హత్య కేసులో పది మంది నిందితుల అరెస్టు

ABN , First Publish Date - 2021-01-21T06:15:13+05:30 IST

చింతూరు మండలం నర్సింగపేటకు చెందిన పర్శిక భద్రయ్య హత్య కేసులో పది మంది నిందితులను బుధవారం అరెస్టు చేసినట్టు డీఎస్పీ ఖాదర్‌బాషా తెలిపారు.

హత్య కేసులో పది మంది నిందితుల అరెస్టు

చింతూరు, జనవరి 20: చింతూరు మండలం నర్సింగపేటకు చెందిన పర్శిక భద్రయ్య హత్య కేసులో పది మంది నిందితులను బుధవారం అరెస్టు చేసినట్టు డీఎస్పీ ఖాదర్‌బాషా తెలిపారు. ఇటీవల చింతూరు మండలం నర్సింగపేటకు చెందిన పర్శిక భద్రయ్యతో పాటు, పాలగూడానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు అన్నెం వేణుగోపాల్‌పై కత్తితో దాడి జరిగిందన్నారు. సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌ఘఢ్‌కు చెందిన తాతి లక్మా, వంజం బండి, మడకం ఇడమ, కొవ్వాసి ఇడమ, బడిసె ఇడమ, సోడి హుర్రా, సోడి గంగా, బడిసె చూల, తాతి భీమ, కట్ట ఇడమ ఈ దాడికి పాల్పడినట్లు తమ విచారణలో తేలిందన్నారు. ఆర్థిక లావాదేవీల్లో జరిగిన వివాదమే భద్రయ్య హత్యకు దారి తీసిందన్నారు. ఇక ఆర్‌ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్న అన్నెం వేణుగోపాల్‌కు నిందితులలో ఒకరైన వంజం బండికి నడుమ గతంలో వివాదం జరగడంతో అతనిపై కూడా దాడి చేశారన్నారు. గతంలో ఒకసారి  వంజం బండి తన సోదరుడికి ఆరోగ్యం  బాగోలేకపోవడంతో  ఆర్‌ఎంపీ వైద్యుడు అన్నెం వేణుగోపాల్‌ దగ్గరకు వైద్యం నిమిత్తం తీసుకువెళ్లాడు. అయితే చికిత్స అనంతరం వేణుగోపాల్‌ ఫీజు రూపంలో ఎక్కువ సొమ్ములు డిమాండ్‌ చేయడంతో బండికి, వేణుగోపాల్‌కు నడుమ ఘర్షణ జరిగింది. దీంతో నిందితులంతా ఒక గ్రూప్‌గా ఏర్పడి ముందు వేణుగోపాల్‌పై కత్తితో దాడి చేశారని తెలిపారు. తర్వాత ఇదే క్రమంలో ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో పర్శిక భద్రయ్యను హత్య చేశారని డీఎస్పీ తెలిపారు. నిందితులంతా ఛత్తీస్‌ఘడ్‌లోని సుక్మా జిల్లా గంగరాజు పాడు, దుర్మా గ్రామాలకు చెందినవారని తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు పంపినట్టు డీఎస్పీ ఖాదర్‌ బాషా తెలిపారు.  ఆయన వెంట సీఐ యువకుమార్‌, ఎస్‌ఐ సురేష్‌బాబు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-21T06:15:13+05:30 IST