Abn logo
Nov 23 2020 @ 00:38AM

మురుగు ఎప్పుడు కనుమరుగు..!

Kaakateeya

నగరంలో నిజాం నాటి వ్యవస్థ  

చిన్న వర్షానికే రోడ్లన్నీ జలమయం

రోజుకు వందల కొద్దీ సమస్యలు  

సివరేజీ మాస్టర్‌ ప్లాన్‌ అవసరం

హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 22 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఎన్నికలప్పుడు సహజంగానే ప్రజల జీవన స్థితిగతులు చర్చకు వస్తాయి. పాలకులకు వారి బాధ్యతలను మరోసారి గుర్తు చేస్తాయి. సిటీ మురుగునీటి పారుదల వ్యవస్థ అలాంటి అంశాలలో ఒకటి. ఈ సమస్య ఒకరిదో, ఇద్దరిదో.. ఒక పార్టీదో, ఒక ప్రభుత్వానిదో కాదు. అందరిదీ. మొత్తం నగరానిది. పైపై రిపేర్లతో నడుస్తున్న ఈ వ్యవస్థకు సంబంధించి కొత్త ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉంది. ఇదే జరిగితే.. ఈ నగరానికి చాలా గొప్ప మేలు జరిగినట్లే. 

వర్షాకాలంలోనే కాదు.. సాధారణ రోజుల్లో కూడా రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తోంది. నిజాం కాలం నాటి మురుగునీటి వ్యవస్థ మహానగరానికి ఏ మాత్రం సరిపోవడం లేదు. నగరాల్లో వరద నీటి, మురుగునీటి వ్యవస్థలు వేర్వేరుగా ఉండాలి. కానీ, నగరంలో పలు ప్రాంతాల్లో ఒకే వ్యవస్థ ఉండటంతో ప్రజలతో పాటు, ఈ ఇబ్బందులు తప్పించడం క్షేత్ర స్థాయి సిబ్బందికి కూడా సవాల్‌గా  మారింది. మురుగు, వరద నీటి వ్యవస్థలు వేర్వేరుగా ఉండాలని అధికారులు నివేదికలు రూపొందించినా అవి పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చడం లేదు. 

వందేళ్ల క్రితం మూసీ వరదలు ముంచెత్తినప్పుడు అప్పటి అవసరాలకు అనుగుణంగా నిజాం నవాబు మురుగునీటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రముఖ ఇంజనీర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య నేతృత్వంలో ఈ వ్యవస్థ ఏర్పాటైంది. నాటి మురుగునీటి వ్యవస్థను 1981లో రీమోడలింగ్‌ చేసి, సివరేజీ వ్యవస్థను అభివృద్ధి చేశారు. రోజురోజుకూ నగర విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. పెరిగిన అవసరాల మేరకు సివరేజీ వ్యవస్థను మెరుగు పరిచేందుకు ప్రపంచ బ్యాంకు నిధులతో చర్యలు చేపట్టారు. అయితే, పాత వ్యవస్థకే మెరుగులు దిద్దడం మినహా, వర్తమాన అవసరాలకు తగినట్లు ఆధునికీకరించలేదు. ప్రస్తుతం కోర్‌సిటీలోనే రోజుకు సుమారు 500 నుంచి 700 వరకు సివరేజీ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో రోడ్లపై మురుగునీరు పరుగులు తీస్తోంది. ఇక వర్షాకాలంలో ఓవర్‌ఫ్లో సమస్యలకు లెక్కే లేదు. నగరంలో రెండు సెంటీమీటర్ల వర్షం కురిసినా తట్టుకునే సామర్థ్యం నగర వరద నీటి వ్యవస్థకు లేదు. సిటీలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వరద నీటి వ్యవస్థ ఉంది. 

ఎక్కడికక్కడే కబ్జాలు

నార్త్‌ జోన్‌లోని సికింద్రాబాద్‌, బేగంపేట, కంటోన్మెంట్‌, అమీర్‌పేట్‌, మల్కాజిగిరి తదితర ప్రాంతాలతో పోలిస్తే సౌత్‌ జోన్‌లోనే డ్రైనేజీ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో మురుగునీటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. మరోపక్క నగరంలోని పలు ప్రాంతాలలో వరదనీటి కాలువలతో పాటు, పక్కన ఉన్న స్థలాలు చాలావరకు కబ్జా అయ్యాయి. ఒకప్పుడు మురుగునీటి వ్యవస్థ కోసం ఏర్పాటు చేసిన నాలాల వెంట  ఖాళీ స్థలం ఉండేది. దీంతో ఈ స్థలాల్లో నీరు ఇంకేది. ఇప్పుడు ఖాళీ స్థలం సంగతి పక్కన పెడితే, చాలా వరకు ఉన్న నాలాలే కబ్జాకు గురయ్యాయి. 

శివారు ప్రాంతాలు మురికికూపాలు

గ్రేటర్‌లో విలీనమైన శివారు ప్రాంతాలలో సివరేజీ వ్యవస్తను జీహెచ్‌ఎంసీ నిర్వహిస్తోంది. శివారు ప్రాంతాల్లో సీవరేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో ఆయా కాలనీలన్నీ మురికి కూపాలుగా మారుతున్నాయి. శివారు ప్రాంతాల్లో కొన్ని చోట్ల సివరేజీ వ్యవస్థ లేకున్నా నీటి బిల్లుల వసూళ్ల సందర్భంగా సివరేజీ సెస్‌ అంటూ బిల్లు వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా నీటి సరఫరా వ్యవస్థను ఓ శాఖ, మరుగునీటి నిర్వహణ వ్యవస్థను నిర్వహించడం వల్ల శివారు ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 

సివరేజీ మాస్టర్‌ ప్లానే గత్యంతరం

నగరానికి మెరుగైన సివరేజీ మాస్టర్‌ ప్లాన్‌ అవసరమని పలువురు ఇంజనీర్లు, పలు కమిటీలు చెబుతున్నాయి. వివిధ ఏజెన్సీలు సైతం దీనిపై నివేదికలు ఇచ్చాయి. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ. పది వేల కోట్లు వ్యయమవు తుందని అంచనా వేశారు. ఏడాది క్రితం ఓ కన్సల్టెన్సీ  వారు ప్రాంతాలకు సివరేజ్‌ మాస్టర్‌ప్లాన్‌ నివేదికను ఇవ్వగా, సుమారు రూ.2,870 కోట్లు అవుతాయని అంచనా వేశారు.


Advertisement
Advertisement