ఆప్కాస్‌ బోగస్‌

ABN , First Publish Date - 2021-06-15T07:36:46+05:30 IST

వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆప్కాస్‌ సంస్థ ఓ పెద్ద బోగస్‌ అని మున్సిపల్‌ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటం తప్ప ఆచరణ లేదని విరుచుకుపడ్డారు. రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సోమవారం నెల్లూరు నగరం లో కార్మికులు విధులను బహిష్కరించారు.

ఆప్కాస్‌ బోగస్‌
నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న కార్మికులు

కార్మికుల పీఎఫ్‌, ఈఎస్‌ఐ నిధులు పక్కదారి

వైసీపీ సర్కారులో ప్రచారం తప్ప ఆచరణ లేదు

రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డ మున్సిపల్‌ కార్మికులు 

జిల్లా వ్యాప్తంగా విధుల బహిష్కరణ, ఎక్కడి చెత్త అక్కడే 


నెల్లూరు (సిటీ), జూన్‌ 14 : వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆప్కాస్‌ సంస్థ ఓ పెద్ద బోగస్‌ అని మున్సిపల్‌ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటం తప్ప ఆచరణ లేదని విరుచుకుపడ్డారు. రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా  మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సోమవారం నెల్లూరు నగరం లో కార్మికులు విధులను బహిష్కరించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో పలు చోట్ల నిరసన ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు. కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట నిర్వహించిన ఆందోళనలో నేతలు మాదాల వెంకటేశ్వర్లు, పెంచల నరసయ్య మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉండగా మున్సిపల్‌ కార్మికులకు పలు హామీలిచ్చిన ముఖ్యమంత్రి జగన్‌, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారని విమర్శించారు. ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటైన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సంస్థ ఆప్కాస్‌ కార్మికులెవరికీ ఉపయోగకరంగా లేదన్నారు. పీఎఫ్‌, ఈఎస్‌ఐ సొమ్ము కోట్ల రూపాయలు కార్మికుల ఖాతాలో జమకావడం లేదన్నారు. మున్సిపల్‌ కార్మికులను పూజించాలని, వారిని గౌరవించాలని పదే పదే చెప్తున్న ముఖ్యమంత్రి  ఆ కార్మికుల ప్రయోజనాలను మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో నాయకులు మూలం రమేష్‌, కత్తి శ్రీనివాసులు, నాగేశ్వరరావు, సూర్యానారాయణ తదితరులు పాల్గొన్నారు. 


ఎక్కడ చెత్త అక్కడే 

మున్సిపల్‌ కార్మికులంతా సమ్మెలోకి వెళ్లడంతో నెల్లూరు నగరం చెత్తమయమైంది. నగరంలో నిత్యం 300 టన్నుల చెత్త ఉత్పన్నమవుతోంది. దానిని తొలగించేందుకు కార్మికులు లేకపోవడంతో ఎక్కడి వ్యర్థాలు అక్కడ నిలిచిపోయాయి. కాగా, మంగళవారం కూడా సమ్మె కొనసాగనుంది. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకుంటే నెలాఖరున నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నట్లు నాయకులు ప్రకటించారు. ఇదిలా ఉండగా కార్మికుల సమ్మెతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంహెచ్‌వో వెంకట రమణయ్య తెలిపారు. 

Updated Date - 2021-06-15T07:36:46+05:30 IST