‘ముంద్రా’ విపత్తు

ABN , First Publish Date - 2021-10-07T06:34:05+05:30 IST

గుజరాత్‌ ముంద్రాపోర్టులో ఇరవైరోజుల క్రితం దాదాపు మూడుటన్నుల హెరాయిన్‌ పట్టుబడినప్పుడు దేశం నిర్ఘాంతపోయింది. అఫ్గానిస్థాన్‌లో తాలిబాన్‌ రాక తరువాత మాదక ద్రవ్యాల అక్రమరవాణాకు...

‘ముంద్రా’ విపత్తు

గుజరాత్‌ ముంద్రాపోర్టులో ఇరవైరోజుల క్రితం దాదాపు మూడుటన్నుల హెరాయిన్‌ పట్టుబడినప్పుడు దేశం నిర్ఘాంతపోయింది. అఫ్గానిస్థాన్‌లో తాలిబాన్‌ రాక తరువాత మాదక ద్రవ్యాల అక్రమరవాణాకు ఇక అడ్డూఆపూ ఉండదని యావత్‌ ప్రపంచం భయపడుతున్న తరుణంలో భారతదేశంలోకి ఇంతటి భారీస్థాయిలో మత్తు చొచ్చుకురావడం సర్వత్రా ఆందోళన కలిగించింది. అఫ్ఘానిస్థాన్‌నుంచి ఇరాన్‌ ద్వారా ముంద్రాపోర్టుకు చేరిన ఈ ఇరవైవేలకోట్లు విలువైన మాదక ద్రవ్యానికి బెజవాడతో బంధం ఉండటం తెలుగువారిని మరింత ఆశ్చర్యపరిచింది. కంపెనీ పేరు, డెలివరీ అడ్రసు ఇక్కడిదైనా మాదకద్రవ్యాల అక్రమరవాణాతో రాష్ట్రానికి ఏ సంబంధం లేదని ఏపీ పోలీసు అధికారులు ప్రకటించారు. ఆషీ ట్రేడింగ్‌ కంపెనీ యజమానులను చెన్నయ్‌లో అరెస్టు చేయడం వినా, ఆ తరువాత ముంద్రాపోర్టు కేసు ముందుకు కదల్లేదు. ఈ పోర్టు అదానీది కావడం వల్ల ఈ కేసునుంచి ప్రజల దృష్టి మళ్ళించడానికే ముంబై రేవ్‌ పార్టీ వ్యవహారాన్ని కేంద్రప్రభుత్వం ముందుకు తెచ్చిందని విపక్షాల అనుమానం. బాలీవుడ్‌ నటుడు షారూఖ్‌ ఖాన్‌ కుమారుడి అరెస్టుతో ఆరంభమై అనేకమలుపులు తిరుగుతున్న ఈ వ్యవహారాన్ని రాజకీయపార్టీలు తమకు తోచినరీతిలో వాడుకుంటున్నాయి, వ్యాఖ్యానిస్తున్నాయి.


