Abn logo
Jul 21 2021 @ 01:36AM

మోదీ, అమిత్‌ షా దేశద్రోహానికి పాల్పడ్డారు

  • అధికారాన్ని నిలబెట్టుకోవడానికి దిగజారారు
  • అమిత్‌ షా రాజీనామా చేయాలి: రేవంత్‌
  • ప్రతిపక్ష నేతలు, పక్క రాష్ట్ర సీఎం ఫోన్లను
  • కేసీఆర్‌ 2015లోనే ట్యాప్‌ చేశారని ధ్వజం
  • టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆగ్రహం


న్యూఢిల్లీ, జూలై 20 (ఆంధ్రజ్యోతి): పెగాసస్‌ స్పైవేర్‌తో హ్యాకింగ్‌ ద్వారా అధికారాన్ని నిలబెట్టుకోడానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పూర్తిగా దిగజారి, దేశద్రోహానికి పాల్పడ్డారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ఇది దుర్మార్గమైన చర్య అని ధ్వజమెత్తారు. దేశ ద్రోహానికి పాల్పడిన మంత్రులను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ.. గురువారం ‘చలో రాజ్‌భవన్‌’ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఏఐసీసీ పిలుపునిచ్చిందని వెల్లడించారు. పెగాసస్‌ నిఘాపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు చేయించడమే కాక.. సుప్రీం కోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. దేశద్రోహానికి పాల్పడితే ఏ సెక్షన్‌ కింద కేసులు నమోదు చేస్తారో.. ఆ కేసులు నమోదు చేయాలన్నారు. రాష్ట్రంలో హ్యాకింగ్‌కు పాల్పడుతున్న సీఎం కేసీఆర్‌తో పాటు కేంద్రంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విచారణ జరిగే వరకూ అమిత్‌ షా రాజీనామా చేయాలని కోరారు. పార్టీ నేతలు అంజన్‌ కుమార్‌ యాదవ్‌, జే కుసుం కుమార్‌, మదన్‌మోహన్‌ రావు, పున్నా కైలాశ్‌ తదితరులతో కలిసి మంగళవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. దేశంలో పెగాసస్‌  బాధితులు 125 మంది ఉన్నట్లు గతంలో కేంద్ర ఐటీ శాఖ మాజీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ చెప్పారని.. ప్రస్తుత ఐటీ మంత్రి మాత్రం అలాంటి సాఫ్ట్‌వేర్‌ ఎక్కడుందని అడుగుతున్నారని రేవంత్‌ మండిపడ్డారు. ప్రభుత్వం దొంగ వైఖరినే కాకుండా ద్వంద్వ వైఖరిని అవలంభిస్తోందని విమర్శించారు.


కేసీఆర్‌ 2015లోనే ట్యాపింగ్‌కు పాల్పడ్డారు

ప్రతిపక్ష నేతలు, పక్క రాష్ట్రం సీఎం ఫోన్లను ట్యాప్‌ చేసి.. తెలంగాణలో 2015లోనే సీఎం కేసీఆర్‌ దొరికిపోయారని రేవంత్‌ ధ్వజమెత్తారు. నిఘా విభాగం ఐజీ ప్రభాకర్‌ రావు నేతృత్వంలో ఇజ్రాయెల్‌ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసి, దాదాపు 50 మంది హ్యాకర్స్‌ను నియమించినట్లు ఈ నెల 16నే తాను వెల్లడించానని గుర్తు చేశారు. రాష్ట్రంలోని మీడియా సంస్థలు, న్యాయమూర్తుల, ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లను కేసీఆర్‌ సర్కారు హ్యాక్‌ చేసిందని ఆరోపించారు. జాతీయ స్థాయిలో 18వ తేదీన హ్యాకింగ్‌ చర్చకు వచ్చిందని, కానీ తెలంగాణలో జరుగుతున్నదాన్ని ఈ నెల 16నే తాను బయటపెట్టానని గుర్తుచేశారు. ప్రభాకర్‌ రావుపై కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేయబోతున్నామని తెలిపారు. పోలీసు శాఖ ఆఽధునికీకరణ కోసం కేంద్రం ఇచ్చిన నిధులను.. హ్యాకింగ్‌ పరికరాల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం వినియోగించిందని, త్వరలో దానిని బయటపెడుతామన్నారు. కేంద్రం కూడా ఇలాంటి తప్పిదాలకు పాల్పడుతున్నది కాబట్టే తెలంగాణ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవట్లేదన్నారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం టెలిఫోన్లు ట్యాప్‌ చేస్తోందని 6-7 నెలల క్రితం హోం శాఖ సహాయ మంత్రిగా కిషన్‌ రెడ్డి తెలిపారు. అవి నిజమైతే ఏం చర్యలు తీసుకున్నారు? నిజం కాకపోతే కేబినెట్‌ హోదాకు ఎలా పదోన్నతి కల్పించారు’’ అని రేవంత్‌ కేంద్రాన్ని నిలదీశారు. కేసీఆర్‌పై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నారా లేదా కిషన్‌ రెడ్డి చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తానన్నారు. కోకాపేట భూముల విక్రయాల్లో అక్రమాలపై సంబంధిత మంత్రులు, సీబీఐ, హోం మంత్రికి ఫిర్యాదు చేస్తామని రేవంత్‌ హెచ్చరించారు.