Abn logo
Apr 9 2021 @ 01:51AM

ఓటెత్తలేదు..!

  • జడ్పీ, మండల పరిషత్‌ ఎన్నికల్లో తగ్గిన పోలింగ్‌ శాతం 
  • జిల్లావ్యాప్తంగా 64.05 శాతమే నమోదు
  • ఇటీవల పంచాయతీ ఎన్నికల్లోనూ పోలింగ్‌ 81.37ు
  • అమలాపురం రూరల్‌లో జనసేన గుర్తు గల్లంతు

జడ్పీ ఎన్నికల్లో ఓటర్లు నీరసపడ్డారు. ఓటు చైతన్యంతో పోలింగ్‌  కేంద్రాల వద్దకు భారీగా తరలిరావలసి ఉండగా, ఎందుకో దూరం జరిగారు. ఫలితంగా ఈసారి జడ్పీ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం బాగా తగ్గిపోయింది. 2014లో జరిగిన  జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో 79.49 శాతం పోలింగ్‌ నమోదవగా, అప్పటితో పోల్చితే ఈసారి 15.44 శాతానికి ఓటింగ్‌ పడిపోయింది. మొన్న ఫిబ్రవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా పోలింగ్‌ శాతం సరాసరి 81.37 శాతం ఉండగా, దాంతో పోల్చితే  జడ్పీ ఎన్నికల పోలింగ్‌ చాలా తక్కువగా నమోదైంది. దీంతో పడిపోయిన పోలింగ్‌ శాతంపై అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. వరుసగా పంచాయతీ, ఆపై జడ్పీ ఎన్నికలు రావడంతో ఓటు వేయడంపై అనాసక్తి  పెరిగిందనే వాదన ఓపక్క, టీడీపీ ఎన్నికల బరిలో లేకపోవడంతో కేవలం బరిలో ఉన్న వైసీపీకి ఓట్లు వేసేందుకు రావడానికి ఆసక్తి చూపలేదనే వాదన వినిపిస్తోంది. అటు గురువారం జరిగిన జడ్పీ ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా అనేకచోట్ల పోలింగ్‌ నిర్వహణ లోపాలు బయటపడడంతో పార్టీలు, ఓటర్లు ఆందోళనకు దిగారు.

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

జిల్లావ్యాప్తంగా ఉదయం ఏడు గంటలకు పరిషత్‌ ఎన్నికలు ప్రారం భం అయ్యాయి. ఉదయం ఏడు నుంచే మహిళలు, వృద్ధులు పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. దీంతో మునుపటి పంచాయతీ ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా భారీగా పోలింగ్‌ శాతం నమోదవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే అనూహ్యంగా పోలింగ్‌శాతం పడిపోవడం చర్చనీయాంశంగా మారింది. మధ్యాహ్నం మూడు గంటలకు ఏజెన్సీలోను, సాయంత్రం అయుదుతో జిల్లాలో మిగిలిన ప్రాం తంలో ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే తాళ్లరేవు మండలంలో పలుచోట్ల బూత్‌ల వద్ద ఓటర్లు పెద్దఎత్తున క్యూలో ఉండడంతో వారందరిని ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఇక జిల్లామొత్తం జడ్పీ, ఎంపీటీసీల ఎన్నికల పోలింగ్‌ శాతం 64.05 శాతంగా తేలింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 29,97,485 ఓటర్లు ఉండగా, ఈ ఎన్ని కల్లో 19,19,961 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే 2014 జడ్పీ ఎన్నికల్లో 79.49 శాతం పోలింగ్‌ నమోదవగా, ఈసారి 15.44 శాతం ఓటింగ్‌ తగ్గింది. ఫిబ్రవరిలో నాలుగు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాకినాడ, పెద్దాపురం డివిజన్లలో 81.81 శాతం, రాజమహేంద్రవరం, రామచంద్రపురం డివిజన్లలో 82 శాతం, రంపచోడవరం, ఎటపాక డివిజన్లలో 74.83 శాతం, అమలాపురం డివిజన్‌లో 80.29 శాతం పోలింగ్‌ నమోదవగా, జిల్లా సరాసరి 81.37 శాతంగా నమోదైంది. కానీ జడ్పీ ఎన్నికల్లో మాత్రం పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ శాతంతో పోల్చితే 17.32 శాతం పోలింగ్‌ తగ్గింది. అయితే ఎందుకు ఇలా జరిగిందనేదానిపై రకరకాల వాదనలు చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా వేసవి నేపథ్యంలో చాలామంది ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు రాలేదనేది ఒక కారణంకాగా, పెరుగుతున్న కొవిడ్‌ కేసులతో చాలామంది ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయిష్టత చూపిందనే మరో చర్చ జరుగుతోంది. అటు బరిలో టీడీపీ లేకపోవడంతో ఈసారి జడ్పీ ఎన్నికలు చప్పగా మారాయి. దీంతో పెద్దగా పోటీలేని ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోకపోయినా ఫర్వాలేదనే భావన కూడా ఓటింగ్‌ శాతం తగ్గడానికి మరో కారణమనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ కూడా పోటీలో ఉంటే ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభ్యర్థులు ఇంటింటా ప్రచారంలో ఓటు వేయడానికి రావాలని అడిగే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు అది జరగకపోవడంతో కేవలం ఒకే పార్టీ నుంచి ఓటర్లకు విజ్ఞప్తులు రావడంతో చాలామంది తేలిగ్గా తీసుకున్నారనే భావన కనిపించిందని పలువురు పేర్కొన్నారు. ఇక పోలింగ్‌ నిర్వహణలో పలుచోట్ల లోపాలు బయటపడ్డంతో ఆందోళన లు, గొడవలకు దారితీశాయి. అమలాపురం రూరల్‌ మండలం సాకుర్రుగున్నేపల్లి పోలింగ్‌బూత్‌ 51/31లో బ్యాలెట్‌పత్రాలపై జనసేన పార్టీ అభ్యర్థి గ్లాసు గుర్తు లేకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్‌ నిలిచిపోయింది. అయితే బ్యాలెట్‌ పత్రం క్రమసంఖ్య 876 నుంచి 900వరకు గల బ్యాలెట్‌ పత్రాలు వేరే ప్రాదేశిక నియోజకవర్గానివి ఈ బూత్‌కు వచ్చాయి. దీంతో పరిస్థితి చక్కదిద్ది మళ్లీ పోలింగ్‌ కొనసాగించారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో పోలింగ్‌ స్టేషన్‌కు పాత స్టాంపు ప్యాడ్లు అందడంతో ఓటర్లు ఇబ్బందిపడ్డారు. పెద్దాపురం మండలం కాండ్రకోటలో ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లపై ఎస్‌ఐ జులుం ప్రదర్శించారు. ఎస్‌ఐ తనను కొట్టారంటూ చేతికి గాయంతో పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి స్వామి అనే యువకుడు చికిత్సకోసం వచ్చాడు.

Advertisement
Advertisement
Advertisement