ఢిల్లీకి వెళ్లి ధర్నా చేయండి: రైతులతో పంజాబ్ సీఎం

ABN , First Publish Date - 2021-09-14T02:47:10+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా గతేడాది నవంబర్‌లో రైతులు ఆందోళన ప్రారంభించారు. మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా మొదట్లో అమరీందర్ సింగ్ నిరసన ప్రారంభించారు.

ఢిల్లీకి వెళ్లి ధర్నా చేయండి: రైతులతో పంజాబ్ సీఎం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై తెలిపే నిరసను ఢిల్లీ సరిహద్దుల్లోనే కొనసాగితే బాగుంటుందని, పంజాబ్‌లో నిరసన చేసేవాళ్లు ఢిల్లీకి వెళ్లాలని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ అభిప్రాయపడ్డారు. రైతుల నిరసన వల్ల రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతోందని, మౌలిక సదుపాయాల కల్పనలో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని సోమవారం పంజాబ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన అన్నారు.


‘‘ఈరోజుకు పంజాబ్‌లోని 113 ప్రాంతాల్లో రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇది రాష్ట్రంలో అభివృద్ధికి తీవ్ర విఘాతం కల్పిస్తోంది. మీరు (రైతులు) కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలనుకుంటే మీ ఆందోళనను ఢిల్లీకి మార్చండి. కానీ మీ నిరసనలతో పంజాబ్‌ను ఇబ్బంది పెట్టకండి’’ అని కెప్టెన్ అన్నారు. సోమవారం రుణమాఫీ పథకం కింద పంజాబ్‌లోని ఓ ప్రాంతంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. దానికి ముఖ్య అతిథిగా అమరీందర్ హాజరై పై విధంగా వ్యాఖ్యానించారు.


కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా గతేడాది నవంబర్‌లో రైతులు ఆందోళన ప్రారంభించారు. మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా మొదట్లో అమరీందర్ సింగ్ నిరసన ప్రారంభించారు. అనంతరం పంజాబ్ నుంచి వేలాది మంది రైతులు నిరసనలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రైతులు ఢిల్లీ సరిహద్దులో బైఠాయించి ఆందోళన చేస్తున్నారు.

Updated Date - 2021-09-14T02:47:10+05:30 IST