కరోనా ఎఫెక్ట్: ఊహించని స్థాయిలో పెరిగిన మైక్రోసాఫ్ట్ క్లౌడ్ వినియోగం

ABN , First Publish Date - 2020-03-30T19:24:16+05:30 IST

ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-19కు చెక్ పెట్టేందుకు పలు దేశాల్లో లాక్‌డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో ..

కరోనా ఎఫెక్ట్: ఊహించని స్థాయిలో పెరిగిన మైక్రోసాఫ్ట్ క్లౌడ్ వినియోగం

న్యూఢిల్లీ: ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-19కు చెక్ పెట్టేందుకు పలు దేశాల్లో లాక్‌డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవల వినియోగం 775 శాతం మేర పెరిగింది. మైక్రోసాఫ్ట్ టీమ్స్‌కు ఇప్పుడు రోజకు 4.4 కోట్ల మంది కొత్త వినియోగదారులు వచ్చిచేరుతున్నారు. వీళ్లంతా ఇప్పుడు 90 కోట్లకు పైగా మీటింగ్స్, కాలింగ్ మినిట్స్ సృష్టించారని మైక్రోసాఫ్ట్ 365కు కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న జారెడ్ స్పటారో వెల్లడించారు. ‘‘విండోస్ వర్చువల్ డెస్క్‌టాప్ వినియోగం ఇప్పుడు మూడు రెట్లు పెరిగింది. కోవిడ్-19 డ్యాష్‌బోర్డులను పౌరులతో షేర్ చేసుకునేందుకు ప్రభుత్వం ఉపయోగించే ‘పవర్‌ బీఐ’ వాడకం కూడా వారం రోజుల్లో 42 శాతం పెరిగింది...’’ అని స్పటారో ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


కాగా డిమాండ్ భారీగా పెరిగినప్పటికీ తమ సేవల్లో ఎలాంటి అంతరాయం ఎదురుకాలేదని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ‘‘గత వారం రోజుల్లో వినియోగం భారీగా పెరడంతో.. కొన్ని ప్రాంతాలు ప్రత్యేకించి ఉత్తర ఐరోపా, పశ్చిమ ఐరోపా, సౌత్ బ్రిటన్, సెంట్రల్ ప్రాన్స్, తూర్పు ఆసియా, దక్షిణ భారతదేశం, సౌత్ బ్రెజిల్ తదితర ప్రాంతాల్లో డిమాండ్ కూడా భారీగా పెరిగింది.  అయినప్పటికీ ఈ ప్రాంతంలో సక్సెస్ రేట్లు 99.99 శాతంగా నమోదయ్యాయి...’’ అని కంపెనీ వెల్లడించింది. కాగా తమ వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించేందుకు తాత్కాలికంగా కొత్త సబ్‌స్క్రిప్షన్లపై కొన్ని ఆంక్షలు విధించినట్టు మైక్రోసాఫ్ట్ తెలిపింది.

Updated Date - 2020-03-30T19:24:16+05:30 IST