిసి స్వగ్రామమైన ఓబులాపూర్‌కు వెళ్లారు. గత నెల 27న శ్రీనగర్ కాలనీలోని ఇంటికి వచ్చి భర్తకు చెందిన ఎల్‌ఐసీ బాండ్లు తీసుకుని ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. గురువారం మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లోని బీరువాలో ఉన్న బట్టలు చిందర వందరగా పడి ఉన్నాయి. కాగా బీరువాలో దాచి పెట్టిన 5 తులాల బంగారు ఆభరణాలు, 50 తులాల వెండి ఆభరణాలు, రూ.50 వేల నగదు మాయం అయ్యాయి. దీంతో గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లో తాళం పగులగొట్టి దోచుకెళ్లారని వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్ టీం సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.