బంగ్లాదేశ్‌లో బహుళ దేశాల సైనిక విన్యాసాలు... పాల్గొననున్న భారత సైన్యం...

ABN , First Publish Date - 2021-04-02T02:18:51+05:30 IST

బంగ్లాదేశ్ 50వ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా

బంగ్లాదేశ్‌లో బహుళ దేశాల సైనిక విన్యాసాలు... పాల్గొననున్న భారత సైన్యం...

న్యూఢిల్లీ : బంగ్లాదేశ్ 50వ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా జరిగే బహుళ దేశాల సైనిక విన్యాసాల్లో భారత సైన్యం పాల్గొనబోతోంది. ‘బంగబంధు’ షేక్ ముజిబుర్ రెహమాన్ శత జయంత్యుత్సవాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. 


ఏప్రిల్ 4 నుంచి జరిగే ఈ విన్యాసాల్లో బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, భారత దేశ సైన్యాలు పాల్గొంటాయి.  అమెరికా, బ్రిటన్, టర్కీ, సౌదీ అరేబియా, కువైట్, సింగపూర్ దేశాల సైనిక పరిశీలకుల సమక్షంలో ఈ విన్యాసాలు జరుగుతాయి.


1971లో పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి పొందింది. అంతకుముందు దీనిని తూర్పు పాకిస్థాన్‌ అని పిలిచేవారు. 1971లో జరిగిన యుద్ధంలో పాకిస్థాన్ సైన్యం భారత సైన్యానికి లొంగిపోయిన తర్వాత బంగ్లాదేశ్ ఏర్పడింది. ఈ ఏడాది మార్చి 26న జరిగిన స్వాతంత్ర్య దినోత్సవాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు.  


భారత సైన్యం గురువారం విడుదల చేసిన ప్రకటనలో శాంతిర్ ఒగ్రోషేన, 2021 మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్‌సైజ్ బంగ్లాదేశ్‌లో జరుగుతుందని తెలిపింది. ఈ విన్యాసాల్లో భారత సైన్యంతోపాటు రాయల్ భూటాన్ ఆర్మీ, శ్రీలంక సైన్యం, బంగ్లాదేశ్ సైన్యం పాల్గొంటాయని పేర్కొంది. పటిష్టమైన శాంతి పరిరక్షణ కార్యకలాపాల ఇతివృత్తంతో ఈ విన్యాసాలు జరుగుతాయని తెలిపింది. భారత సైన్యంలోని డోగ్రా రెజిమెంట్‌కు చెందిన 30 మంది సిబ్బంది (అధికారులు, జేసీవోలు, జవాన్లు) పాల్గొంటారని పేర్కొంది. 


ఇదిలావుండగా, బంగ్లాదేశ్ యుద్ధం 50వ వార్షికోత్సవాల సందర్భంగా ఈ ఏడాది మన దేశ గణతంత్ర దినోత్సవాల్లో బంగ్లాదేశ్ సైన్యం పాల్గొంది. బంగ్లాదేశ్ నావికా దళ నౌక ప్రొట్టోయ్ ఫిబ్రవరిలో ముంబై నౌకాశ్రయానికి వచ్చి, రెండు రోజులపాటు ఉంది. 


Updated Date - 2021-04-02T02:18:51+05:30 IST