సినిమాకెళ్లొద్దాం

ABN , First Publish Date - 2020-12-05T06:01:13+05:30 IST

సినిమా ప్రేమికుల ఎదురుచూపులు ఫలించాయి. ఇన్నాళ్లు ఇంట్లో బుల్లితెరకే పరిమితమైన వినోదం ఇకపై వెండితెరపై విందు చేయనుంది.

సినిమాకెళ్లొద్దాం
టికెట్లు అందిస్తున్న సిబ్బంది

థియేటర్లలో ఆట షురూ

తొలిరోజు ప్రేక్షకులు అంతంత మాత్రమే

సినిమా ప్రేమికుల ఎదురుచూపులు ఫలించాయి. ఇన్నాళ్లు ఇంట్లో బుల్లితెరకే పరిమితమైన వినోదం ఇకపై వెండితెరపై విందు చేయనుంది. సుమారు తొమ్మిది నెలల తర్వాత సినిమా థియేటర్లు తెరుచుకున్నాయి. కొవిడ్‌ కారణం గా మార్చి 15న మూతపడిన థియేటర్లు సుదీర్ఘ కాలం తర్వాత పలు ఆంక్షలతో తిరిగి ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా సినిమా ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ శుక్రవారం పరిమిత సంఖ్యలో మాత్రమే సినిమా హా ళ్లు ఓపెన్‌ చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 32 సినిమా హాళ్లు ఉండగా కేవలం మిర్యాలగూడలోని వీటీ థియేటర్‌ ఒక్కటే ప్రారంభం కావడం గమనార్హం.


మిర్యాలగూడ, డిసెంబరు 4: ప్రభుత్వం విధించిన కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ థియేటర్‌ నిర్వాహకులు తొలి రోజు నాలుగు షోలు వేశారు. రెండు రోజులుగా థియేటర్‌ శుభ్రం చేయించి హాల్‌లోని సీట్లను శానిటైజ్‌ చేసినట్లు హాల్‌ నిర్వాకులు తెలిపారు. సినిమా చూసేందుకు వచ్చిన వారు ముందుగా ప్రభుత్వం సూచించిన విధంగా లిక్విడ్‌ వాటర్‌తో చేతులు శుభ్రపర్చుకునేలా చేసి శానిటైజ్‌ స్ర్పే చేసేందుకు ఏర్పాట్లుచేసి తొలిరోజు అన్ని జాగ్రత్తలతో హాల్‌లోకి అనుమతించారు. ఆరోహణ అవరోహణ క్రమంలో ప్రేక్షకులకు సీట్లు కేటాయించారు. సిబ్బందికి, ప్రేక్షకులకు మాస్క్‌లను తప్పనిసరి చేశారు.


మొదటి ఆటకు 50మందే 

తొలిరోజు ప్రేక్షకులు అంతంత మాత్రంగానే థియేటర్‌కు వచ్చారు. మార్నింగ్‌ షోకు 50 మంది మాత్రమే వచ్చినట్లు వేంకటేశ్వర థియేటర్‌ నిర్వాహకులు తెలిపారు. బాల్కనికి 14, సెకండ్‌క్లాస్‌ 2, థర్డ్‌క్లా్‌సకు 34 మంది టికెట్లు తీసుకోగా, తొలి ఆటకు రూ.2000 కలెక్షన్‌ వచ్చింది. కొత్త సినిమాలు లేకపోవడం, థియేటర్లు ప్రారంభమయ్యాయని తెలియకపోవడం కారణంగా ఎక్కువ మంది ప్రేక్షకులు సినిమా చూసేందుకు రాకపోవడానికి కారణంగా విశ్లేషిస్తున్నారు.


ప్రారంభం కాని అద్దె టాకీసులు 

సొంత టాకీసులు కలిగిన యజమానులు కొందరు మాత్రమే సినిమా హాళ్లను ప్రారంభించినట్లు తెలుస్తోంది. థియేటర్లను అద్దెకు తీసుకుని సినిమాలు నడిపించే వారు థియేటర్లను ప్రారంభించలేదు. పాత పద్ధతుల్లో కిరాయిదారులు నెలకు రూ.4.5లక్షలు అద్దె చెల్లించే పరిస్థితుల్లో లేనందున లీజుదారులు థియేటర్లను ప్రారంభించలేకపోయామంటున్నారు. మరోపక్షం రోజుల్లో పరిస్థితులు చక్కబడితే అన్ని హాళ్లు ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.  కాగా ఒక్కో థియేటర్‌పై ఆధారపడి ప్రత్యక్షంగా ఉద్యోగులు, పరోక్షంగా చిరువ్యాపారులు కలిసి 50 మంది ఉండగా రాష్ట్రవ్యాప్తంగా 20వేల మందికి తిరిగి ఉపాధి దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


ఎంతో ఉత్సాహంగా ఉంది:  శ్రీనివాస్‌, ప్రేక్షకుడు, శెట్టిపాలెం

చాలాకాలం తర్వాత థియేటర్‌లో సినిమా చూసే అవకాశం కలిగినందుకు సంతోషంగా ఉంది. రోజు వారి పనులతో టెన్షన్‌గా ఉండే వారికి అప్పుడప్పుడు ఆటవిడుపు కావాలి. వెండి తెరపై సినిమా చూసినప్పుడే మనసుకు మంచి అనుభూతి దక్కుతుంది. తొలిరోజు థియేటర్‌లో సినిమా చూస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. 


ఆశాజనకంగా ఉంది: మేరెడ్డి విజయేందర్‌రెడ్డి, తెలంగాణ థియేటర్స్‌ అసోసియేషన్‌ సెక్రటరీ 

తెలంగాణలో 400 థియేటర్లు, 150 పైగా మల్టీప్లెక్స్‌లుండగా తొలిరోజు 30మల్టీ ప్లెక్స్‌లు, 10థియేటర్లు షో లు ప్రారంభించాయి. ఒక్కటే సినిమా ఉంది, అదీ కూడా టెనెట్‌ ఇంగ్లీష్‌ డబ్బింగ్‌ సినిమా. జిల్లాల్లో ఇంగ్లీష్‌ డబ్బిం గ్‌ సినిమాలు చూసే ప్రేక్షకులు తక్కువ. సినిమా నిర్మా త ప్రచారం చేయకూడదని నిర్ణయించుకున్నప్పటికీ మొ దటి రోజు ఆశాజనక పరిస్థితులు కనిపించాయి. టెనెట్‌కు హైదరాబాద్‌లో మంచి ఆదరణ లభించింది. మిర్యాలగూడలో రూ.400కు మించి రావనుకుంటే రూ.2000 రావడం శుభపరిణామమే. 

Updated Date - 2020-12-05T06:01:13+05:30 IST