Abn logo
May 6 2021 @ 19:12PM

విడిపోతూ లక్షల కోట్లు ఇచ్చేశారు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విడాకుల జంటలివీ..!

పెళ్లిళ్లకు బాగా ఖర్చవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే కొన్ని సామాన్య కుటుంబాలు పెళ్లి చేయాలంటే అప్పుల పాలవుతాయి. రిచ్  కుటుంబాల్లో జరిగే పెళ్లిళ్లు టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తాయి. కానీ ఇటీవలి కాలంలో కొంతమంది సెలెబ్రిటీల పెళ్లిళ్ల కన్నా విడాకులే పెద్ద చర్చనీయాంశాలుగా మారాయి. వీరిలో అత్యధికులు ప్రపంచ కుబేరుల జాబితాలో ఉండటం మరింత ఆసక్తి రేపింది. దీనికితోడు ఈ కుబేరుల విడాకుల సమయంలో భార్యలకు వీరిచ్చే సొమ్ము లక్షల కోట్లలో ఉంటుంది. తాజాగా ప్రపంచ కుబేరుల్లో ఒకరైన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్, ఆయన భార్య మెలిండా గేట్స్ కూడా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. విడాకుల దాకా వస్తే ఎవరికేమి దక్కాలనే ప్రినప్టియల్ ఒప్పందం వీరి మధ్య ఏదీ లేదు. దీంతో వీరి ఆస్తులను, అప్పులను పంచుకోనున్నారు. ఇలా చేస్తే వీరి విడాకులు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విడాకులుగా మారతాయి. ఇప్పటి వరకూ ప్రపంచంలో అత్యంత ఖరీదైన విడాకుల వివరాలపై ఒకసారి లుక్కేద్దామా?1. జెఫ్ బెజోస్, మెకెంజీ స్కాట్


ప్రపంచ కుబేరుల్లో నిన్న మొన్నటి దాకా నంబర్ వన్, అమెజాన్ సంస్థల వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్. 1992లో మెకెంజీతో వివాహమైంది. వీరిద్దరూ 2019లో విడిపోయారు. ఈ జంట మధ్య ఉన్న ప్రినప్టియల్ ఒప్పందం ప్రకారం, విడాకుల సమయంలో బెజోస్.. అమెజాన్‌లో 4శాతం షేర్లు ఆమెకు చెల్లించాడు. వీటి విలువ 36 బిలియన్ డాలర్లు (2.6 లక్షల కోట్లపైగా) ఉంటుందని అంచనా.. దీంతో ఆమె ప్రపంచంలోని ధనిక మహిళల్లో మూడో స్థానానికి చేరిపోయింది. 2. రూపర్ట్ ముడ్రోచ్, అన్నా మారియా మన్


మీడియా మొఘల్ రూపర్ట్ ముడ్రోచ్ తన భార్య అన్నా మరియా మన్‌కు 1999లో విడాకులిచ్చేశారు. ఈ విడాకులు ఆయనకు బాగానే ఖర్చయ్యాయి. ఈ సమయంలో సీనియర్ జర్నలిస్టు, నవలా రచయిత్రి అయిన అన్నాకు 1.7 బిలియన్ డాలర్ల ఆస్తులతోపాటు 110 మిలియన్ డాలర్ల డబ్బు దక్కింది. ముడ్రోచ్‌కు మన్ రెండో భార్య. వీరికి ముగ్గురు పిల్లలు.3. టైగర్ వుడ్స్, ఎలిన్ నార్డెగ్రెన్


ప్రపంచ మాజీ నెంబర్ వన్ గోల్ఫ్ క్రీడాకారుడు టైగన్ వుడ్స్. ఎలిన్ నార్డెగ్రెన్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆరేళ్ల తర్వాత ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. స్వీడన్‌కు చెందిన ఎలిన్ ఉద్యోగ నిమిత్తం అమెరికా వచ్చినప్పుడు వీరిద్దరూ కలిశారు. 2004లో పెళ్లి చేసుకొని 2010లో విడిపోయారు. ఆ సమయంలో ఆమెకు టైగర్ వుడ్స్ నుంచి 710 మిలియన్ల విలువైన ఆస్తులు దక్కాయి.4. మైకేల్ జోర్డాన్, జానితా వనాయ్


పాపులర్ బాస్కెట్ బాల్ ప్లేయర్ మైకేలో జోర్డాన్ తన భార్య జానితా వనాయ్‌కు 2006లో విడాకులిచ్చాడు. 2002లో ఈ జంట తొలిసారి విడాకులు కోసం అప్లై చేసింది. ఆ తర్వాత మళ్లీ కలిసిపోయిన వీరు తిరిగి 2006లో విడాకులు తీసుకోవాలని డిసైడయ్యారు. ఆ సమయంలో జోర్డాన్.. వనాయ్‌కు 168 మిలియన్ డాలర్ల ఆస్తులు చెల్లించాడు. అప్పట్లో ఇదే అత్యంత భారీ సెలెబ్రిటీ విడాకుల కేసుగా నిలిచింది.5. సాంగ్ జూంగ్ కి, సాంగ్ హై క్యో


