ఉగ్రవాదుల హతంతో కుట్ర భగ్నం

ABN , First Publish Date - 2020-11-21T06:57:13+05:30 IST

కొద్ది రోజుల కిందట జమ్మూ కశ్మీర్లోకి చొరబడ్డ జైషే మొహమ్మద్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులను హతమార్చడం ద్వారా ఓ పెద్ద కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ

ఉగ్రవాదుల హతంతో కుట్ర భగ్నం

దేశంలో తీవ్ర విధ్వంసానికి యత్నం.. కశ్మీర్‌ స్థానిక ఎన్నికల్ని దెబ్బతీసే పన్నాగం

భద్రతా దళాలను అభినందించిన మోదీ


న్యూఢిల్లీ, నవంబరు 20: కొద్ది రోజుల కిందట జమ్మూ కశ్మీర్లోకి చొరబడ్డ జైషే మొహమ్మద్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులను హతమార్చడం ద్వారా ఓ పెద్ద కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కశ్మీర్లో పరిస్థితిపై శుక్రవారంనాడు ఆయన ఓ ఉన్నతస్థాయి భద్రతాసమీక్ష నిర్వహించారు. హోం మంత్రి అమిత్‌ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌, విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్‌ శింగ్లా, హోం, ఆర్మీ, ఇంటెలిజెన్స్‌ విభాగాల ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు.  ముంబై దాడుల వార్షిక దినం- 26-11 సందర్భంగా పెద్ద ఎత్తున దాడులకు కుట్ర జరిగిందని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. ’’పాక్‌-స్థావరంగా పనిచేస్తున్న జైష్‌ టెర్రరిస్టులను కడతేర్చడం, వారి వద్ద నుంచి అత్యాధునిక ఆయుఽధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనపరుచుకోవడం... మొదలైన వాటితో ఓ పెను విధ్వంసం నివారించినట్లయింది. దేశంలో భారీ విధ్వంసానికి కుట్ర జరిగింది. మన దళాల అప్రమత్తత వల్ల త్వరలో జరిగే ప్రజాస్వామిక ప్రక్రియ (స్థానిక ఎన్నికలు)ను దెబ్బతీయాలన్న పన్నాగమూ నిర్వీర్యమయింది’’ అని సమావేశానంతరం చేసిన ట్వీట్లలో ప్రధాని పేర్కొన్నారు.


జమ్మూ శ్రీనగర్‌ హైవే మీద నగ్రోటా వద్ద టోల్‌ ప్లాజా సమీపంలో గురువారం తెల్లవారుఝామున ఓ ట్రక్కులో ప్రయాణిస్తున్న ఉగ్రవాదులను గస్తీ దళాలు నిలువరించినపుడు వారు కాల్పులకు దిగారు.  దాదాపు 2గంటలపాటు సాగిన హోరాహోరీ ఎన్‌కౌంటర్‌లో నలుగురు తీవ్రవాదులు చనిపోగా ఇద్దరు పోలీసులకు బులెట్‌ గాయాలయ్యాయి. చావుకి తేదీ అనేది ఉండదు అని ఆ ట్రక్కుపై రాసి ఉండడం విశేషం. పాక్‌లోని పంజాబ్‌లో నరోవాల్‌ జిల్లా కిందకు వచ్చే షకర్‌గఢ్‌ ఏరియాలో విధులు నిర్వర్తిస్తున్న పాక్‌ రేంజర్లు ఈ నలుగురు ఉగ్రవాదులు దేశంలో చొరబడడానికి వెసులుబాటు కల్పించినట్లు తేలింది. కశ్మీర్‌ అంతటా అప్రమత్తత ప్రకటించారు. వైష్ణోదేవీ ఆలయానికి భద్రత కట్టుదిట్టం చేశారు. ఈనెల 25 నుంచి డిసెంబరు 19 దాకా 8దశల్లో- జమ్మూ కశ్మీర్లో జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికలు జరగనున్నాయి.


కరోనా టీకా వ్యూహంపై మోదీ సమీక్ష

కరోనా టీకా అభివృద్ధి పురోగతి, నియంత్రణ సంస్థల అనుమతులు, ప్రజలకు చేరవేయడం ఎలాగన్నదానిపై శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. నీతి ఆయోగ సభ్యులు సహా పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Updated Date - 2020-11-21T06:57:13+05:30 IST