సినిమా హాలు నిండినది!

ABN , First Publish Date - 2021-01-20T06:59:05+05:30 IST

భానుగుడి (కాకినాడ), జనవరి 19: జిల్లావ్యాప్తంగా సినిమాల సందడి పూర్తి స్థాయిలో ఊపం దుకుంది. సంక్రాంతి అంటేనే సినిమా పండుగ అని మరోసారి ప్రేక్షకులు రుజువుచేశారు. అలాంటిది థియేటర్ల యాజమాన్యాలు మాత్రం ప్రేక్షకులకిచ్చిన హమీలను మాత్రం తుంగలోకి తొక్కారు

సినిమా హాలు నిండినది!
కాకినాడలో ఓ థియేటర్‌ వద్ద రద్దీ

థియేటర్లలో కొవిడ్‌ నిబంధనలు గాలికి

కిక్కిరిసి ఉంటున్న కొన్ని సినిమా హాళ్లు

పట్టించుకునే అధికారులూ లేరు

ఇదే కొనసాగితే మళ్లీ ముప్పే

భానుగుడి (కాకినాడ), జనవరి 19: జిల్లావ్యాప్తంగా సినిమాల సందడి పూర్తి స్థాయిలో ఊపం దుకుంది. సంక్రాంతి అంటేనే సినిమా పండుగ అని మరోసారి ప్రేక్షకులు రుజువుచేశారు. అలాంటిది థియేటర్ల యాజమాన్యాలు మాత్రం ప్రేక్షకులకిచ్చిన హమీలను మాత్రం తుంగలోకి తొక్కారు. జిల్లాలో 140 థియేటర్లు ఉండగా, డిసెంబరు 25న మొదటిగా జిల్లాలో పది శాతం ఽథియేటర్లు ప్రారంభించారు. ఆ తర్వాత జనవరి 1న 50 శాతం థియేటర్లు తెరుచుకోవడంతో పాటు, పూర్తి స్థాయిలో నిబంధనలు పాటిస్తామని.. వచ్చే ప్రేక్షకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ఆయా యాజమాన్యాలు అంగీకారం తెలిపి తమ థియేటర్లలో షో లను ప్రారంభించాయి. ఽఽథియేటర్లు తెరుచుకునేప్పుడు థియేటర్లో ఉన్న సిట్టింగ్‌ను బట్టి అందులో సగం మాత్రమే టిక్కెట్లు అమ్మాలని, సీటుకు సీటుకు మధ్యలో ఒక సీటు వదిలేయాలని, ప్రేక్షకులు లోపలకు వచ్చే సమయంలో శానిటైజ్‌ చేయడంతోపాటు మాస్కులు తప్పకుండా ధరింపజేయాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది.అలాగే తినుబండారాల విషయంలో జాగ్రత్తలు, కూల్‌డ్రింకులు శీతాలపానీయాలు అమ్మకాలు తగ్గించాలని, రోజుకు నాలుగు ఆటలు మధ్యలో అర్ధ గంటపాటు థియేటర్‌ మొత్తం శానిటైజ్‌ చేయాలని ఆదేశించింది.


ఇక సినిమాకు వచ్చేవారికి ఆన్‌లైన్‌లోనే టిక్కెట్టు అమ్మాలని, బుకింగ్‌ కౌంటర్‌లో విక్రయిస్తే భౌతిక దూరం పాటించేలా చూడాలని అధికారులు నిబంధనలు పెట్టారు. అయితే వీటిలో వేటినీ ఆయా థియేటర్ల యాజమాన్యాలు పాటించడం లేదు. చివరకు షోకి షోకి మధ్యలో సమయం కూడా ఇవ్వకుండా ఏకధాటిగా షోలు వేయడమేగాకుండా శానిటైజ్‌ చేయడం మానేశారు. రోజుకు నాలుగు షోలు వేసి శానిటైజ్‌ చేస్తే పూర్తి స్థాయిలో నాలుగు షోలు కూడా పడవని గగ్గోలు పెట్టిన యాజమాన్యాలు ఇష్టానుసారం టైమింగ్‌లు మార్చివేసి 10.30, 11.00 సమయాల్లో కూడా నేటికీ షోలు ప్రదర్శిస్తున్నారు. ఇక బ్లాక్‌లో టిక్కెట్ల అమ్మకాలు, తినుబండారాల దుకాణాల వద్ద జనం గుమిగూడుతున్నా అడ్డుకునే పరిస్థితి లేదు. ఇక టిక్కెట్లు తీసుకునే క్యూ గ్యాలరీల్లో కిక్కిరిసిపోయి మరీ ప్రేక్షుకులు కనిపిస్తున్నారు. వీరిని అదుపుచేయాలన్న ఆలోచన కూడా లేకుండా థియేటర్ల నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. విరామం సమయంలోనూ దాదాపుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఆయా యాజమాన్యాలు మంచినీరు తాగేందుకు ఉంచడంతోపాటు బాత్‌రూమ్‌లను కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నం కూడా గాలికి వదిలేశాయని ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కొత్త సినిమాలు విడుదలైన సందర్భాల్లో అయినా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టకపోతే మళ్లీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని, తక్షణం థియేటర్ల వద్ద ఆర్డీవో వంటి అధికారులు తనిఖీలు చేపట్టాలని కోరుతున్నారు.


Updated Date - 2021-01-20T06:59:05+05:30 IST