సురేష్‌బాబుకు ఎమ్మెల్సీ!

ABN , First Publish Date - 2020-08-12T10:16:30+05:30 IST

మాజీ మంత్రి...దివంగత నేత పెనుమత్స సాంబశివరాజు తనయుడు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డాక్టర్‌ పీవీవీ ..

సురేష్‌బాబుకు ఎమ్మెల్సీ!

పెనుమత్స సేవలకు గుర్తింపు

ఇన్నాళ్లకు స్పందించిన వైసీపీ నేత జగన్‌


(విజయనగరం-ఆంధ్రజ్యోతి)/నెల్లిమర్ల: మాజీ మంత్రి...దివంగత నేత పెనుమత్స సాంబశివరాజు తనయుడు, వైసీపీ   రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డాక్టర్‌ పీవీవీ సూర్యనారాయణరాజు (సురేష్‌బాబు)కు పదవీ యోగం కలగనుంది. ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వనున్నట్టు వైసీపీ అధిష్ఠానం ప్రకటించింది. మంగళవారం పార్టీ కార్యాలయం నుంచి ఈమేరకు సురేష్‌బాబుకు సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి, పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా ఆయన పేరును ప్రకటించారు. సురేష్‌బాబు తండ్రి పెనుమత్స సాంబశివరాజు(87) సోమవారం కన్నుమూశారు. వైసీపీ ఆవిర్భవించిన తరువాత జిల్లాలో ఆ పార్టీకి అండగా నిలిచిన ఒకే ఒక్క నేత సాంబశివరాజే. జిల్లాలో తొలిసారి పార్టీ జెండా ఎగురవేసిందీ ఆయనే. చివరి వరకూ ఆ పార్టీలోనే కొనసాగారు. గత ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన ప్రయత్నించారు. తనకు గానీ, తన కుమారుడు సురేష్‌బాబుకు గానీ నెల్లిమర్ల టిక్కెట్‌ కేటాయించాలని కోరారు. కానీ ఆయన కోరిక తీరలేదు. ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని అప్పట్లో పార్టీ అధినేత జగన్‌ ఆయనకు హామీ ఇచ్చారు. పెనుమత్సకు ఆ అవకాశం వస్తుందని అంతా భావించారు. ఇటీవల గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ స్థానాలను వైసీపీ భర్తీ చేసింది. కానీ సాంబశివరాజుకు పదవి దక్కలేదు.


ఇంతలో ఆయన అనారోగ్యం పాలవడం...సోమవారం మృతిచెందడంతో ఆ కుటుంబానికి న్యాయం చేయాలని పార్టీ భావించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సాంబశివరాజు కుమారుడు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సురేష్‌బాబుకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించాలని ముఖ్యమంత్రి భావించినట్లు పార్టీ కార్యాలయం ప్రకటించింది. దీంతో ఈ కుటుంబం రాజకీయంగా ఎదిగేందుకు అవకాశాలు మళ్లీ చిగురించనున్నాయి. విద్యా వంతుడు, రాజకీయ అనుభవం ఉన్న సురేష్‌బాబు పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేసే అవకాశం ఉంది. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన మోపిదేవి స్థానాన్ని సురేష్‌బాబుకు ఇవ్వనున్నారు. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు సమాచారం. 


 రాజకీయ అనుభవం

సురేష్‌బాబు స్వతహాగా దంతవైద్యుడు. మరోవైపు తండ్రి సాంబశివరాజుకు చేదోడు వాదోడుగా ఉంటూ రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. మొయిద మండల ప్రాదేశికం నుంచి ఒకసారి ఎంపీటీసీ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెల్లిమర్ల మండల ఉపాధ్యక్షునిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా నెల్లిమర్ల నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో పతివాడ చేతిలో ఓటమి పాలయ్యారు. 2019లో ఎస్‌.కోట నియోజకవర్గ ఎన్నికల ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. అక్కడి అభ్యర్ధి కడుబండి శ్రీనివాసరావు గెలుపునకు కృషి చేశారు. మరోవైపు పెనుమత్స వారసుడిగా ప్రత్యేక గుర్తింపు ఉంది. తండ్రి వారసత్వం, పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉండటం వంటి అంశాల నేపథ్యంలో పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.  

Updated Date - 2020-08-12T10:16:30+05:30 IST