బెంగాల్‌లో హింసపై మోదీ ఆందోళన

ABN , First Publish Date - 2021-05-05T08:04:43+05:30 IST

బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు...

బెంగాల్‌లో హింసపై మోదీ ఆందోళన

  • గవర్నర్‌కు ప్రధాని ఫోన్‌.. శాంతిభద్రతలపై ఆరా

న్యూఢిల్లీ/కోల్‌కతా, మే 4: బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్కర్‌కు ఆయన ఫోన్‌ చేసి శాంతిభద్రతలపై మాట్లాడారు. ఈ మేరకు గవర్నర్‌ ట్వీట్‌ చేశారు. కాగా హింసపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ బీజేపీ నేత గౌరవ్‌ భాటియా మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ‘‘బెంగాల్‌ వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. వారిని టీఎంసీ గూండాలు హత్య చేస్తున్నారు. మహిళలపై అత్యాచారాలు జరిగాయి. దుకాణాలను లూటీ చేస్తున్నారు’’ అని గౌరవ్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. టీఎంసీ వల్లే బెంగాల్‌ అట్టుడుకుతోందని ఆ పార్టీ జాతీయ ప్రతినిధి సంబిత్‌ పాత్ర అన్నారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. దేశ ఎన్నికల చరిత్రలోనే అటువంటి హింసాత్మక ఘటనలు ఎప్పుడూ చోటుచేసుకోలేదని పేర్కొన్నారు. ‘‘మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలను ఎందుకు అడ్డుకోవడం లేదు?’’ అని సంబిత్‌ ప్రశ్నించారు. మమత ప్రభుత్వం ఫాసిస్టు ప్రభుత్వం అని ఆ పార్టీ మరో నేత ఇదే సమావేశంలో విమర్శించారు. టీఎంసీ గూండాల చేతిలో దాడులకు గురవుతున్న తమ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు దిలిప్‌ ఘోష్‌ అన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి తమ పార్టీ కార్యకర్తలపై టీఎంసీ గూండాలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. దేశ విభజన పరిస్థితుల్లో నెలకొన్న పరిస్థితులే ఇపుడు బెంగాల్‌లో నెలకొన్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. హింసలో చనిపోయిన బీజేపీ కార్యకర్తల కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. కాగా నందిగ్రామ్‌లో మహిళలపై జరిగిన హింస ను జాతీయ మహిళా కమిషన్‌ సుమోటోగా తీసుకుంది.  దర్యాప్తు జరపాలని డీజీపీని ఆదేశించింది. 



బీజేపీకి ఆక్సిజన్‌ అవసరం: మమత

బీజేపీని ఓడించవచ్చని బెంగాల్‌ ప్రజలు రుజువు చేశారని, ఆ పార్టీకి ఇప్పుడు రాజకీయ ఆక్సిజన్‌ అవసరమని పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. మంగళవారం ఓ టీవీ చానెల్‌తో ఆమె మాట్లాడారు. ‘‘బీజేపీని ఓడించవ్చని బెంగాల్‌ ప్రజలు నిరూపించారు. ప్రజాస్వామ్యంలో మీరు (బీజేపీ) అహంకారాన్ని చూపకూడదు’’ అని అన్నారు.


Updated Date - 2021-05-05T08:04:43+05:30 IST