ఏంటీ జెట్టీ!

ABN , First Publish Date - 2020-05-31T11:08:41+05:30 IST

మత్స్యకారుల జీవితాలకు భరోసా లేకుండా పోతోంది. ప్రభుత్వాలు కంటితుడుపు చర్యలకే పరిమితమవుతున్నాయి. స్థానికంగా చేపల వేట గిట్టుబాటుకాక కుటుంబాలను వదిలి ఇతర ప్రాంతాలకు మత్స్యకారులు

ఏంటీ జెట్టీ!

స్థానికంగా వేట గిట్టుబాటు కాక..

ఇతర ప్రాంతాలకు వలసపోతున్న మత్స్యకారులు

జెట్టీ నిర్మాణంపై స్పష్టతనివ్వని ప్రభుత్వం

ఆందోళనలో గంగపుత్రులు


మత్స్యకారుల జీవితాలకు భరోసా లేకుండా పోతోంది. ప్రభుత్వాలు కంటితుడుపు చర్యలకే పరిమితమవుతున్నాయి. స్థానికంగా చేపల వేట గిట్టుబాటుకాక కుటుంబాలను వదిలి ఇతర ప్రాంతాలకు మత్స్యకారులు వలసపోతున్నారు. ప్రమాదకర స్థితిలో వేట సాగిస్తూ పొరుగు దేశాలకు చిక్కుతూ జైలు జీవితం గడుపుతున్నారు. ప్రభుత్వాలు చొరవచూపితేనే స్వస్థలాలకు రాగలుగుతున్నారు. లేకుంటే అక్కడే ఏళ్ల తరబడి మగ్గిపోతున్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి స్వస్థలాలకు చేరిన వారికి ఉపాధి లేకుండా పోయింది. వేట నిషేధ సమయంలో భృతి వంటివి తాత్కాలికంగా ఉపశమనమిస్తున్నాయని..శాశ్వత ఉపాధి కల్పించేలా జెట్టీలను నిర్మించాలని కోరుతున్నారు.


(పూసపాటిరేగ)

ఏటా జిల్లా నుంచి వేలాది మంది మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. స్థానికంగా జెట్టీ లేక.. వేట గిట్టుబాటుకాక పోవడంతో గుజరాత్‌, చెన్నై, ముంబాయి వంటి ప్రాంతాలకు వెళ్తున్నారు. వినాయక చవితి తరువాత మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వెళ్తారు. సుమారు ఎనిమిది నెలల పాటు అక్కడే వేట సాగిస్తారు. సరిగ్గా ఏప్రిల్‌లో చేపలవేట నిషేధ సమయానికి తిరుగుముఖం పడతారు. ఈ ఏడాది మార్చిలో లాక్‌డౌన్‌ అమల్లోకి రావడంతో ఇతర ప్రాంతాల్లో జిల్లాకు చెందిన వేలాది మంది మత్స్యకారులు చిక్కుకున్నారు. వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వస్థలాలకు రప్పించాయి. ప్రస్తుతం వేట లేక వారు గ్రామాల్లో ఖాళీగా ఉన్నారు. స్థానికంగా జెట్టీ నిర్మిస్తే ఇక్కడే ఉపాధి పొందుతామని.. కుటుంబాలతో ఇక్కడే గడుపుతామని చెబుతున్నారు.  


ప్రకటనకేనా?

పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో 19 మత్స్యకార గ్రామాలున్నాయి. 4 వేల కుటుంబాలు నివసిస్తున్నాయి. 15 వేల జనాభా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. స్థానికంగా వేట గిట్టుబాటుకాక 1,200 మంది మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ వలసలకు ప్రధాన కారణం స్థానికంగా జెట్టీ లేకపోవడమే. గత ఏడాది మత్యకార భరోసా పథకం ప్రవేశపెట్టిన సమయంలో సముద్ర తీరం ఉన్న ప్రతి జిల్లాలో జెట్టీలు నిర్మిస్తామని అధికారులు ప్రకటించారు. జిల్లాకు సంబంధించి చింతపల్లిని ఎంపిక చేసినట్టు స్పష్టంచేశారు. దీంతో మత్స్యకారుల్లో ఆనందం వెల్లివిరిసింది.  ఏడాది గడుస్తున్నా ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదు. మిగిలిన జిల్లాల్లో ఎక్కడెక్కడ నిర్మిస్తారో స్పష్టత వచ్చినా..మన జిల్లాకు వచ్చేసరికి మాత్రం వెల్లడికాకపోవడంతో మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కేంద్ర బృందం తీర ప్రాంతాన్ని పరిశీలించి వెళ్లడంతో ఆశ పెట్టుకున్నారు. ప్రభుత్వ జెట్టీ నిర్మాణంపై దృష్టిపెట్టాలని మత్స్యకారులు కోరుతున్నారు. 


 జెట్టీలతో ఉపాధి: బర్రి చిన్నప్పన్న, జిల్లా మత్యకార సొసైటీ అధ్యక్షులు

జెట్టీ నిర్మాణంతోనే వలసల నియంత్రణ సాధ్యం. మత్స్యకారులకు స్థానికంగా పని దొరుకుతుంది. ఉపాధి మెరుగుపడుతుంది. మిగతా జిల్లాల మాదిరిగా తీరంలో స్థలాన్ని ఎంపిక చేసి జెట్టీ నిర్మాణాన్ని ప్రారంభించాలి. మత్స్యకారులను ఆదుకునేలా..శాశ్వత ఉపాధి కలిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.



స్థానికంగా ఉపాధి; వాసుపల్లి నర్శింగరావు, మత్యకారుడు, తిప్పలవలస

జెట్టీ లేనందునే కుటుంబాలను వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నాం. నెలల తరబడి ప్రమాదకర స్థితిలో వేట సాగిస్తున్నాం. జెట్టీ నిర్మాణం చేపడితే స్థానికంగానే వేట సాగించి కుటుంబంతో కలో గంజో తాగి బతుకుతాం. ప్రభుత్వం జెట్టీ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసి మత్స్యకారుల జీవితాలకు భరోసా కల్పించాలి. 



ప్రతిపాదనలు పంపించాం:  కిరణ్‌, మత్యశాఖ అభివృద్ధి అధికారి

జిల్లాలో జెట్టీ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాం. నిపుణులు వచ్చి ప్రాంతాన్ని నిర్ణయించాల్సి ఉంటుంది. ఏటా మత్స్యకార జనాభాలో 25 శాతం మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్టు గుర్తించాం. జెట్టీల నిర్మాణంతో వలసలు తగ్గుముఖం పడతాయి.

Updated Date - 2020-05-31T11:08:41+05:30 IST