‘అఫ్ఘాన్‌’పై అఖిలపక్ష భేటీ

ABN , First Publish Date - 2021-08-24T06:55:58+05:30 IST

అఫ్ఘానిస్థాన్‌లో నెలకొన్న సంక్షోభ పరిస్థితిపై చర్చించేందుకు అన్ని పార్టీల ఫ్లోర్‌ లీడర్లతో ఈ నెల 26న సమావేశం కావాలని ప్రధాని మోదీ నిర్ణయించినట్లు విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ట్విటర్‌ ద్వారా...

‘అఫ్ఘాన్‌’పై అఖిలపక్ష భేటీ

  • 26న ఫ్లోర్‌ లీడర్లతో ప్రధాని సమావేశం
  • తాజా పరిణామాలపై చర్చ: జైశంకర్‌ వెల్లడి

న్యూఢిల్లీ, ఆగస్టు 23: అఫ్ఘానిస్థాన్‌లో నెలకొన్న సంక్షోభ పరిస్థితిపై చర్చించేందుకు అన్ని పార్టీల ఫ్లోర్‌ లీడర్లతో ఈ నెల 26న సమావేశం కావాలని ప్రధాని మోదీ నిర్ణయించినట్లు విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు. ఈ మేరకు వివిధ పార్టీల ఫ్లోర్‌ లీడర్లకు సమాచారం అందజేయాలని ప్రధాని ఆదేశించారన్నారు. విపక్ష నేతలకు అఫ్ఘాన్‌ పరిణామాలను వివరిస్తారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. విపక్ష నేతలందరికీ ఈ-మెయిల్‌ ద్వారా ఆహ్వానాలు పంపిస్తామని చెప్పారు. అఫ్ఘాన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు పైనా చర్చిస్తారని సమాచారం. అఖిలపక్ష భేటీకి తమను కూడా ఆహ్వానిస్తారని భావిస్తున్నట్లు మజ్లిస్‌ నేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ట్విటర్‌లో పేర్కొన్నారు. ప్రధాని మోదీ జర్మనీ చాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌తో సోమవారం ఫోన్‌లో మాట్లాడారు. అఫ్ఘాన్‌లో భద్రతా పరిస్థితులు, ప్రపంచంపై వాటి ప్రభావంపై చర్చించారు. అఫ్ఘాన్‌లో చిక్కుకున్న ప్రజలను వారి స్వస్థలాలకు తరలించడానికి అత్యధిక ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించారు. అలాగే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపైనా చర్చించినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. కాగా, యుద్ధ వాతావరణం నెలకొన్న అఫ్ఘాన్‌లో చిక్కుకున్న 730 మంది అఫ్ఘాన్‌ సిక్కులు, హిందువులను  కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే భారత్‌కు తరలించింది. సోమవారం కూడా 146 మందిని విమానాల్లో భారత్‌కు తీసుకొచ్చారు. 


Updated Date - 2021-08-24T06:55:58+05:30 IST