Abn logo
Jul 22 2021 @ 01:30AM

మోదీజీ.. ఈ మరణాల సంగతేంటి?

  • తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక
  • మే 11న 23 మంది కరోనా పేషెంట్ల మృతి
  • ఢిల్లీ బాత్రా ఆస్పత్రిలో మే 1న 12 మంది బలి
  • గోవాలో మే 11-15 మధ్య 83 మంది మృతి
  • సాకులతో తప్పించుకోవడం భావ్యమా?
  • కేంద్ర ప్రభుత్వం ప్రకటనపై ప్రజల ఆగ్రహం
  • రాష్ట్రాలే సమాచారం ఇవ్వలేదు: బీజేపీ


‘‘పార్లమెంటులో ప్రభుత్వ ప్రకటన విని మేం చాలా బాధపడ్డాం. ఆక్సిజన్‌ కొరత వల్లే మా నాన్న చనిపోయారని డాక్టర్లు చెప్పారు. మేం మా తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయాం. కానీ, రాజకీయాలు సాగుతూనే ఉన్నాయి’’

- గౌరవ్‌ గెరా, భారతి (ఈ ఏడాది ఏప్రిల్‌లో ఢిల్లీలోని జైపూర్‌ గోల్డెన్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక 25 మంది చనిపోయిన ఘటనలో తమ తండ్రిని కోల్పోయినవారు)


కేంద్రం ప్రకటనపై ప్రజల ఆగ్రహం

తప్పు ఎవరిదనే చర్చను పక్కన పెడితే, తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆరోజు 11 మంది ఆక్సిజన్‌ అందక మరణించారన్న విషయం జాతీయ చానళ్లలో, ఆంగ్లపత్రికల్లో వచ్చింది. చనిపోయింది 11 మంది కాదు.. 23 మంది అని జగన్‌ సర్కారు జూన్‌ 28న హైకోర్టుకు ఇచ్చిన నివేదికలోనూ పేర్కొంది. ఇదొక్కటే కాదు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇలాఆక్సిజన్‌ అందక 150 మందికిపైగా మరణించారు. ఉదాహరణకు.. ఢిల్లీలోని బాత్రా ఆస్పత్రిలో మే ఒకటో తేదీన 12 మంది పేషెంట్లు ఆక్సిజన్‌ కొరత వల్ల మరణించారు. ఈ విషయాన్ని ఆ ఆస్పత్రి మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌సీఎల్‌ గుప్తా బహిరంగంగా ప్రకటించారు. ఆయన వ్యాఖ్యలు మీడియాలో వచ్చాయి. ఆయన వ్యాఖ్యలకు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా అప్పట్లో స్పందించారు. సకాలంలో ఆక్సిజన్‌ అంది ఉంటే వారి ప్రాణాలు కాపాడి ఉండగలిగేవారమని ఆవేదన వెలిబుచ్చారు. అంతకు ముందు.. ఏప్రిల్‌ చివరివారంలో ఢిల్లీలోనే జైపూర్‌ గోల్డెన్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరతతో 25 మంది పేషెంట్లు నిస్సహాయస్థితిలో అసువులు బాశారు. గోవాలో మే 11-15 నడుమ ఆక్సిజన్‌ కొరతతో 83 మంది మరణించారు.

రోజుకు 1200 ఆక్సిజన్‌ సిలిండర్లు కావాలని.. కానీ 400 సిలిండర్లే అందాయని గోవా ఆరోగ్యమంత్రి విశ్వజిత్‌ రాణె మే 11న తెలిపారు. కర్ణాటకలోని చామరాజ్‌ నగర్‌ జిల్లాలో మే 2, 3 తేదీల్లో ఆక్సిజన్‌ కొరత వల్ల 24 మంది మరణించారు. దీనిపై కర్ణాటక హైకోర్టు నియమించిన ప్యానెల్‌ విచారణ జరిపి.. ‘ఆక్సిజన్‌ కొరతవల్ల చనిపోయింది 24 మంది కాదు.. 36 మంది’’ అని నివేదిక ఇచ్చింది. కానీ, ఆ ఘటనలో 24 మందికే పరిహారం ఇచ్చారు. హరియాణాలో ఏప్రిల్‌ 5-మే 1 నడుమ ఆక్సిజన్‌ కొరతతో 19 మంది చనిపోయారు. కళ్లముందే ఇన్ని ఘటనలు కనపడుతుండగా.. ఇందుకు సంబంధించిన ఆధారాలు మీడియాలో, ప్రజాబాహుళ్యంలో ఉండగా.. కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రజల ఆగ్రహానికి కారణమవుతోంది. ‘ఆక్సిజన్‌ అందక ఒక్కరూ మరణించలేదు అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన డేటా ఆధారంగానే ప్రకటించాం’ అని సాంకేతిక సాకులు చూపి, బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పించుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి కొవిడ్‌ మరణాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కూడా కొన్నాళ్ల క్రితం వరకూ ఇలాగే ఉంది. ఇంతకు ముందు సంవత్సరాల్లో జనవరి నుంచి జూన్‌ దాకా మరణాల లెక్కకు.. ఈ ఏడాది అదే సమయంలో మరణాల లెక్కకు మధ్య ఉన్న భారీ తేడాను మీడియా బయటపెట్టడంతో ప్రభుత్వాలు మరణాల లెక్కలను సవరించి ప్రకటిస్తున్నాయి. బహుశా.. ఆక్సిజన్‌ కొరత వల్ల సంభవించిన మరణాల లెక్కలు కూడా ఇలాగే నెమ్మదిగా బయటకు వస్తాయని అంచనా!! 

-సెంట్రల్‌ డెస్క్‌


‘‘కరోనాతో బాధపడుతున్న మా నాన్న శ్వాస అందక వ్రరంగా ఇబ్బంది పడుతుంటే.. చాలా ఆస్పత్రులకు వెళ్లాం. ఎక్కడా ఆయన్ను చేర్చుకోలేదు. ఏ ఆస్పత్రిలోనూ పడకలు లేవు. ఆక్సిజన్‌ లేదు. దీంతో చేసేది లేక మా నాన్నను తీసుకుని ఇంటికి తిరిగొచ్చాం. ఆయన చనిపోయారు. ఆయనకు మేం ఆక్సిజన్‌ సిలిండర్‌ ఏర్పాటు చేయలేకపోయినందువల్లే చనిపోయారు.’’

- ఉత్తరప్రదేశ్‌లో.. కరోనా వల్ల ఊపిరాడక మరణించిన శంకర్‌ దయాళ్‌ (61) కొడుకు ప్రిన్స్‌ కుమార్‌ఆవేదన ఇది


‘‘మన తప్పు కాకపోయినా, పక్క రాష్ట్రం నుంచి రావాల్సిన ఆక్సిజన్‌ ట్యాంకర్‌ సకాలానికి రాకపోయినా సరే బాధ్యత తీసుకుని రుయా ఘటనలో మరణించిన కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని చిత్తూరు కలెక్టర్‌ను ఆదేశిస్తున్నాం’’

- ఈ ఏడాది మే 11న తిరుపతి రుయాలో ఆక్సిజన్‌ అందక 11 మంది మరణించిన ఘటనపై ఏపీ సీఎం జగన్‌ స్పందన ఇది.