అక్రమంగా దేశంలోకి చేరి, ఈ దేశ యువతను మత్తుకు బానిసలను చేసే కొన్ని వందల టన్నుల మాదకద్రవ్యం సంగతి ఏమైందన్నకంటే, ఒక బాలీవుడ్‌నటుడి కుమారుడున్నందున పరిమాణంలో ఎంతోచిన్నదైన ముంబై సాగరతీరం ఘటన ప్రధానమైపోయింది. మీడియాకే కాదు, ప్రజలకూ ఏది ప్రధానమో పాలకులకూ అధికారులకూ బాగా తెలుసు. పదహారుమందిని అరెస్టు చేసిన ఈ వ్యవహారంలో ఆర్యన్‌ఖాన్‌ పాత్ర ఎంతన్నది అటుంచితే, రాజకీయం రంజుగా సాగుతోంది. షారూక్‌ మీద ఉన్న కక్ష ఆయన కుమారుడిమీద తీర్చుకోవద్దని ఎన్సీపీ నాయకులు బీజేపీకి హితవు చెబుతున్నారు. ఆర్యన్‌ఖాన్‌ సహా కొందరు ప్రముఖుల పిల్లల అరెస్టులు ఓ పెద్ద కుట్ర అంటూ ఎన్‌సీబీ నిర్వహించిన క్రూయిజ్‌షిప్‌ దాడిలోనూ, అనంతరం నిందితులను విచారించే క్రమంలోనూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, బీజేపీ బంధం ఉన్న ఓ ప్రైవేటు డిటెక్టివ్‌ ప్రమేయం ఎందుకని బుధవారం విలేకరుల సమావేశంలో ఎన్సీపీ అధికార ప్రతినిధి ప్రశ్నించారు. ఆ దాడిలో అసలు మత్తుపదార్థాలే దొరకలేదనీ, ఆర్యన్‌ చుట్టూ సాగుతున్నదంతా ఓ పెద్ద కుట్రనీ చెప్పడం కోసం ఏవో విడియోలు, ఫోటోలు కూడా విడుదలచేశారు. సీబీఐ, ఇన్‌కమ్‌టాక్స్‌, ఈడీ, ఎన్సీబీ ఇత్యాది తన అధీనంలోని సంస్థలతో గిట్టనివారిని వేధించడం బీజేపీకి అలవాటేనని ఎన్సీపీ వాదన. మరికొందరు రాజకీయప్రముఖులు కూడా మాదకద్రవ్యాల వినియోగాన్ని సమర్థించబోమంటూనే ఆర్యన్‌ అరెస్టుమీద అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో ముంబై జోనల్‌ డైరక్టర్‌ సమీర్‌ వాంఖడే నిజాయితీపరుడూ, మొండిఘటం కావడం వల్ల, ఆయన ఘనచరిత్రను బట్టి ఈ వ్యవహారంలో అనుమానించాల్సిందేమీ లేదని కొందరంటారు. ఆయనే కుట్రదారని ఎన్సీపీ అంటున్నది. 


గోవా వెడుతున్న ఓడలో డ్రగ్స్‌ విక్రయానికీ, వినియోగానికీ సంబంధించిన చాలా ఆధారాలు దొరికాయనీ, దాడులనుంచి దర్యాప్తువరకూ అంతా చట్టప్రకారమే జరుగుతున్నదంటూ ఎన్సీబీ బుధవారం విలేకరుల సమావేశంలో జరిగినదంతా సుదీర్ఘంగా వివరించింది. ఈ ముంబై కేసులో అంతిమంగా ఏం జరుగుతుందన్నకంటే, ముంద్రాపోర్టు వ్యవహారాన్ని లోతుగా దర్యాప్తుచేయడం ముఖ్యం. ఇది పట్టుబడిన కొద్దిరోజుల్లోనే దేశంలోని చాలా ప్రాంతాల్లో కోట్ల విలువైన డ్రగ్స్‌ దొరికాయి. దేశంలో మాదకద్రవ్యాల వాడకం వేగంగా హెచ్చుతున్నది, విస్తరిస్తున్నది. డ్రగ్స్‌తో ముడిపడిన నేరాలు, దానిప్రభావంతో జరిగే ఆత్మహత్యలు కూడా పెరుగుతున్నాయి. కరోనా ప్రభావం వల్ల ఉపాధి అవకాశాలు సన్నగిల్లి, యువత నిరాశానిస్పృహల్లోకి జారుకున్న స్థితిని డ్రగ్స్‌ మాఫియా వినియోగించుకుంటున్నది. ముంద్రా కేసును ఎన్‌ఐఏకు అప్పగించాలన్న కేంద్రహోంశాఖ, ఆ దర్యాప్తులో అఫ్ఘానిస్థాన్‌ నుంచి అక్రమంగా దిగుమతి అవుతున్న మత్తు ఎన్నిమార్గాల్లో, ఎవరెవరి ప్రమేయంతో దేశమంతా విస్తరిస్తున్నదో నిగ్గుతేల్చాలి.

Updated Date - 2021-10-07T06:34:05+05:30 IST