ప్లాన్‌ చేసి ప్రాణం తీశాడా..?

ABN , First Publish Date - 2021-08-01T07:25:25+05:30 IST

మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ హోటల్‌లో గురువారం జరిగిన జంట మరణాల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.

ప్లాన్‌ చేసి ప్రాణం తీశాడా..?
రాములు, సంతోషి (ఫైల్‌)

 పోలీసుల అనుమానం

 కీలకం కానున్న ఫోరెన్సిక్‌, పోస్టుమార్టం రిపోర్టు

కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్‌ 

రికార్డు చేస్తున్న పోలీసులు


హైదరాబాద్‌ సిటీ, జూలై 31(ఆంధ్రజ్యోతి): మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ హోటల్‌లో గురువారం జరిగిన జంట మరణాల  కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.  రాములు, సంతోషి పెళ్లి విషయమై చర్చించుకోవడానికి హోటల్‌కు వచ్చారని, ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి, అది తారా స్థాయికి చేరడంతో క్షణికావేశంలో రాములు, సంతోషిని బ్లేడ్‌తో గొంతుకోసి చంపేసి, ఆ తర్వాత తాను గొంతుకోసుకొని, ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ఇప్పటి వరకు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే.. తన చెల్లికి ఇద్దరినైనా ఎదిరించే శక్తి ఉందని, పిరికిది కాదని సంతోషి అన్నయ్యలు, తన కుమారుడు ఆత్మహత్య చేసుకునే ధైర్యం చేయడని, గొంతుకోసుకొని ఉరేసుకునే అవకాశమే లేదని ఆ గదిలో మూడో వ్యక్తి ఎవరైనా ఉండి ఉంటారని మృతుడి తల్లిదండ్రులు, అన్న బలంగా ఆరోపిస్తున్నారు.


కోసుకుంటే స్వరపేటిక తెగుతుందా..? 

రాములు బ్లేడ్‌తో గొంతుకోసుకున్న తర్వాత చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అదే నిజమైతే.. తనకు తానుగా బ్లేడ్‌తో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వ్యక్తి.. స్వరపేటిక తెగేంత లోతుగా కోసుకోగలడా...? ఒకవేళ కోసుకోగలిగితే ఆ తర్వాత కూడా చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకునేంత అవకాశం ఉంటుందా.. అనే అనుమానం వెంటాడుతోంది. ఇదిలా ఉంటే.. సంతోషిని బ్లేడ్‌తో గొంతుకోసి చంపేసిన రాములు.. ప్రియురాలి మృతదేహం రక్తపుమడుగులో పడి ఉండగా.. అదే బ్లేడ్‌తో అంత షాక్‌లో తాను గొంతును లోతుగా కోసుకోగలడా..? ఒక్క బ్లేడ్‌తో ఒకే వ్యక్తి రెండు గొంతుకలు కోయగలడా..? రెండు గొంతుకలు కోసినప్పటికీ బ్లేడ్‌ విరగకుండా, అంతే పదునుగా ఉంటుందా..? ఇది ప్రొఫెషనల్‌ కిల్లర్స్‌కైనా సాధ్యమవుతుందా..? ఇలా అనేక అనుమానాలు, జవాబులేని ప్రశ్నలు ఇటు కుటుంబ సభ్యులను, అటు పోలీసుల వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సరైనా సమాధానాలు, ఆధారాలు దొరక్క కేసు విచారణ చేస్తున్న పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. సైబరాబాద్‌ పోలీస్‌ ఉన్నతాఽధికారులు రంగ ప్రవేశం చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందంతో కేసును లోతుగా విచారిస్తున్నారు.


ఎక్కడెక్కడికి వెళ్లారు...? 

రాములు, సంతోషిలు బుధవారం మధ్యాహ్నం  హోటల్లో దిగినప్పటి నుంచి మరుసటి రోజు చనిపోయేంత వరకు ఇద్దరూ ఎన్నిసార్లు బయటకు వచ్చారు.. ఏయే సమయంలో వచ్చారు.. బయట ఎక్కడెక్కడకి వెళ్లారు.. ఎం కొన్నారు.. ఎం తిన్నారు.. వీరు గదిలో ఉన్న సమయంలో హోటల్‌ సిబ్బంది ఎన్నిసార్లు వారిని కలిశారు.. దేనికోసం కలిశారు.. హోటల్‌ సిబ్బంది కాకుండా ఇంకా ఎవరైనా వారి గదికి వెళ్లిన దాఖలాలు ఉన్నాయా.. ఇలా అన్నికోణాల్లో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తోంది. అంతేకాకుండా హోటల్‌లోని సీసీటీవీల్లో రికార్డయి ఉన్న ఫుటేజీలను, సైబరాబాద్‌, హైదరాబాద్‌ కమిషనరేట్స్‌ పరిధిలో రెండు రోజులు వారు తిరిగిన ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీలను విచారణ బృందం క్షణం క్షణం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. దాంతో పాటు.. మృతుల కుటుంబ సభ్యులను విచారిస్తూ, వారి స్టేట్‌మెంట్‌ను పరిశోధనా బృందం సభ్యులు రికార్డు చేస్తున్నారు. 


