త్యాగాలకు సిద్ధంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-02-20T06:06:20+05:30 IST

బడుగు బలహీనవర్గాలు త్యాగాలకు సిద్ధంగా ఉండాలని, లేకపోతే హక్కులు రావని బహుజన సమాజ్‌ పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు.

త్యాగాలకు సిద్ధంగా ఉండాలి
మాట్లాడుతున్న బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

-లేకపోతే హక్కులు రావు

-బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

సుభాష్‌నగర్‌, ఫిబ్రవరి 19: బడుగు బలహీనవర్గాలు త్యాగాలకు సిద్ధంగా ఉండాలని, లేకపోతే హక్కులు రావని బహుజన సమాజ్‌ పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. శనివారం కరీంనగర్‌లోని రెవెన్యూ గార్డెన్‌లో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు నిషాని రాంచంద్రం ఆధ్వర్యంలో బీసీ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ మనువాద శక్తులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ జాతులను విభజించి సంవత్సరాలుగా సంక్షేమ ఫలాలను అందకుండా చేస్తున్నారన్నారు. తాను గురుకులాల కార్యదర్శిగా పనిచేసిన సమయంలో సింధూజ అనే అమ్మాయి పేదింటి అమ్మాయి చదువుకుంటానని పట్టుబట్టిందని, ఆమెను గురుకులంలో చేర్పించామని, ప్రస్తుతం ఆమె అతి చిన్న వయస్సులో ఉన్న చార్టెర్డ్‌ అకౌంట్‌ అయ్యిందన్నారు.  కాంగ్రెస్‌, బీజేపీ, టీఆర్‌ఎస్‌  ఆధిపత్య కులాల చేతుల్లోనే ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆరోగ్య సమస్యలు వస్తే యశోద ఆసుపత్రికి వెళ్తాడని, తాను గాంధీ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందానని తెలిపారు. బహుజన రాజ్యం వస్తే ప్రభుత్వ ఆసుపత్రులు, విద్యాసంస్థలు కార్పొరేట్‌ సంస్థలకంటే దీటుగా అభివృద్ధి చేస్తామన్నారు. గతంలో మతాల మధ్య చిచ్చు పెట్టేవారని, కేసీఆర్‌ కులాల మధ్య కుమ్ములాట పెడుతున్నారని విమర్శించారు. రాజ్యాంగం మార్చాల్సిన అవసరం ముఖ్యమంత్రికి ఏమొచ్చిందని ప్రశ్నించారు. దీనిపై తామంతా ఆందోళన చేపడితే అధికార పార్టీలో ఉన్న రసమయి బాలకిషన్‌, బాల్క సుమన్‌, గువ్వల బాలరాజు లాంటి వారు కేసీఆర్‌ భజన చేస్తున్నారని విమర్శించారు. ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్లు పెంచడానికి, బీసీల కుల గణన చేయడాన్ని ఏ రాజ్యాంగం ఆపిందని ప్రశ్నించారు. జనాభాలో 52 శాతం ఉన్న బీసీలకు అదే స్థాయిలో సీట్లను కేటాయిస్తామన్నారు. దేశంలో అత్యధికంగా 4 లక్షల 25 వేల రూపాయల వేతనం తీసుకునేది ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక్కరేనని, ఎంతో కష్టపడుతున్న మధ్యాహ్న భోజన వంట కార్మికులు కనీస వేతనం కోసం పోరాటం చేస్తే పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. గడీలను శిథిలం చేయడానికే బహుజన సమాజ్‌ పార్టీ వచ్చిందన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన మీటింగ్‌ ప్రకంపనలు తెలంగాణ అంతటా వ్యాపించాలన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ బీసీ సెల్‌ నాయకుడు గుర్రం సత్యనారాయణ, టీఆర్‌ఎస్‌ నాయకుడు వేల్పుల పోచయ్య, మేకల రవీందర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ సమక్షంలో బీఎస్పీలో చేరారు. కార్యక్రమంలో పల్లె ప్రశాంత్‌గౌడ్‌, మాతంగి అశోక్‌, ఎనగందుల వెంకన్న,  సదుర్ల మల్లేశం, గంగాధర్‌, దండ రవీందర్‌, దాసరి ఉష, పుప్పాల లింబాద్రి, సమ్మయ్య, జన్ను స్వరూప, అక్కెనపెల్లి శిరీష, శీలం రాజయ్య పాల్గొన్నారు. 



Updated Date - 2022-02-20T06:06:20+05:30 IST