హుజూరాబాద్‌కు గని కార్మిక దండు

ABN , First Publish Date - 2021-10-12T06:03:22+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారానికి సింగరేణి నుంచి గని కార్మిక దండు బయలు దేరుతున్నది.

హుజూరాబాద్‌కు గని కార్మిక దండు

- టీఆర్‌ఎస్‌ ప్రచారానికి టీబీజీకేఎస్‌ శ్రేణులు 

 - ఏబీసీ గ్రూపులుగా ప్రచారానికి 600మంది

- 20 రోజులు రామగుండంలో వెంకట్రావ్‌ మకాం 

- 8వేల ఓట్లను ప్రభావితం చేసేందుకు వ్యూహం

గోదావరిఖని, అక్టోబరు 11: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారానికి సింగరేణి నుంచి గని కార్మిక దండు బయలు దేరుతున్నది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించేందుకు అన్ని శక్తులను ఒడ్డుతున్న టీఆర్‌ఎస్‌ సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్‌ నాయకత్వానికి కూడా హుజూరాబాద్‌ ప్రచార బాధ్యతలు అప్పగించింది. సింగరేణి రామగుండం రీజియన్‌లోని ఆర్‌జీ-1, 2, 3, ప్రాంతాల్లోని గని కార్మికులు అధిక శాతం హుజూరాబాద్‌, పెద్దపల్లి నియోజకవర్గాల గ్రామాలకు చెందిన వారే ఉంటారు. హుజూరాబాద్‌, జమ్మికుంట, వీణవంక, ఉప్పల్‌, కమలాపూర్‌ తదితర మండలాల గ్రామాలకు చెందిన వందలాది మంది కార్మికులు రామగుండం రీజియన్‌లోని గోదావరిఖని, యైుటింక్లయిన్‌కాలనీ, సెంటినరీకాలనీ ప్రాంతాల్లో ఉద్యో గాలు చేస్తూ నివాసముంటున్నారు. ఉద్యోగరీత్యా వీరంతా ఇక్కడ ఉన్నప్పటికీ ఈ కార్మికుల కుటుంబ మూలాలు, ఆస్థిత్వం ఇంకా గ్రామాల్లో సంజీవంగా మిగిలే ఉంది. ఇండ్లు, పొలాలు సొంత గ్రామాల్లో కలిగి ఉన్న కార్మికులు వారాంతంలో, పండుగ పబ్బాల సందర్భంలో సొంత ఊర్లకు వెళ్లివస్తారు. దీంతో అక్కడ సింగరేణి కార్మికులకు గ్రామ పెద్దలతో వీధుల్లో ఉండే జనంతో సజీవ సంబంధాలున్నాయి. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ప్రచారం కోసం టీబీజీకేఎస్‌ ప్రధాన బాధ్యతనే తీసుకున్నది. గత వారం రోజులుగా టీబీజీకేఎస్‌ అధ్యక్షులు వెంకట్రావ్‌ రామగుండంలో మకాం పెట్టి హుజూరాబాద్‌ నియోజకవర్గానికి సంబంధించిన మూలాలు ఉన్న కార్మికుల్ని రామగుండం రీజియన్‌లోని మూడు ఏరియాల నుంచి గుర్తించారు. వారందరితో సమావేశాలు ఏర్పాటు చేశారు. 600 మందికిపైగా కార్మికులు హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన వారు రామగుండం రీజియన్‌లో ఉన్నారు. ఒకేసారి వీరందరికీ 15రోజుల పాటు సెలవులు దొరకడం కష్టం కావడంతో 200మంది కార్మికులకు ఒక టీము చొప్పున ఏబీసీగా విభజించి మూడు గ్రూపులను తయారు చేశారు. ప్రతి వారం ఒక గ్రూపు అంటే 200మంది కార్మికులు హుజూరాబాద్‌లో ప్రచారానికి వెళ్లనున్నారు. ఈ గ్రూపులకు టీబీజీకేఎస్‌ నాయకులు బాధ్యులుగా వ్యవహరిస్తున్నారు. హుజురాబాద్‌ ఎన్నికల్లో 5వేల నుంచి 8వేల ఓట్లను టీఆర్‌ఎస్‌ పార్టీకి వేయించేందుకు వ్యూవహరచన చేస్తున్నారు. ప్రణాళికబద్ధంగా జరుగున్న ఈ కార్యక్రమం హుజురాబాద్‌ ప్రచారంపై, ఎన్నికల ఫలితాలపై కూడా ప్రభావితం చూపే విధంగా  టీబీజీకేఎస్‌ నాయకత్వం ప్రయత్నిస్తుం ది. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ అయ్యేంత వరకు అధ్యక్షులు వెంకట్రావ్‌ రామగుండంలోనే మకాం పెట్టి పర్యవేక్షించనున్నారు. వెంకట్రావ్‌తో పాటు కార్యదర్శి రాజిరెడ్డి, సీనియర్‌ నాయకుడు కే మల్లయ్య తదితరులు కార్మికులను హుజూ రాబాద్‌కు తరలించి ఎన్నికల ప్రచారంలో దించేందుకు యత్నిస్తున్నారు. అవసరమైతే పోలింగ్‌ వరకు రామగుండం రీజియన్‌లోని 600 నుంచి 700మంది కార్మికులను వారి సొంత ఊర్లలో ఉండే విధంగా వ్యూహ రచన చేస్తున్నారు. సింగరేణిలో శ్రీరాంపూర్‌, మందమర్రి, బెల్లంపల్లి ప్రాంతాలు, భూపాలపల్లిలో కూడా ఆ గ్రామాలకు చెందిన కార్మికులు ఎవరున్నారనేది టీబీజీకేఎస్‌ ఆరా తీస్తున్నది.  ఈ నెల 17 నుంచి సింగరేణి కార్మికదండు హుజూరాబాద్‌ ప్రచార రంగంలో దిగనున్నది. 

Updated Date - 2021-10-12T06:03:22+05:30 IST