అమ్మకు ప్రేమతో!

ABN , First Publish Date - 2022-06-19T08:39:42+05:30 IST

పేదల అభ్యున్నతి కోసం తనను ప్రేరేపించింది తన మాతృమూర్తి హీరాబెనేనని ప్రధాని మోదీ చెప్పారు.

అమ్మకు ప్రేమతో!

పేదల పథకాలకు ఆమే స్ఫూర్తి

ఓ ముస్లింను కొడుకులా పెంచింది

హీరాబెన్‌ వందో పుట్టిన రోజు సందర్భంగా మోదీ


న్యూఢిల్లీ/అహ్మదాబాద్‌, జూన్‌ 18: పేదల అభ్యున్నతి కోసం తనను ప్రేరేపించింది తన మాతృమూర్తి హీరాబెనేనని ప్రధాని మోదీ చెప్పారు. తన తల్లి శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం ఆయన అహ్మదాబాద్‌కు వెళ్లి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. తల్లి పుట్టినరోజు సందర్భంగా ఆమె త్యా గాలను, తన ఆలోచనలు, వ్యకిత్వం రూపుదిద్దుకోవడంలో ఆమె పాత్రను గుర్తుకు చేసుకుంటూ బ్లాగ్‌ పోస్టు రాశారు. పేదల కోసం తాను ప్రవేశపెట్టిన అనేక పథకాలకు ఆమెయే స్ఫూర్తి అన్నారు. 2001లో బీజేపీ తనను గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినప్పుడు తన తల్లి ఎంతో ఆనందించిందని, ‘‘నువ్వు చేసే పనేంటో తెలియదు కానీ.. ఎట్టి పరిస్థితుల్లో లంచం తీసుకోకు’’ అంటూ ఆశీర్వదించిందని గుర్తు చేసుకున్నారు. తన తం డ్రి సన్నిహిత మిత్రుడు చనిపోతే అతని కుమారుడు అబ్బా్‌సను ఇంట్లో ఉంచుకొని చదివించారని, తన తల్లి అబ్బా్‌సను సొంత కొడుకులా ప్రేమగా చూసుకుందని గుర్తు చేసుకున్నారు. తన తల్లి జీవితంలో ఓరిమి, త్యాగం, భారతీయ మాతృశక్తి సేవాభావాన్ని చూశానన్నారు. తన తల్లి అందరు తల్లుల్లాగే సాధారణం గా కనిపించే అసాధారణ వ్యక్తి అని వ్యాఖ్యానించారు. ఆమె తనతో రెండే రెండుసార్లు ప్రజల్లోకి వచ్చారని గుర్తు చేసుకున్నారు.


30 ఏళ్ల క్రితం శ్రీనగర్‌లో ఏక్తా యాత్ర పూర్తి చేసుకొని, లాల్‌చౌక్‌లో త్రివర్ణ పతాకం ఎగురవేసి, అహ్మదాబాద్‌ తిరిగి వచ్చినప్పుడు తన తల్లి ఎదురువచ్చి తిలకం దిద్దారని, 2001లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు పక్కనే ఉన్నారని తెలిపారు. చదువుకోని వాళ్లు కూడా ప్రయత్నంతో ఏదైనా నేర్చుకోగలరనే జీవిత పాఠాన్ని తన తల్లి నేర్పిందని మోదీ వెల్లడించారు. వాద్‌నగర్‌లో మట్టి గోడలతో నిర్మించిన చిన్న పెంకుటింటిలో ఉండేవారమని, వర్షాకాలంలో ఇల్లు కారుతుంటే తన తల్లి గిన్నెలు, బకెట్లు పెట్టేదని గుర్తు చేసుకున్నారు. ఇంటి పని మొత్తం చేయడంతో పాటు కుటుంబ పోషణ కోసం ఇతరుల ఇళ్లలో అంట్లు తోమడం, చరఖా వడకడం వంటి పనులు చేసేదన్నారు. ఇప్పటికీ ఆమె పేరిట రూపాయి విలువ చేసే ఆస్తి కూడా లేదన్నారు. తన తల్లికి బంగారంపై ఆసక్తి కూడా లేదని చెప్పారు. అపరిమితమైన దైవ భక్తిని కలిగి ఉన్నప్పటికీ ఎలాంటి మూఢ నమ్మకాలు ఆమెకు లేవని చెప్పారు. తమను కూడా అలాగే పెంచిందన్నారు.


చిన్న వయసులో తాను ఇల్లు వదిలి వెళ్లాలనుకున్నప్పుడు తండ్రి గుండె బద్దలైందని, తల్లి మాత్రం ఆశీర్వదించి పంపారని మోదీ గుర్తు చేసుకున్నారు. చిన్నతనం నుంచే తన ఆలోచనా విధానం భిన్నమైనదని తల్లి గుర్తించి ప్రోత్సహించారన్నారు. తల్లి వందేళ్ల వయస్సులోనూ సొంతంగా పనులు చేసుకొనేందుకు ప్రయత్నిస్తుంటారని అన్నారు. కాగా, మోదీ పంచమహల్‌ జిల్లాలోని కాళీమాత ఆలయాన్ని సందర్శించారు. 500 ఏళ్లుగా ఈ గుడిపై ఉన్న దర్గాను పక్కకు తరలించి, ఆలయంగా కొనసాగించేందుకు దర్గా నిర్వాహకులు అంగీకరించడంతో ఇటీవలే మరమ్మతులు చేపట్టారు. 500 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి గుడిపై ఆలయానికి సంబంధించిన సంప్రదాయ జెండాను మోదీ ఎగురవేశారు. 


పాఠ్యాంశాల్లో యోగా

యోగా పరిజ్ఞానాన్ని పాఠ్యాంశాల్ల చేర్చాలని ఎన్‌సీఈఆర్టీకి కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ మ్రంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సూచించారు. శనివారం ఆయన ఢిల్లీలో జాతీయ యోగా ఒలింపియాడ్‌-2022, క్విజ్‌ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. యోగా కోవిడ్‌ తర్వాత రోగ నిరోధక శక్తిని, దృఢత్వాన్ని పెంచిందన్నారు. ఆరోగ్యకరమైన మార్గాలను ఎంచుకుంటూ మనుషుల మధ్య దూరాన్ని తగ్గించేందు కు ప్రధాని మోదీ ఈ ఏడాది థీమ్‌ను ‘‘యోగా ఫర్‌ హ్యుమానిటీ’’గా ఎంచుకున్నారని తెలిపారు. యోగా ప్రపంచానికి భారత దేశం ఇచ్చిన వరం అన్నారు. యోగాను పాఠ్యాంశంగా చేర్చటంతో పాటు పాఠశాలలు, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో యోగా ఒలింపియాడ్స్‌ నిర్వహించాలని ఎన్‌సీఈఆర్టీకి సూచించారు. నేషనల్‌ యోగా ఒలింపియాడ్‌ను విద్యా మంత్రిత్వ శాఖ, నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. పోటీలు 20 వరకు జరుగుతాయి. ఈ సంవత్సరం సుమారు 600 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు.

Updated Date - 2022-06-19T08:39:42+05:30 IST