కొరియాకు చెందిన పాపులర్ స్టార్లు సాంగ్ జూంగ్ కి, సాంగ్ హై క్యో. వీళ్లిద్దరూ కలిసి డిసెండెంట్స్ ఆఫ్ ది సన్ అనే డ్రామాలో నటించారు. ఆ తర్వాత పెళ్లితో ఒకటైన ఈ జంట విడిపోవడం అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. వీరిద్దరూ తమ ఆస్తులు పంచుకోలేదు కానీ, వీరిద్దరి పేరిట చెరో 86.5 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులున్నాయి.6. చేయ్ టే వోన్, రోహ్ సో యూంగ్


ఈ జంట విడాకులను ‘డైవర్స్ ఆఫ్ ది సెంచరీ’ (శతాబ్దపు విడాకులు) అని అంటారు. కొరియాలోని మూడో అతిపెద్ద కంపెనీ ఎస్‌కే గ్రూప్. దీని చైర్మన్ చేయ్ టే వోన్. అతని భార్య రోహ్ సో యూంగ్. ఆమె ఒక ఆర్ట్ మ్యూజియం డైరెక్టర్. ఇద్దరూ గొప్ప కుటుంబాల నుంచి వచ్చిన వారే. చేయ్ ఏమో ఎస్‌కే గ్రూప్ వారసుడు. రోహ్ ఏమో దేశాధ్యక్షుడిగా మారిన మాజీ మిలటరీ జనరల్ కుమార్తె. వీరిద్దరి విడాకుల సెటిల్‌మెంట్ 1.6 బిలియన్ డాలర్లు ఉంటుందని తెలుస్తోంది. ఎస్‌కే గ్రూప్ షేర్లలో ఇది 42.3 శాతం.7. హ్యారిసన్ ఫోర్డ్, మెలిస్సా మాథిసన్


హాలీవుడ్ సూపర్ స్టార్ హ్యారిసన్ ఫోర్డ్ తన మాజీ భార్య మెలిస్సా మాథిసన్‌కకు 2004లో విడాకులిచ్చేశాడు. ఈమె హ్యారిసన్‌కు రెండో భార్య. వీరికి ఒక కుమారుడు, కుమార్తె. వీరిద్దరి విడాకుల సెటిల్‌మెంట్ విలువ 118 మిలియన్ డాలర్లు. స్క్రీన్ రైటర్ అయిన మెలిస్సా.. 2015లో మరణించారు.
8. సెర్జీ బ్రిన్, అన్నె వాజ్‌సిస్కి


గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్జీ బ్రిన్, 23అండ్‌మీ వ్యవస్థాపకురాలు అన్నె వాజ్‌సిస్కి పెళ్లి చేసుకున్న 8 ఏళ్లకు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. 2015లో ఈ జంట విడిపోయింది. ఈ జంట విడిపోయినప్పుడు ఎంత చెల్లింపులు జరిగాయో ఎవరికీ తెలియదు. కానీ బ్రిన్ నెట్ వర్త్ ప్రస్తుతం 99 బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువే. ఈ లెక్కన భార్యకు బ్రిన్ బాగానే చెల్లించాడని వార్తలు ఉన్నాయి.9. స్టీవ్, ఎలైన్ విన్


విన్ రిసార్ట్స్ ప్రపంచంలోని ధనికులకు బాగా పరిచయమైన పేరు. వీరిద్దరూ 2010లో రెండోసారి విడాకులు తీసుకున్నారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం, ఎలైన్‌కు ఈ కేసినో జెయింట్‌ వద్ద నుంచి 11 మిలియన్ల షేర్స్ దక్కాయి. వీటి విలువ కనీసం 795 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.10. అద్నాన్ ఖషోగీ, సాండ్రా డేలీ


సౌదీ అరేబియాకు చెందిన ఆయుధ వ్యాపారి అద్నాన్ ఖషోగీ. 1974లో తన భార్య సాండ్రా డేలీకి ఆయన విడాకులిచ్చేశారు. ఆ సమయంలో లెక్కల ప్రకారం, ఆమెకు 874 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు చెల్లించారట ఖషోగీ. అప్పట్లో ఇది భారీ రికార్డు.11. బెర్నీ ఎక్సెల్‌టన్, స్లావికా ర్యాడిక్


ప్రపంచంలోని అత్యంత ఖరీదైన రేసింగుల్లో ఫార్ములా వన్ ఒకటి. దీని ఎగ్జిక్యూటివ్ బెర్నీ ఎక్సెల్‌టన్. యూకేలోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన ఆయన క్రొయేషియాకు చెందిన మోడల్ స్లావికా ర్యాడిక్‌ను వివాహమాడి, 2009లో విడాకులు తీసుకున్నారు. ఈ విడాకుల సెటిల్‌మెంట్ 1.2 బిలియన్ డాలర్లు అని అంచనా. ఈ సెటిల్‌మెంట్‌కు చెందిన వివరాలన్నీ రహస్యంగా ఉంచారు. అయితే కొన్ని రిపోర్టుల ప్రకారం, స్లావికానే బెర్నీకి ఈ సొమ్ము చెల్లిస్తోందట.

ప్రత్యేకంమరిన్ని...

Advertisement