నా తమ్ముడైనా, బంధువైనా వదలొద్దు

ABN , First Publish Date - 2020-06-30T11:18:12+05:30 IST

ఎర్రచందనం స్మగ్లర్లపై నిఘా పటిష్టం..

నా తమ్ముడైనా, బంధువైనా వదలొద్దు

ఎర్రచందనం స్లగ్మర్లపై నిఘా పెంచండి

టాస్క్‌ఫోర్స్‌ భేటీలో మంత్రి పెద్దిరెడ్డి

పాల్గొన్న డిప్యూటీ సీఎం, ప్రజాప్రతినిధులు


తిరుపతి(ఆంధ్రజ్యోతి): ఎర్రచందనం స్మగ్లర్లపై నిఘా పటిష్టం చేయాలని, పీడీ యాక్టులు కూలీలపై కాకుండా అందుకు మూలమైన యజమానులపై పెట్టినప్పుడే 90 శాతం స్మగ్లింగ్‌ ఆపగలమని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై సోమవారం తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో వీరు సమీక్షించారు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ విషయంలో ప్రజాప్రతినిధులకు సంబంధించి ఎంతటివారైనా వదిలిపెట్టవద్దని నారాయణస్వామి పేర్కొన్నారు. తన సొంత తమ్ముడైనా, బంధువైనా స్మగ్లింగ్‌కు పాల్పడితే వదిలిపెట్టవద్దని మంత్రి పెద్దిరెడ్డి ఆదేశించారు. టాస్క్‌ఫోర్స్‌లో చిన్నపొరబాటు జరిగినా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు.


ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ 2015లో ఏర్పాటైనా అక్రమ రవాణాను అరికట్టలేకపోతున్నామన్నారు. గతంలో ఏడాదికి వందకు పైగా కేసులు నమోదవుతుంటే ఇప్పుడు 20 కేసులు కూడా దాటడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకే మండలంలో 10 వేల ఎకరాలు ఆక్రమణకు గురై  30 ఏళ్లయినా అటవీశాఖ అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ యండవల్లి, ఎమ్మెల్యేలు వెంకటేగౌడ, ఆదిమూలం, బియ్యపు మధుసూదన్‌ రెడ్డి, ఎస్పీలు సెంథిల్‌కుమార్‌, రమేష్‌రెడ్డి, టాస్క్‌ఫోర్స్‌ అధికారి రవిశంకర్‌, సీసీఎఫ్‌ శరవణన్‌, డీఎఫ్‌వో నాగార్జున రెడ్డి పాల్గొన్నారు.  

Updated Date - 2020-06-30T11:18:12+05:30 IST