కీలకంగా మారనున్న ఫోరెన్సిక్‌ నివేదిక

జంట మృతుల కేసులో తలెత్తుతున్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకాలన్నా.. అనుమానాలు నివృత్తి కా వాలన్నా ఫోరెన్సిక్‌ రిపోర్టు కీలకంగా మారనున్నట్లు పో లీసులు తెలిపారు. దాంతో పాటు.. మృతదేహాలకు పో స్టుమార్టం చేసిన వైద్యులు ఇచ్చే పోస్టుమార్టం నివేదిక కూడా కీలకంగా మారుతుందని పేర్కొన్నారు. సం ఘటన జరిగిన హోటల్‌ గదిలో పోలీసులు స్వాధీనం చేసుకున్న మృతుల దుస్తులు, బ్యాగు, హత్యకు, ఆత్మహత్యకు ఉపయోగించిన బ్లేడ్‌, అక్కడ క్లూస్‌టీం సేకరించిన పలు ఆధారాలను ఎఫ్‌ఎ్‌సఎల్‌కు (ఫోరెన్సిక్‌ ల్యాబ్‌) పంపినట్లు పోలీసులు తెలిపారు. అక్కడి నుంచి ఫోరెన్సిక్‌ నిపుణులు ఇచ్చే నివేదిక ద్వారా అనేక ప్రశ్నలకు సమాధానం తెలుస్తుందన్నారు. 


ఓపెన్‌ కాని మృతుల స్మార్ట్‌ ఫోన్‌లు

మృతుల కాల్‌డేటా కూడా ఈ కేసులో కీలకంగా మారనున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే హోటల్‌ గదిలో పోలీసులు మృతుల రెండు స్మార్ట్‌ఫోన్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో రాములు సెల్‌ఫోన్‌ కిందపడి డిస్‌ప్లే పగిలిపోయి ఉంది. సంతోషి ఫోన్‌కూడా ఓపెన్‌ కావడంలేదు. ఈ రెండు ఫోన్‌లను పోలీసులు ఎఫ్‌ఎ్‌సఎల్‌కు పంపారు. వాటిని ఓపెన్‌ చేసిన తర్వాత.. మృతులు ఇద్దరూ రోజూ ఎవరెవరితో టచ్‌లో ఉన్నారు..? ఇద్దరికి మధ్యలో ఎవరైనా కామన్‌ ఫ్రెండ్స్‌ ఉన్నారా..? ఇదంతా వారికి తెలిసి ఉంటుందా..? ఇలా అనేక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. 


పధకం ప్రకారమే బ్లేడ్‌తో వచ్చాడా..?

మృతుడు రాములు.. ముందస్తు పధకం ప్రకారమే ప్రియురాలిని తీసుకొని హోటల్‌కు వచ్చాడని, వచ్చేటప్పుడే బ్లేడ్‌ వెంట తెచ్చుకొని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అలాంటి ఉద్దేశం లేనివాడైతే కొత్తబ్లేడ్‌ కొనుక్కొని హోటల్‌కు రావాల్సిన అవసరం లేదన్న వాదన వినిపిస్తోంది. రోజుకు రూ. 3వేలు చెల్లించి  ఓహోటల్‌లో ఉండేంత అవసరం కానీ, స్తోమత గానీ వారికి లేవు. అలాంటప్పుడు అంత పెద్ద హోటల్‌ను ఎందుకు ఎంచుకున్నాడు అని పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం సేకరించిన ఆధారాలను బట్టి మృతుడు రాములు కావాలనే ముందస్తు పధకం ప్రకారమే ఈ హోటల్‌ను ఎంపిక చేసుకున్నట్లు, పెళ్లి సమస్య పరిష్కారం కాకపోతే ప్రియురాలిని చంపి, తాను ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏది ఏమైనా పది పదిహేను రోజుల్లో ఫోరోన్సిక్‌, పోస్టుమార్టం రిపోర్టులు వస్తాయి. అప్పుడు అన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులు 

Updated Date - 2021-08-01T07:25:25+05:30 IST