రైతులపై ఆంక్షలా?

ABN , First Publish Date - 2020-04-05T09:08:45+05:30 IST

భౌతిక దూరం పాటించి శిబిరాల్లో అమరావతి కోసం ఉద్యమం చేస్తుంటే, పోలీసులు ఆంక్షలు పేరుతో కేసులు నమోదు చేస్తామంటున్నారని రాజధాని జేఏసీ సభ్యులు ధ్వజమెత్తారు.

రైతులపై ఆంక్షలా?

భౌతిక దూరం పాటిస్తూ ఉద్యమిస్తున్నాం..

 ఎమ్మెల్యే నిబంధనలు పాటించడం లేదు..

రాజధాని రైతుల ధ్వజం

109వ రోజు కొనసాగిన నిరసనలు


తుళ్ళూరు, ఏప్రిల్‌ 4: భౌతిక దూరం పాటించి శిబిరాల్లో అమరావతి కోసం ఉద్యమం చేస్తుంటే, పోలీసులు ఆంక్షలు పేరుతో కేసులు నమోదు చేస్తామంటున్నారని రాజధాని జేఏసీ సభ్యులు ధ్వజమెత్తారు. రాజధాని గ్రామాల్లో శనివారం 109వ రోజు ఆందోళనలు కొనసాగాయి. రైతులు జై అమరావతి నినాదాలు చేశారు. ఇళ్ల వద్ద నుంచే నిరసనలు చేపట్టారు. అమరావతి వెలుగు కార్యక్రమంలో భాగంగా కొవ్వొత్తులు వెలిగించి నిరసనలు వ్యక్తం చేశారు. ఈసందర్భంగా రాజధాని దళిత రైతు జేఏసీ, రాజధాని రైతు పరిరక్షణ జేఏసీ సభ్యులు మాట్లాడుతూ తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి భౌతిక దూరం పాటించకుండా కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తూట్లు పొడిచారని ఆరోపించారు. శనివారం ఎమ్మెల్యే గుంపుగా ఉన్న పార్టీ శ్రేణులతో కలసి వచ్చి పేదలకు ఎలా నిత్యావసరాలు పంపిణీ చేశారని ప్రశ్నించారు.


ప్రజాప్రతినిధి అయి కరోనా కట్టడికి చర్యలు తీసుకునే విధానం ఇదేనా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది రాజకీయ లబ్ధి కోసం చేసిన కార్యక్రమమని మండిపడ్డారు. అందుకు పోలీసులు కూడా పూర్తి సహకారం అందించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శిబిరాల్లో రైతులు భౌతిక దూరం పాటిస్తూ ధర్నాలు, దీక్షలు చేస్తున్నామని తెలిపారు. పోలీసులు కరోనా పేరుతో  హడలెత్తించి ఇంటి నుంచి ఉద్యమం చేపట్టేటట్టు చేశారని తెలిపారు. శిబిరాల్లో ఇకపై కూడా భౌతిక దూరం పాటించి ఉద్యమం చేస్తామని చెపుతున్నారు. 



Updated Date - 2020-04-05T09:08:45+05:30 IST