క్షణక్షణం.. భయం భయం

ABN , First Publish Date - 2021-12-04T04:08:18+05:30 IST

జవాద్‌ తుఫాన్‌ నేపథ్యంలో జీవీఎంసీ 89వ వార్డు కొత్తపాలెం శివారులోని పలు కాలనీల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

క్షణక్షణం.. భయం భయం
గులాబ్‌ తుఫాన్‌ సమయంలో నీట మునిగిన కొత్తపాలెం- నరవ ప్రధాన రహదారి(ఫైల్‌ ఫొటో)

జవాద్‌ తుఫాన్‌ నేపథ్యంలో భీతిల్లుతున్న కొండవాలు, లోతట్టు ప్రాంతవాసులు

గోపాలపట్నం, డిసెంబరు 3: జవాద్‌ తుఫాన్‌ నేపథ్యంలో జీవీఎంసీ 89వ వార్డు కొత్తపాలెం శివారులోని పలు కాలనీల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సెప్టెంబరు నెలలో సంభవించిన గులాబ్‌ తుఫాన్‌ సమయంలో మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ గేట్లు ఎత్తడంతో కొత్తపాలెం శివారులోని భగత్‌సింగ్‌నగర్‌, పరదేశమ్మనగర్‌, గణేశ్‌ సాయినగర్‌ కాలనీలు నీటమునిగాయి. అప్పట్లో ఈ ప్రాంతవాసులు సుమారు 24 గంటలకు పైగా జల దిగ్బంధంలోనే ఉన్నారు. దీంతో పాటు కొత్తపాలెం నుంచి నరవ మీదుగా శివారు ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా జలమయమై ఈ మార్గంలో ఒక రోజు పాటు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో తాజాగా మరో తుఫాన్‌ సంభవిస్తే ఇదే పరిస్థితి పునరావృతమయ్యే ప్రమాదం లేకపోలేదని స్థానికులు భీతిల్లుతున్నారు. కాగా కొత్తపాలెం శివారులోని పలు కాలనీల ప్రజల్లో చాలా మంది ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ముఖ్యంగా గణేశ్‌ సాయినగర్‌ కాలనీలోని చాలా ఇళ్లు ప్రస్తుతం ఖాళీగా కనిపిస్తున్నాయి. 

కొనసాగుతున్న నీటి విడుదల

తుఫాన్‌ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా రెండు రోజుల నుంచి మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ గేటు ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్‌ గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 61 అడుగులు కాగా, ఇటీవల కురిసిన వర్షాలకు రిజర్వాయర్‌కు పెద్ద మొత్తంలో వరదనీరు వచ్చి చేరింది. దీంతో సుమారు వారం రోజుల పాటు రిజర్వాయర్‌ గేటు ఎత్తి 60.2 అడుగుల వద్ద నీటిమట్టాన్ని స్థిరంగా ఉంచారు. అయితే తుఫాన్‌ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా రిజర్వాయర్‌ నీటిమట్టాన్ని తగ్గించడానికి గేటును శుక్రవారం 1.6 అడుగులు ఎత్తి 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రిజర్వాయర్‌ నీటిమట్టం ప్రస్తుతం 59 అడుగులకు చేరింది. వర్షం కురిసి రిజర్వాయర్‌కు ఏ మాత్రం ఇన్‌ఫ్లో పెరిగినా మరో గేటును ఎత్తి వరదనీటిని విడుదల చేసే అవకాశం ఉంటుందని రిజర్వాయర్‌ అధికారులు తెలిపారు. తుఫాన్‌ నేపథ్యంలో రిజర్వాయర్‌ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి రిజర్వాయర్‌ అధికారులు తగిన సూచనలు ఇస్తున్నారు.




Updated Date - 2021-12-04T04:08:18+05:30 IST