వేములదీవిలో ఆక్వా వర్సిటీ: మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు

ABN , First Publish Date - 2020-09-20T16:57:18+05:30 IST

నరసాపురం మండలం వేములదీవి గ్రామంలోనే ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని..

వేములదీవిలో ఆక్వా వర్సిటీ: మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు

నరసాపురం(పశ్చిమ గోదావరి): నరసాపురం మండలం వేములదీవి గ్రామంలోనే ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సిదిరి అప్పలరాజు చెప్పారు. యూనివర్సిటీల నిర్మాణానికి సేకరించిన స్థలాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఆనంతరం విలేకర్లతో మాట్లాడుతూ స్థల ప్రక్రియ పూర్తయినందున నాలుగు నెలల్లో యూనివర్సిటీ భవనాల నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. సుమారు 600 ఏకరాల్లో యూనివర్సిటీ, నాల్డెజ్‌ పార్కు, కోల్డ్‌ స్టోరేజ్‌, ప్లాంటు నిర్మిస్తామన్నారు.


ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్క నెల్లూరు జిల్లాలోని ఉతుకలూరులో మాత్రమే ఆక్వా కాలేజీ ఉందన్నారు. ఏటా 40 మంది మాత్రమే ఈ కళాశాల నుంచి డిగ్రీ పొందున్నట్లు మంత్రి చెప్పారు. 2030నాటికి మత్స్య ఉత్పత్తులను పరిగణనలోకి తీసుకుని శాస్త్రవేత్తలు, నిపుణులు, గ్రాడ్యుయేట్లను తయారు చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. రైతులకు నాణ్యమైన సీడ్‌ను అందించడంతో పాటు విదేశాల నుంచి దిగుమతి అయ్యే బ్రోససి వంటి మత్స్య ఉత్పత్తుల్ని కూడా స్థానికంగా పరిశోదనలు చేసి పండించుకునే అవకాశం కలుగుతుందన్నారు. ఈ యూనివర్సిటీని పూర్తిగా ప్రభుత్వమే ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు.


Updated Date - 2020-09-20T16:57:18+05:30 IST