Abn logo
Aug 21 2021 @ 16:21PM

సచివాలయ వ్యవస్థ.. దేశానికే తలమానికం: తెల్లం బాలరాజు

పశ్చిమగోదావరి: సీఎం జగన్‌మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ.. దేశానికే తలమానికమని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. పోలవరం నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న పనులపై బుట్టాయిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో శనివారం సచివాలయ, పంచాయతీరాజ్, టైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ అధికారులు తదితరులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని సచివాలయ, వలంటీర్ల వ్యవస్థను.. పలు రాష్ట్రాల సీఎంలు ఆదర్శంగా తీసుకుంటున్నారని తెలిపారు. వారి రాష్ట్రాల్లోనూ ఇదే విధంగా అమలు చేయాలని చూస్తున్నారని గుర్తుచేశారు. 


పోలవరం నియోజకవర్గ పరిధిలో సచివాలయ, రైతు భరోసా కేంద్ర భవనాలు, హెల్త్ క్లినిక్‌ తదితరాలకు సంబంధించిన పనులను త్వరగా పూర్తి చేసి.. అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ఏజెన్సీలకు సంబంధించిన పెండింగ్ బిల్లులపై మంత్రితో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేకున్నా.. పనులు సాగిస్తున్న ఏజెన్సీలు, అధికారుల సేవలు మరువలేనివన్నారు. సమిష్టి కృషితోనే పోలవరం నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని చెప్పారు. తాను ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని, ఎక్కడ ఏ సమస్య ఉన్నా.. తన దృష్టికి తేవాలని ఆయన సూచించారు. అనంతరం ఎమ్మెల్యే దృష్టికి ఏజెన్సీలు తెచ్చిన పలు సమస్యలను.. ఉన్నతాధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు.