హైదర్‌పోర ఎన్‌కౌంటర్‌పై మెహబూబా సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-11-16T21:38:20+05:30 IST

హైదర్‌పోర ఎన్‌కౌంటర్‌‌పై పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ..

హైదర్‌పోర ఎన్‌కౌంటర్‌పై మెహబూబా సంచలన వ్యాఖ్యలు

జమ్మూ: హైదర్‌పోర ఎన్‌కౌంటర్‌‌పై పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మంగళవారంనాడు ఘాటుగా స్పందించారు. అమాయక పౌరులను రక్షణ కవచాలుగా బలగాలు వాడుకుంటున్నాయని ఆరోపించారు. శ్రీనగర్‌లోని హైదర్‌పోర్ ఏరియాలో సోమవారంనాడు బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులతో పాటు, ఒక పౌరుడు మృతి చెందాడు.


''హైదర్‌పోర ఎన్‌కౌంటర్‌లో ఇంటి యజమానికి బలగాలు రక్షణ కవచంగా వాడుకున్నాయి. ఒక డాక్టర్ కూడా మృతి చెందాడు. దీనిని బట్టి చూస్తే బలగాలు మిలిటెంట్లతో పాటు అమాయక పౌరులను కూడా పొట్టనపెట్టుకుంటున్నట్టు కనిపిస్తోంది'' అని అన్నారు. హైదర్‌పోర ఎన్‌కౌంటర్‌లో హతుడైన అల్టాఫ్ అహ్మద్ కుమార్తె మాట్లాడిన ఒక వీడియోను కూడా మెహబూబా షేర్ చేశారు. ఆ వీడియోలో అల్టాప్ కుమార్తె కన్నీరు పెడుతూ ''మా తండ్రి మరణం చూసి వాళ్లు నవ్వుకున్నారు. ఇప్పుడు నా సోదరుడు, తల్లిని ఎలా పోషించుకోవాలి'' అని ప్రశ్నించడం కనిపిస్తోంది.


కాగా, త్రిపురలో ఓ మసీదును ధ్వంసం చేసిన ఘటనపై కూడా మెహబూబా ఓ ట్వీట్‌లో ప్రస్తావించారు. త్రిపుర కావచ్చు, దేశంలో మరో ప్రాంతం కావచ్చు. మతం పేరుతో ప్రజలను విడగొట్టడంలో ప్రస్తుత ప్రభుత్వం చాలా బిజీగా ఉందని ఆమె ఘాటుగా విమర్శించారు. ''అతి పెద్ద సమస్య నిరుద్యోగం. ప్రభుత్వం వద్ద ఎలాంటి పరిష్కారం లేదు. ఏడాదిగా రైతులను పట్టించుకోకుండా వదిలేశారు. వీటికి ప్రభుత్వం వద్ద ఎలాంటి సమాధానాలు లేవు. వాళ్ల ఫ్యాక్టరీలు (వర్గాలు) చేస్తున్న పనల్లా ఒక్కటే. హిందూ, ముస్లింలను ఒకరిపై మరొకరిని ఉసిగొల్పడమే పనిగా పెట్టుకున్నారు'' అని కేంద్రంపై మెహబూబా నిప్పులు చెరిగారు.

Updated Date - 2021-11-16T21:38:20+05:30 IST